Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 04 Jun 2023 09:13 IST

1. గుండెల్లో రైళ్లు.. అరచేతుల్లో ప్రాణాలు

ఒడిశా రాష్ట్రంలోని రైలు ప్రమాదంతో ఉమ్మడి జిల్లా ఉలిక్కిపడింది. కోరమాండల్‌ రైల్లో వస్తూ 31 మంది రాజమహేంద్రవరంలో దిగాల్సి ఉండడంతో ముందు ఆందోళన వ్యక్తమైనా ఆరుగురు మినహా అందరి ఆచూకీ తెలియడంతో యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. ప్రమాదం నుంచి బయటపడినవారు తమ యాతన చెబుతూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని జిల్లాకు చేరుకున్నామన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. 14 మిశ్రమ ఔషధాలపై కేంద్రం నిషేధం

14 రకాలైన ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషన్‌ (ఎఫ్‌డీసీ) ఔషధాలను కేంద్ర ప్రభుత్వం నిషేధించింది. రెండు లేదా అంతకంటే ఎక్కువ ఔషధాలను కలిపి ఒకే ఔషధంగా ఆవిష్కరిస్తే, దాన్ని ఎఫ్‌డీసీ ఔషధంగా పరిగణిస్తున్నారు. ఈ మిశ్రమ ఔషధాల సహేతుకత నిర్ధారణ కాలేదని, పైగా వీటివల్ల ప్రజలకు ప్రమాదం తలెత్తవచ్చని ప్రభుత్వం వివరించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఒక నోటిఫికేషన్‌ జారీ చేసింది. నిమెసులైడ్‌-  పారాసెట్మాల్‌ డిస్‌పెర్సిబుల్‌ ట్యాబ్లెట్లు, క్లోఫెనిరమైన్‌ మలేట్‌- కొడైన్‌ సిరప్‌..  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. తడబడితే తప్పదు మూల్యం!

 సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని ఓ ప్రైవేటు పాఠశాలలో గత ఏడాది 8 మంది విద్యార్థులు పదో తరగతిలో చేరారు. పరీక్ష రాసే సమయానికి వారికి హాల్‌ టిక్కెట్లు అందలేదు. అదేమంటే పాఠశాలకు అనుమతి లేదని చెప్పారు. కంగుతిన్న విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఎంత ప్రయత్నించినా ఆ ఏడాది వార్షిక పరీక్షలు రాయలేకపోయారు. చివరకు సంగారెడ్డి డీఈవో కార్యాలయం ముందు ఆందోళన చేయగా స్పందించిన ప్రభుత్వం, సప్లిమెంటరీ పరీక్షలు రాసుకునేందుకు అనుమతి ఇచ్చింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. వినిపిస్తున్నాయ్‌.. ఆనాటి విషాద గీతికలు..!

రైలు ప్రయాణం..  సురక్షితమేనని అంతా భావిస్తారు.. ఒక్కోసారి జరిగే దుర్ఘటనలు ప్రయాణికుల కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తాయి. తీవ్ర విషాదాన్ని నింపుతాయి. ఒడిశాలోని బాలాసోర్‌ జిల్లాలో శుక్రవారం జరిగిన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రమాదం 287 మందిని బలిగొంది. ఈ ఘటనతో ఉమ్మడి జిల్లాలోని ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. జిల్లా ప్రజల కళ్లెదుట మాత్రం 2017 జనవరి 21న జరిగిన కూనేరు రైలు ప్రమాదం ఘటన కదలాడి, గుండె మరోసారి విషాదంతో బరువెక్కింది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సుర్రుమంటున్న సూరీడు!

భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు.. రోజు, రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతుండడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది వేసవి సీజన్‌లో తొలిసారిగా శనివారం జిల్లాలోని నర్సింహులపేట మండలం పెద్ద నాగారంలో 46 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత రికార్డు స్థాయిలో నమోదైంది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండలం తాడ్వాయి హట్స్‌లో కూడా 46 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది. జయశంకర్‌ జిల్లా మహదేవ్‌పూర్‌లో 45.5 సెంటిగ్రేడ్ల ఉష్ణోగ్రత నమోదైంది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కేంద్రం, రాష్ట్రంలో ప్రజాశాంతి పార్టీయే ప్రత్యామ్నాయం: పాల్‌

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తమతో కలిసిరావాలని ప్రధాన రాజకీయ పార్టీలు కోరుతున్నట్లు ‘ప్రజాశాంతి’ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. అయినా దేశ, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ఆయా ప్రతిపాదనలు తోసిపుచ్చుతున్నట్లు చెప్పారు. ఒకవేళ కలిసొచ్చే పార్టీలతో తాము రాష్ట్ర ఎన్నికల బరిలోకి దిగితే పోటీ పక్షాల అభ్యర్థులకు డిపాజిట్లూ దక్కవని వ్యాఖ్యానించారు. కొత్తగూడెంలోని ఓ ఫంక్షన్‌ హాలులో శనివారం మాట్లాడారు. కాంగ్రెస్‌ కుటుంబ పాలనతో రాష్ట్రం దివాలా తీస్తే... ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సీఎం కేసీఆర్‌ తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారని విమర్శించారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కొట్టేసిన తుపాకీ ఎక్కడ పేలుతుందో..?

ఓ దొంగ పోలీసులకు కునుకు లేకుండా చేస్తున్నాడు. తొమ్మిదేళ్లు గా అజ్ఞాతంలో ఉంటూ చేతివాటం ప్రదర్శిస్తున్న ఈ ఘరానా దొంగ.. తాజాగా ఓ ఇంట్లో చేసిన చోరీ పోలీసు వర్గాల్లో ఆందోళన రేకెత్తిస్తోంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన రషీద్‌ ఖాన్‌.. కరడుగట్టిన నేరస్థుడు. సంగారెడ్డి, సైబరాబాద్‌, రాచకొండ పరిధిలో వందకుపైగా చోరీలు చేశాడు. సెల్‌ఫోన్‌ వాడకపోవడం ఇతని ప్రత్యేకత. ఒకేసారి మూడు, నాలుగు చోరీలు చేసి అజ్ఞాతంలోకి వెళ్తాడు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. మందకొడిగా ‘కవచ్‌’ పనులు

 ఒడిశా రైలు ప్రమాదంతో ఆ శాఖ దిగ్భ్రాంతికి లోనయింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. ఈ దుర్ఘటనతో భారతీయ రైల్వే చేపట్టిన ‘కవచ్‌’ నిర్మాణ పనులు మరోసారి తెరమీదకు వచ్చాయి. అత్యంత రద్దీగా ఉండే కీలకమైన కాజీపేట- సికింద్రాబాద్‌ మధ్య ఈ పనులు మందకొడిగా సాగుతున్నాయి. ఎదురెదురుగా వచ్చే రైళ్లను సెన్సర్ల ద్వారా గుర్తించడం, పట్టాలమీద పడిన వస్తువులను గుర్తించి రైలు దానికదే ఆగిపోయే విధంగా రూపొందించిన అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం ఇది.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. లాగిపడేయండి.. సస్పెండ్‌ చేస్తా: అధికార పార్టీ కార్పొరేటర్‌పై మేయర్‌ వ్యాఖ్యలు

అభివృద్ధి పనులకు నిధుల కేటాయింపుల్లో వివక్షను ప్రశ్నించిన అధికార పార్టీ కార్పొరేటర్‌ క్రాంతికుమార్‌పై కర్నూలు నగర మేయర్‌ బీవై రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశారు. శనివారం కార్పొరేషన్‌ కార్యాలయంలో జరిగిన సమావేశంలో క్రాంతికుమార్‌ మాట్లాడుతూ తన డివిజన్‌కు నిధులు ఇవ్వకపోవడాన్ని ప్రస్తావించారు. ఆగ్రహించిన మేయర్‌ రామయ్య.. ‘ఇష్టానుసారంగా మాట్లాడితే సస్పెండ్‌ చేస్తా. ఓవరాక్షన్‌ చేయకు. అతణ్ని లాగి పడేయండి. ఈడ్చేయండి’ అని పోలీసులకు ఆదేశాలిచ్చారు.  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆ రాత్రి... బతికి బయటపడతామనుకోలేదు!

‘కంఫర్ట్‌ జోన్‌ అన్న పదం ఇప్పుడు జీవితానికీ, కెరీర్‌కే కాదు... పర్యటనలకీ వర్తిస్తుంది. బాగా ప్రాచుర్యంలో ఉన్న ప్రాంతాలకి ప్యాకేజ్డ్‌ టూర్‌ల సాయంతో వెళ్ళడాన్ని ఇలా కంఫర్ట్‌జోన్‌ పర్యటనలు అనొచ్చు. ఈసారి అందుకు భిన్నంగా పోవాలనుకున్నాను. లద్దాఖ్‌లోని- ప్రపంచంలోనే ఎత్తైన రోడ్డుమార్గం ఖర్దుంగ్లా పాస్‌కి వెళ్ళాను. తిరుగు ప్రయాణంలో ప్రాణభీతి వేధించినా... జీవితాంతం గుర్తుండిపోయే అనుభూతిని సొంతం చేసుకున్నాను...’ అంటారు హైదరాబాద్‌వాసి సుతారపు సోమశేఖర్‌. ఆయన ప్రయాణంలో ఉద్విగ్న అనుభవాలివి...  పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని