Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 05 Mar 2023 09:09 IST

1. ‘డార్ట్‌’ ఢీ కొట్టాక ఏం జరిగిందంటే..!

డైమార్ఫోస్‌ అనే గ్రహశకలాన్ని ‘డార్ట్‌’ వ్యోమనౌక ఢీ కొట్టినప్పుడు రోదసిలోని హబుల్‌ టెలిస్కోపు వరుసగా ఫొటోలు తీసినట్లు అమెరికా అంతరిక్ష సంస్థ-నాసా ప్రకటించింది. వాటిని గుదిగుచ్చి టైమ్‌ ల్యాప్స్‌ వీడియోను సిద్ధం చేసినట్లు తెలిపింది. అందులో ఆశ్చర్యకరమైన అంశాలు వెలుగు చూశాయి. ఢీ వల్ల గ్రహశకలం నుంచి అంతరిక్షంలోకి ఎగిసిన ధూళి, శకలాలు కళ్లకు కట్టాయి. ఈ క్రమంలో గంటగంటకూ జరిగిన మార్పులు స్పష్టంగా కనిపించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. గాంబియా మరణాలకు కారణం అదే

భారత్‌లో తయారైన కొన్ని కలుషిత దగ్గుమందుల వినియోగం వల్లే గాంబియాలో పిల్లల మరణాలు సంభవించాయని అమెరికా వ్యాధుల నియంత్రణ, నివారణ కేంద్రం(సీడీసీ), గాంబియా ఆరోగ్య అధికారుల సంయుక్త దర్యాప్తు నిగ్గుతేల్చింది. భారత్‌కు చెందిన మైడెన్‌ ఫార్మాస్యూటికల్స్‌ సంస్థ గాంబియాకు ఎగుమతి చేసిన నాలుగు రకాల దగ్గు మందుల్లో నాణ్యత లేదని, వాటిని సేవించిన పిల్లల్లో ఎక్కువ మంది చనిపోయారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) గత అక్టోబరులో హెచ్చరించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ప్రైవేటు.. ఫీజు సెపరేటు

ఇంటర్మీడియట్‌ పరీక్షలకు ముందు మహానగరం పరిధిలోని కొన్ని ప్రైవేటు కళాశాలలు సరికొత్త దందాకు తెరతీశాయి. వివిధ రకాల ఫీజుల పేరుతో ఒక్కో విద్యార్థి నుంచి రూ.వేలల్లో అక్రమంగా వసూలు చేస్తున్నాయి. విద్యార్థుల అటెండెన్సు సరిపోవడం లేదంటూ కొన్ని కళాశాలలు భారీ వసూళ్లకు పాల్పడుతుంటే.. మరికొన్ని ల్యాబ్‌ ఫీజు పేరుతో ఇదే దారిలో నడుస్తున్నాయి. ఈ ఫీజులన్నీ చెల్లించకపోతే హాల్‌ టిక్కెట్లు ఇవ్వమంటూ హెచ్చరిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఏపీలో కుటుంబ రాజకీయాలతో నష్టం

‘ఆంధ్రప్రదేశ్‌లో కుటుంబ రాజకీయాలు ప్రజలకు నష్టం చేస్తున్నాయి. రాజకీయాల్లో నాయకులు అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సాగాలి కానీ.. కక్ష సాధింపులు, ప్రతీకారాలతో పొద్దుపుచ్చరాదంటూ’... కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. విశాఖలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘భారత్‌దర్శన్‌లో భాగంగా కేంద్రం అరకు, లంబసింగి వంటి పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి రూ.75 కోట్లు నిధులు మంజూరు చేసింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. లాంగ్‌ కొవిడ్‌తో గుండె, ఊపిరితిత్తుల సమస్యలు అధికం

కొవిడ్‌-19 ఉద్ధృతి తగ్గుముఖం పడుతున్నప్పటికీ.. ప్రజారోగ్యంపై అది మిగిల్చిన గాయాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇన్‌ఫెక్షన్‌ సోకిన ఏడాది తర్వాత దీర్ఘకాల కొవిడ్‌ బాధితులకు మరణం ముప్పు ఎక్కువని తాజా అధ్యయనం పేర్కొంది. వీరు గుండె, ఊపిరితిత్తుల సమస్యల బారినపడొచ్చని వివరించింది. అమెరికాలో నిర్వహించిన ఈ అధ్యయన వివరాలు ప్రముఖ వైద్య పత్రిక ‘జామా హెల్త్‌ ఫోరమ్‌’లో ప్రచురితమయ్యాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కొత్త జంటకు సరికొత్త బహుమతి

పెళ్లిళ్ల వేళ కల్యాణ మండపాలు వెలిగిపోతున్నాయి. అదే సమయంలో వధూవరుల మోమున కాంతిని మరింత పెంచాలంటే వారికి తగిన బహుమతి ఇవ్వాలి. ఏమివ్వాలి అని ఆలోచించే బదులు.. ఆన్‌లైన్‌ గిఫ్ట్‌కార్డులిస్తే వారికి ఇష్టమైన పద్ధతిలో వినియోగంచుకుంటారు కదా అనే ధోరణి ఇటీవలి కాలంలో బాగా పెరిగింది. కొత్త జంటలు పెళ్లి అనంతరం చేసే విహార యాత్రలకు ఉపకరించే ‘షాగున్‌’ కార్డుల విక్రయాలు ఈ పెళ్లిళ్ల సీజను(డిసెంబరు 2022-జనవరి 2023)లో ఏకంగా 30 శాతం పెరగడం చూస్తుంటే..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. చీతాలను... ఎందుకు తెచ్చుకున్నామంటే...

పేరుకి క్రూరమృగమే. కానీ కనుకొలకుల నుంచి నోటివరకూ ఎవరో కాటుకతో గీత గీసినట్లున్న చారల ముఖంతోనూ పోల్కాడాట్స్‌ దుస్తులేసుకున్నట్లుగా ఒంటి నిండుగా ఉన్న చుక్కలతోనూ పొడవాటి కాళ్లతోనూ అందంగా ఉంటుంది చీతా... గాలిని చీల్చుకుంటూ మెరుపు వేగంతో దూసుకెళ్లే ఏకైక ప్రాణి... పరుగుకి మరో పేరు. అది మన దేశంలో అంతరించిపోయింది, ఇక లేదు అనుకున్న తరుణంలో- ఒకటీ రెండూ కాదు, 20 చీతాలు ఆఫ్రికా ఖండం నుంచి ఆకాశయానాన ప్రయాణించి మరీ భారత భూభాగంలోకి అడుగు పెట్టాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. దొంగతనానికే గుడికి!

ఎవరైనా ఆలయానికి దేవుణ్ని దర్శించుకోవడానికో, మొక్కులు చెల్లించుకోవడానికో వెళుతుంటారు. మరి ఉత్తరాఖండ్‌లోని చూడామణి ఆలయానికి మాత్రం దొంగతనం చేయడానికి వెళతారట. నమ్మలేకపోతున్నారు కదూ... రూర్కీ సమీపంలో ఉన్న చూడామణి దేవి ఆలయంలో వందల ఏళ్లుగా ఈ ఆచారం ఉంది. సంతానంలేని దంపతులు అమ్మవారి పాదాల వద్ద ఉన్న చెక్క బొమ్మను దొంగిలిస్తే పిల్లలు పుడతారని భక్తుల నమ్మకం. సంతాన ఆలయంగా పేరొందిన ఈ గుడి గురించి ఓ పురాణ గాథ ప్రచారంలో ఉంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. అధిక పింఛనుపై ఏ నిర్ణయం తీసుకున్నా ఒప్పుకోవాలి

ఏదైనా పథకంలో పెట్టుబడి పెట్టినా, అందులో చేరినా చివర్లో వచ్చే ప్రతిఫలం ముందుగానే వెల్లడించి ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు వివిధ రకాల పెట్టుబడి పథకాల్లో చేర్చుకుంటాయి. ఆ మేరకు ప్రతిఫలం దక్కుతుంది. కానీ అధిక పింఛను పథకంలో చేరేందుకు ఆన్‌లైన్లో అందుబాటులోకి వచ్చిన దరఖాస్తులో ఈపీఎఫ్‌వో పేర్కొన్న షరతులు అర్హులైన పింఛనుదారుల్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

10. ఆంగ్లం.. కాస్త కష్టపడుదాం

ఆంగ్లం అనగానే ప్రతి విద్యార్థికి ఎంతో కొంత భయం ఉంటుంది. ప్రత్యేక ధ్యాస పెట్టి.. పదాలు అర్థం చేసుకొని, తప్పులు లేకుండా రాయగలిగితే.. మంచి మార్కులు సాధ్యం. పదాల అర్థాలు తెలియాలంటే నిఘంటువును ఆశ్రయించాల్సిందే. వ్యాసాలలో పదాల కూర్పు తప్పనిసరి. ఈ సారి పది ఆంగ్లం ప్రశ్నాపత్రంలో పలు మార్పులు చేశారు. గతంలో పేపర్‌-1, 2గా ఉండేది. ఈ సారి ఒకే పేపర్‌గా మారింది. పార్ట్‌-ఏలో 60 మార్కులు, బిలో 20 మార్కులు ఉంటాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు