Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 06 Jun 2023 09:12 IST

1. తప్పులు సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం

 పోలీసుశాఖలో ఉద్యోగాలకు పరీక్షలు రాసిన అభ్యర్థులు తమ దరఖాస్తులో ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దుకునేందుకు చివరి అవకాశం ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రస్థాయి పోలీసు నియామక మండలి ఛైర్మన్‌ వి.వి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ సదుపాయం ఈనెల 6వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 8 గంటల వరకు అందుబాటులో ఉంటుందన్నారు. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ కోసం 0.38 శాతం మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో పేదల ఇళ్లపై పిడుగు!

సభ, సమావేశం.. వేదిక ఏదైనా సరే పేదలపై తమకే పేటెంట్‌ హక్కు ఉందనేలా పదే పదే మాట్లాడే ఏపీ సీఎం  జగన్‌.. అదే పేదలకు గూడు లేకుండా చేస్తున్నారు. మాటెత్తితే 30 లక్షలకు పైగా ఇళ్ల పట్టాలు ఇచ్చాం.. 22 లక్షల గృహాల్ని కట్టిస్తున్నామని చెప్పే ఆయన ఆర్థిక స్తోమత లేక కట్టుకునేందుకు ముందుకురాని  ఏపీలోని 46 వేల మంది కడు పేదలకు కేటాయించిన ఇళ్లను రద్దు చేయబోతున్నారు. గడిచిన రెండేళ్లలో ఇప్పటికే పలుమార్లు కొన్ని వేల మంది పేదల ఇళ్లను రద్దు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చనిపోయాడనుకొని ట్రక్కులో ఎక్కించారు.. రైలు ప్రమాద ఘటనలో దారుణం

ఒడిశా రైలు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తిని చనిపోయినట్టు భావించి మృతదేహాలు తరలించే లారీలో ఎక్కించారు. కానీ, తను ప్రాణాలతోనే ఉన్నానని సహాయక సిబ్బందికి తెలియజేశాడు.  ప్రస్తుతం ఆ బాధితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదం జరిగిన రోజు పశ్చిమబెంగాల్‌కు చెందిన బిశ్వజిత్‌ మాలిక్‌ కూడా షాలిమర్‌ స్టేషన్‌లో కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌ ఎక్కాడు. బాలేశ్వర్‌ ప్రాంతంలో రైలు ప్రమాదానికి గురైంది. బిశ్వజిత్‌ కుడి చేతికి తీవ్ర గాయం కావడంతో ఎటూ కదలలేకపోయాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌లో మాజీ ఎంపీటీసీ కుమార్తె..!

టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో రోజుకో సంచలన విషయం వెలుగుచూస్తోంది. తాజాగా ప్రజాప్రతినిధులు తమ పిల్లల కోసం ప్రశ్నపత్రాలు కొన్నట్టు బహిర్గతమైంది. ఇందులో కరీంనగర్‌ జిల్లాకు చెందిన మాజీ ఎంపీటీసీ భర్త ప్రమేయం ఉన్నట్టు నగర సిట్‌ పోలీసులు దర్యాప్తులో గుర్తించారు. తన కుమార్తె ఏఈఈ పరీక్ష కోసం హైటెక్‌ మాస్‌కాపీయింగ్‌ సూత్రధారి ఏఈ రమేశ్‌ సహకారం తీసుకున్నట్టు నిర్ధారించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రైళ్లే కాదు, జీవితాలూ పట్టాలు తప్పాయ్‌!

ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డామన్న ఆనందం కంటే.. ఇకపై కుటుంబాన్ని పోషించడమెలా అన్న ఆందోళనే వారిని ఎక్కువగా వెంటాడుతోంది. కాళ్లు, చేతులు విరిగిపోయి, తలలు పగిలిపోయిన గాయాల బాధ కంటే.. తాము కోలుకుని తిరిగి మునుపటిలా పనిచేయటానికి వెళ్లేంత వరకూ ఇల్లు గడవడమెలా అనే ఆలోచనే వారిని అధికంగా భయపెడుతోంది. ఒడిశాలోని బహానగా వద్ద జరిగిన రైళ్ల ప్రమాదంలో గాయపడి బాలేశ్వర్‌, కటక్‌లోని వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారి దయనీయ పరిస్థితి ఇది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. మేనల్లుడూ మేనమామా ఇద్దరూ దోపిడీదారులే: నారా లోకేశ్‌

మేనల్లుడు, మేనమామలైన ముఖ్యమంత్రి జగన్‌, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి ఇద్దరూ దోపిడీదారులని, ప్రజల ఆస్తుల్ని, ధనాన్ని దోచేయడంలో ఎవరికెవరూ తక్కువ కారని తెదేపా ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. యువగళం పాదయాత్ర 177వ రోజు సోమవారం వైయస్‌ఆర్‌ జిల్లా కమలాపురం నియోజకవర్గంలో సాగింది. చెన్నూరులో బహిరంగ సభలో లోకేశ్‌ మాట్లాడుతూ సీఎం మేనమామ తన నియోజకవర్గంలో అభివృద్ధి పనులు చేయించాల్సిందిపోయి, అహంకారం.. అవినీతి.. భూకబ్జాలతో పేట్రేగిపోతున్నారని మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కడచూపు కోసం.. కన్నీటి వెతుకులాట

ఒకవైపు శవాగారంలో కుప్పలుగా మృతదేహాలు. కానీ ముఖాలు ఛిద్రమవడంతో.. చనిపోయింది ఎవరో గుర్తుపట్టలేని దుస్థితి. మరోవైపు తమవారి ఆచూకీ తెలియక కుటుంబికులు, బంధువుల అవస్థలు.. కనీసం మృతదేహాలైన కనిపించకపోవడంతో మిన్నంటుతున్న రోదనలు. ఒడిశా రైళ్ల ప్రమాదంతో నెలకొన్న దయనీయ పరిస్థితులివి. తమవారు బతికి ఉండొచ్చన్న ఆశ దాదాపుగా కొడిగట్టడంతో.. భౌతికకాయాలనైనా గుర్తించి అంతిమ సంస్కారాలు నిర్వహించాలన్న తపనతో భువనేశ్వర్‌ ఎయిమ్స్‌ శవాగారానికి ప్రమాద బాధితుల సంబంధికులు భారీగా తరలివస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఆశలు రేకెత్తిస్తున్న ఇంజినీరింగ్‌ కళాశాల

‘మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కోరిక మేరకు ఇంజినీరింగ్‌ కళాశాలను మంజూరు చేస్తున్నా. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఏ ప్రాంతం అనువుగా ఉంటుందో. దాన్ని పరిశీలిస్తాం.’ అని నిర్మల్‌లో ఆదివారం జరిగిన సభలో సీఎం కేసీఆర్‌ ప్రకటించడం ఆశలు రేకెత్తిస్తోంది. అక్షర క్రమంలో ముందున్న ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సాంకేతిక ఉన్నత విద్య సౌకర్యాలు అందుబాటులో లేకపోవడం పెద్దలోటుగా ఉంది. ముఖ్యమంత్రి ఇంజినీరింగ్‌ కళాశాల ఏర్పాటుపై హామీ ఇవ్వడం ప్రాధాన్యం సంతరించుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. రూ. 265తో.. మూడు ఇళ్లు కొన్నది!

సొంతింటి కల అనేది చాలామంది కోరిక. ఈ కల నెరవేర్చుకోవడం కోసం ఏళ్ల తరబడి డబ్బు దాచుకోవడం, లక్షల కొద్దీ బ్యాంకు రుణం తీసుకోవడం.. వంటి ప్రత్యామ్నాయాల్ని పాటిస్తుంటారు చాలామంది. కానీ ఎలాంటి పొదుపు-మదుపు లేకుండా, లక్షల రూపాయలు ఖర్చు చేయకుండా.. ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు ఇళ్లను కొనుగోలు చేసింది క్యాలిఫోర్నియాకు చెందిన రూబియా డేనియల్స్‌ అనే మహిళ. వాటికైన ఖర్చు కేవలం రూ. 265 మాత్రమే! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. వరాల జల్లు కురిపించేనా..!

ముఖ్యమంత్రి కేసీఆర్‌ పర్యటనపై పాలమూరు ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండోసారి సీఎంగా కేసీఆర్‌ గతేడాది వనపర్తి, మహబూబ్‌నగర్‌ కలెక్టరేట్‌ భవనాల ప్రారంభోత్సవానికి వచ్చారు. 2019లో పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పనులను పరిశీలించడానికి వచ్చారు. అధికారికంగా జరిగిన ఈ మూడు కార్యక్రమాల్లో ఇక్కడి ప్రాంత ప్రజలకు కేసీఆర్‌ ఎన్నో వరాలు గుప్పించారు. మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌, గద్వాల ఎమ్మెల్యే కృష్ణామోహన్‌రెడ్డిలను పరామర్శించడానికి వ్యక్తిగతంగా వచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని