Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 20 May 2023 09:23 IST

1. ఆ రెండు.. ముందుకెళ్లేనా?

ఐపీఎల్‌లో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదేమో..! మరొక్క రోజులో లీగ్‌ దశ ముగియనున్నా ప్లేఆఫ్స్‌ చేరే మిగతా మూడు జట్లేవో తేలలేదు. మిగిలింది నాలుగు మ్యాచ్‌లే..! ముందంజ వేయడం కోసం ఆరు జట్లు ఇంకా రేసులోనే ఉన్నాయి. 15 పాయింట్లతో ప్లేఆఫ్స్‌కు చేరువగా ఉన్న చెన్నై, లఖ్‌నవూ శనివారం తమ ఆఖరి లీగ్‌ మ్యాచ్‌లను ఆడనున్నాయి. కోల్‌కతాతో లఖ్‌నవూ ఢీకొననుండగా.. దిల్లీతో చెన్నై తలపడనుంది. చెన్నై, లఖ్‌నవూ గెలిస్తే చెరో 17 పాయింట్లతో మిగతా ఫలితాలతో సంబంధం లేకుండా నేరుగా ప్లేఆఫ్స్‌ బెర్తులు సాధిస్తాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. నీళ్ల సీసాతో జర జాగ్రత్త!

ఆరోగ్యంపై జాగ్రత్త, సామాజిక అవగాహన కారణం ఏదైతేనేం.... ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా వెంట ఓ నీళ్లసీసాను తీసుకెళ్తున్నారు. అంతవరకూ బాగానే ఉన్నా... దీన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయకపోతే మాత్రం అనారోగ్యాలు తప్పవు. అసలు ఎలాంటివి వాడాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలి? చూద్దామా?తక్కువ ధరకే దొరుకుతాయి. చూడ్డానికీ బాగుంటాయి అనే కారణంతో చాలామంది ప్లాస్టిక్‌ సీసాలను వాడుతుంటారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అధికారంలోకి వస్తా.. అన్నీ పూర్తి చేస్తా

 ‘వెనుకబడిన విజయనగరం అభివృద్ధికి ఎంతో కృషి చేశా. ఎన్నో ప్రాజెక్టులు మంజూరు చేసి నిధులిచ్చా.. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిపై శీతకన్ను వేసింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత రాష్ట్రంలోని 134 బీసీ కులాల వారికి ఎన్టీఆర్‌ పెద్దపీట వేశారు.  నేను స్థానిక సంస్థల్లో రిజర్వేషన్‌ కోటా 35 శాతానికి పెంచా. వైకాపా దాన్ని 24 శాతానికి తగ్గించింది. పెందుర్తి-అరకు ఆరు వరుసల రోడ్డు నిర్మాణానికి అప్పట్లో ప్రతిపాదించా. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మెమూ రైలుతో తప్పని పాట్లు

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌లోని కర్నూలు తర్వాత పెద్ద స్టేషను మహబూబ్‌నగర్‌. ఇప్పటికే ఇక్కటి నుంచి విశాఖపట్నానికి వారంతపు రైలు నడుస్తోంది. రోజు నడిచేలా చర్యలు చేపట్టాలని ప్రయాణికులు పట్టుబట్టడంతో కేంద్రం విశాఖ - కాచిగూడ రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగించింది. 12862 మహబూబ్‌నగర్‌ - విశాఖపట్నం రైలును శనివారం సాయంత్రం 4.10 గంటలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి మహబూబ్‌నగర్‌ రైల్వే స్టేషన్‌లో జెండాఊపి ప్రారంభించనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఏపీలో ఇక ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ ఎక్కడికక్కడే!

ఏపీలో ‘ఎనీవేర్‌ రిజిస్ట్రేషన్‌’ విధానంలో వచ్చేనెల ఒకటో తేదీ నుంచి కీలక మార్పు జరగనుంది. ఎనీవేర్‌ కింద వచ్చిన దస్తావేజులను సదరు సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయం నుంచి ఆ ఆస్తి ఉన్న ప్రాంతానికి చెందిన సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయానికి పంపించాల్సిన అవసరం లేదు. ఆ ప్రాంతానికి చెందిన ఆస్తిగా భావించి ఆన్‌లైన్‌లో ఉన్న సమాచారాన్ని నిర్థారించుకుని రిజిస్ట్రేషన్‌ చేయాలని రాష్ట్ర రిజిస్ట్రేషన్‌ అండ్‌ స్టాంపుల శాఖ  ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. వాలంటీర్లను నాయకుల్ని చేస్తా

 గ్రామ, వార్డు వాలంటీర్లను నాయకులుగా చేస్తానని ముఖ్యమంత్రి జగన్‌ పునరుద్ఘాటించారు. వాలంటీర్లను ఉద్దేశించి తాను చేసిన తొలి ప్రసంగంలోనూ ఇదే చెప్పానన్నారు. వాలంటీర్ల రాజకీయ హక్కులకు, అభ్యుదయ, ఆదర్శ భావాలకు అవరోధాలు ఏవీ ఉండవని సీఎం తెలిపారు. ఎవరైనా ఫలానా పని చేయకూడదని అంటే వాళ్లకు గట్టిగా సమాధానం చెప్పాలని వాలంటీర్లకు సూచించారు. వారానికి రెండుసార్లు వేసేది హాజరు కాదని.. ఏ సమయంలోనైనా ప్రభుత్వానికి సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రెజెన్స్‌ను మార్కు చేసే కార్యక్రమంగా ముఖ్యమంత్రి వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. దస్తగిరి క్షమాభిక్ష రద్దు పిటిషన్‌ను పరిగణించవద్దు

మాజీ మంత్రి వివేకా హత్య కేసులో అప్రూవర్‌గా మారిన దస్తగిరి క్షమాభిక్షను రద్దు చేయాలని వివేకా హత్యపై ఫిర్యాదు చేసిన ఎంవీ కృష్ణారెడ్డి పిటిషన్‌ వేశారని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ పరిగణనలోకి తీసుకోవద్దని వివేకా కుమార్తె సునీత సుప్రీంకోర్టుకు విన్నవించారు. ఎంవీ కృష్ణారెడ్డి వేసిన మిసిలేనియస్‌ అప్లికేషన్‌లో ఆమె శుక్రవారం ఇంప్లీడ్‌ అయ్యారు. బాధితుడి ముసుగులో కృష్ణారెడ్డి ఈ పిటిషన్‌ వేశారని జస్టిస్‌ కృష్ణమురారి, జస్టిస్‌ పీవీ సంజయ్‌కుమార్‌ల ధర్మాసనం ముందు విన్నవించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆహ్వానించి.. అవమానించారు!

చంటిపిల్లలను చంకన వేసుకొని వచ్చినవారు కొందరు.. గర్భిణులు కొంతమంది.. ఎండకు తాళలేక చెట్లకిందకు వెళ్లేవారు మరికొందరు. తిరిగి వెళ్లిపోతే ఏం ప్రమాదమో.. ఉంటే పోలీసుల అదిలింపులు.. శుక్రవారం విజయవాడలో సీఎం సభకు హాజరైన వాలంటీర్ల దుస్థితి ఇది.  ‘ఇక్కడ నిలబడవద్దు.. ట్రాఫిక్‌కు అంతరాయం.. దూరంగా వెళ్లండి..’ అని పోలీసుల హెచ్చరికలు ‘మమ్మల్ని తప్పక రావాలన్నారు. లేకపోతే.. చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు..’ పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ.2వేల నోట్లు డిపాజిట్‌ చేయకపోయినా, వెంటనే మార్చుకోకపోయినా ఏమవుతుంది?

చలామణి నుంచి రూ.2వేల నోటును ఉపసంహరించిన నేపథ్యంలో ప్రజల్లో నెలకొనే సందేహాల నివృత్తికి ప్రశ్నలు, జవాబుల రూపంలో కొంత సమాచారాన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ విడుదల చేసింది. అవి. 1. క్లీన్‌ నోట్‌ పాలసీ అంటే ఏంటి? ప్రజలకు మంచి నాణ్యమైన నోట్లు అందుబాటులో ఉంచడం.2. రూ.2వేల నోట్లు ఇప్పటికీ చెల్లుబాటు అవుతాయా? అవును. వాటి చెల్లుబాటు కొనసాగుతుంది.3. ఈ నోట్లను సాధారణ అవసరాలకు ఉపయోగించుకోవచ్చా? చేసుకోవచ్చు. ప్రజలు తమ రోజువారీ అవసరాల కోసం రూ.2వేల నోట్లు ఉపయోగించొచ్చు. ఎవరైనా చెల్లిస్తే తీసుకోవచ్చు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. పవన్‌.. కూలీ నంబర్‌వన్.. ఆయన రాజకీయాలకు పనికిరాడు: మంత్రి అంబటి

జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌.. కూలీ నంబర్‌ వన్‌ అని రాష్ట్ర జలవనరులశాఖ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో శుక్రవారం ఆయన విలేకర్ల సమావేశంలో పవన్‌ కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. పవన్‌ కల్యాణ్‌ రాజకీయాలకు అనర్హుడన్నారు. చంద్రబాబు సిగ్నల్‌ ఇస్తేనే వారాహి బయటకు వస్తుందా అని ప్రశ్నించారు. పవన్‌ ప్రచారానికి చంద్రబాబు అనుమతి కావాలన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు