Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 08 Feb 2023 09:15 IST

1. మధుమేహంతో ‘డి’!

డి విటమిన్‌ను ఎక్కువగా తీసుకోవడం వల్ల మధుమేహం నుంచి రక్షించుకునే అవకాశం ఉందని అమెరికా శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ వ్యాధికి ముందు దశలో ఉన్న వారు టైప్‌-2 డయాబెటిస్‌ బారినపడే ముప్పును ఇది తగ్గిస్తుందని వివరించారు. సూర్యుడిలోని అతినీలలోహిత కిరణాలు చర్మాన్ని తాకినప్పుడు శరీరం డి విటమిన్‌ను ఉత్పత్తి చేస్తుంది. కొన్ని రకాల ఆహారాలు, సప్లిమెంట్లలో ఇది ఉంటుంది. ఇది కొవ్వులో కరిగిపోతుంది. శరీరంలో భిన్న విధులు నిర్వర్తిస్తుంది. ఇన్సులిన్‌ ఉత్పత్తి, గ్లూకోజ్‌ జీవక్రియలో దీనికి పాత్ర ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. అభ్యర్థుల గోడు వినండి.. మొదటి కీలో ఒకలా.. తుది కీలో మరోలా!

పోలీసు కానిస్టేబుల్‌ పరీక్ష ఫలితాల్లో ఒక ప్రశ్నకు సంబంధించి ఏపీ స్టేట్‌ లెవెల్‌ పోలీసు రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఏపీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) విడుదల చేసిన ‘కీ’లలో సమాధానాలను ఒక్కోసారి ఒక్కోలా పేర్కొనడంపై పలువురు అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. సరైన రెండు ఆప్షన్లను పరిగణనలోకి తీసుకోకపోవడంతో అర్హత మార్కుల దగ్గరకొచ్చిన వారు నష్టపోతున్నారు. రెండింటినీ పరిగణనలోకి తీసుకోవాలని ఇప్పటికే కొందరు ఈ-మెయిల్‌ ద్వారా బోర్డుకు విన్నవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఆస్ట్రాజెనెకా టీకాతో గుండెపై దుష్ప్రభావాలు

కొవిడ్‌-19పై పోరుకు ఆక్స్‌ఫర్డ్‌-ఆస్ట్రాజెనెకా సంస్థలు ఉత్పత్తి చేసిన టీకా వల్ల గుండెపై తీవ్ర ప్రభావం పడే అవకాశాలున్నాయని భారత సంతతికి చెందిన ప్రముఖ హృద్రోగ నిపుణుడు అసీమ్‌ మల్హోత్రా పేర్కొన్నారు. ఈ టీకాను భారత్‌లో కొవిషీల్డ్‌ పేరుతో ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాక్సిన్‌ వల్ల గుండెపోటు, పక్షవాతం, రక్తంలో గడ్డకట్టడం వంటి సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని మల్హోత్రా తెలిపారు. ఈ తరహా దుష్ప్రభావాలు ఉన్నాయంటూ ఎంఆర్‌ఎన్‌ఏ కొవిడ్‌ టీకాలను నిషేధించాలని ఆయన చాలాకాలంగా డిమాండ్‌ చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఈ రోడ్లు.. నరకానికి నకళ్లు

ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో రహదారులు ప్రయాణికులకు నరకం చూపిస్తున్నాయి. మారుమూల పల్లెల నుంచి ప్రధాన పట్టణాల వరకు అన్ని చోట్లా మట్టి రోడ్డు కన్నా అధ్వానంగా మారిన రోడ్లు జనాన్ని ఇబ్బంది పెడుతున్నాయి. చాలారోడ్లు దశాబ్దకాలంగా కనీస మరమ్మతులకూ నోచుకోలేదు. అరకొరగా బాగుచేసినవీ వర్షాలకు ఊడ్చిపెట్టుకుపోయాయి. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న 3,507 కి.మీ. రహదారుల్లో దాదాపు 70 శాతం దారులు ఛిద్రమయ్యాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. వైరస్‌ పితామహుడు

ప్పుడంటే రకరకాల వైరస్‌ల గురించి వింటున్నాం గానీ మొట్టమొదటగా గుర్తించిన వైరస్‌ పేరేంటో తెలుసా? టొబాకో మొజాయిక్‌ వైరస్‌. దీన్ని ఇవానోస్కీ అనే శాస్త్రవేత్త 1892లో గుర్తించారు. అప్పట్లో ఇది పొగాకు చెట్లను నాశనం చేసేది. ఆకుల మీద టైల్స్‌ ఆకారంలో మచ్చలను కలిగించేది. బ్యాక్టీరియా లేదా విషతుల్యాలు దీనికి కారణం కావొచ్చని అనుకునేవారు. బ్యాక్టీరియాను వడగట్టే ఛాంబర్‌లాండ్‌ ఫిల్టర్‌ క్యాండిల్‌తో పొగాకు ఆకుల సారాన్ని వడపోసినా చీడ విస్తరిస్తోందని ఇవానోస్కీ గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. శ్రద్ధాను చంపి.. చికెన్‌ రోల్‌ తిన్నాడు

శ రాజధాని నగరంలో సంచలనం రేపిన శ్రద్ధావాకర్‌ (27) హత్యకేసులో పోలీసులు దాఖలు చేసిన 6,629 పేజీల చార్జిషీటు పలు విస్తుగొలిపే అంశాలను వెల్లడిస్తోంది. జనవరి నెలాఖరులో దాఖలు చేసిన ఈ చార్జిషీటులో దాదాపు 150 మంది సాక్షుల వాంగ్మూలాలను పోలీసులు నమోదు చేశారు. శ్రద్ధా హత్య జరిగిన రోజు ఆమె ప్రియుడు, నిందితుడైన ఆఫ్తాబ్‌ (28) జొమాటో ద్వారా చికెన్‌ రోల్‌ తెప్పించుకొని తిన్నట్లు చార్జిషీటులో పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ‘ఈ’ రేసు ఇలా..

దాదాపు రెండు నెలల కిందట మోటార్‌ స్పోర్ట్స్‌ అభిమానుల్ని అలరించిన రేసుల పండుగ మళ్లీ వచ్చింది. ఇండియన్‌ రేసింగ్‌ లీగ్‌ (ఐఆర్‌ఎల్‌) హైదరాబాదీలకు మోటార్‌ స్పోర్ట్స్‌ను పరిచయం చేయగా.. ఇప్పుడు అసలు సిసలు రేసులకు భాగ్యనగరం ఆతిథ్యమివ్వనుంది. ఎఫ్‌ఐఏ ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా నాలుగో రేసుకు హైదరాబాద్‌ వేదికగా నిలవనుంది. గంటకు 322 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే ఫార్ములా ఈ కార్లతో శుక్ర, శనివారాల్లో హుస్సేన్‌ సాగర తీరం హోరెత్తిపోనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నట్టేట ముంచేలా.. నెట్టింట మోసాలు

ప్రతి పది మందిలో ఎనిమిది మంది తమ సెల్‌ఫోన్లలో అంతర్జాలాన్ని వినియోగిస్తున్నారు. కావాల్సిన వస్తువులు కొనటం, నచ్చిన సినిమాలు చూడటం, ఇతర పనులు చక్కబెట్టుకునే క్రమంలో సైబర్‌ నేరగాళ్లకు చిక్కుతున్నారు. తేరుకునేలోపే బ్యాంకు ఖాతాల్లో సొమ్ము మాయమవుతుండటంతో నిశ్చేష్టులవుతున్నారు. అంతర్జాల సురక్షిత దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. క్షణికావేశం.. తీరని విషాదం

 ‘అమ్మా నేను పోలీసు ఉద్యోగం సాధించి నాన్నను, నిన్ను ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటా’ అని చెప్పిన కుమారుడు మృతిచెందిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. హృదయాన్ని కలిచివేసే ఈ  ఘటన వరంగల్‌ జిల్లా చెన్నారావుపేట మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. వ్యవసాయ కూలీ పనులు చేసుకుంటూ పిల్లల్ని చదివించుకుంటున్న దంపతులకు కూతురు, కుమారుడు (14) ఉన్నారు. కుమారుడు స్థానిక ఉన్నత పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. పోలీసులు, గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. వరంగల్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన తల్లితో కుమారుడు ఉంటున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఛాటింగ్‌ టైప్‌రైటర్‌!

టైప్‌రైటర్‌తో ఏం చేస్తాం? టైపింగ్‌ చేస్తాం. ఇంకేం చేస్తాం? మామూలు టైప్‌రైటర్‌తో ఎవరైనా ఇదే చేస్తారు. కానీ అర్వింద్‌ సంజీవ్‌ అనే ఇంజినీర్‌ రూపొందించిన టైప్‌రైటర్‌తో ఛాటింగూ చేయొచ్చు. నమ్మబుద్ధి కావటం లేదా? ఇది కృత్రిమ మేధతో పనిచేస్తుంది మరి. దీని పేరు ఘోస్ట్‌రైటర్‌. ఛాట్‌ జీపీటీ మాదిరిగా ఇదీ టైప్‌ చేసేవారితో ఛాట్‌ చేస్తుంది. ఉదాహరణకు- నువ్వెవరు? అని ఇంగ్లిష్‌లో టైప్‌ చేశారనుకోండి. మన ప్రమేయం ఏమీ లేకుండానే ‘నేను ఘోస్ట్‌రైటర్‌ని’ అని మొదలెట్టి తన కథంగా టైప్‌ చేసి చూపిస్తుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని