Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 24 Sep 2023 09:23 IST

1. హైదరాబాద్‌ నుంచి ఐటీ ఉద్యోగుల కార్ల ర్యాలీ ప్రారంభం

తెదేపా అధినేత చంద్రబాబు అరెస్ట్‌ను ఖండిస్తూ ఆయనకు సంఘీభావంగా హైదరాబాద్‌ నుంచి రాజమహేంద్రవరానికి ఐటీ ఉద్యోగులు ర్యాలీగా వెళ్లారు. ‘కారులో సంఘీభావ యాత్ర’ పేరుతో  పెద్ద సంఖ్యలో కార్లలో బయల్దేరారు. ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు పెద్ద ఎత్తున ఐటీ ఉద్యోగులు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి, ఎస్సార్‌ నగర్‌, ఎల్బీనగర్‌ తదితర ప్రాంతాల నుంచి ర్యాలీగా వెళ్లారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. కస్టడీ ఉత్తర్వులపై హైకోర్టుకు తెదేపా అధినేత

నైపుణ్యాభివృద్ధి సంస్థ కేసులో ఈ నెల 23, 24 తేదీల్లో తనను విచారించేందుకు సీఐడీ కస్టడీకి (పోలీసు కస్టడీ) ఇస్తూ విజయవాడ అనిశా కోర్టు ఈ నెల 22న జారీచేసిన ఉత్తర్వులను కొట్టేయాలని కోరుతూ తెదేపా అధినేత చంద్రబాబు శనివారం హైకోర్టులో వ్యాజ్యం దాఖలుచేశారు. సీఐడీ డీఎస్పీ, ఫిర్యాదుదారు/ ఏపీఎస్‌ఎస్‌డీసీ ఛైర్మన్‌ కె.అజయ్‌రెడ్డిని వ్యాజ్యంలో ప్రతివాదులుగా పేర్కొన్నారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. అప్పీలుకు వెళతాం

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇవ్వడంతో అభ్యర్థులతోపాటు కమిషన్‌లోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే రెండుసార్లు పరీక్ష రాశామని, మూడోసారి రాయడమంటే తట్టుకోలేని వ్యయప్రయాసలు ఎదుర్కోవాల్సి వస్తుందని అభ్యర్థులు భయపడుతున్నారు. మరోసారి ప్రిలిమినరీ పరీక్ష అంటే లక్షల మంది అభ్యర్థులు మానసికంగా ఇబ్బందులకు గురవుతారని కమిషన్‌ సైతం ఆందోళన వ్యక్తం చేసింది.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. నటుడు నవదీప్‌ ఫోన్లలో డేటా మాయం!

టాలీవుడ్‌ను వణికిస్తున్న మాదాపూర్‌ డ్రగ్స్‌ కేసులో ఎట్టకేలకు సినీనటుడు నవదీప్‌ టీఎస్‌న్యాబ్‌(తెలంగాణ యాంటీ నార్కోటిక్స్‌ బ్యూరో) పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఈ నెల 14న మాదకద్రవ్యాల రవాణా కేసులో ముగ్గురు నైజీరియన్లతో సహా 8 మంది అరెస్టయ్యారు. వారి వద్ద లభించిన కొనుగోలుదారుల జాబితాలో పోలీసులు నవదీప్‌ పేరును గుర్తించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దు: నాగబాబు

రానున్నది జనసేన-తెదేపా ప్రభుత్వమని.. పొత్తుకు తూట్లు పొడిచేలా ఎవరూ మాట్లాడొద్దని, అధినేత పవన్‌కల్యాణ్‌ నిర్ణయానికి కట్టుబడి పనిచేయడం అందరి బాధ్యత అని జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు శ్రేణులకు స్పష్టం చేశారు. తిరుపతి, శ్రీకాళహస్తి, చంద్రగిరి, జీడీ నెల్లూరు, సత్యవేడు, మదనపల్లె నియోజకవర్గాల... కార్యకర్తలు, నాయకులతో శనివారం తిరుపతిలో నిర్వహించిన అంతర్గత సమావేశంలో ఆయన మాట్లాడారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సోహన్‌సింగ్‌ కన్నుమూత

హోమియో వైద్యం పేరు చెబితే.. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, దేశవ్యాప్తంగా ఇట్టే గుర్తుకొచ్చే ప్రఖ్యాత వైద్యనిపుణులు డాక్టర్‌ సోహన్‌సింగ్‌ (80) ఇక లేరు. శుక్రవారం రాత్రి ఆయన గుండెపోటుతో హైదరాబాద్‌ బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆకస్మికంగా మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆసుపత్రికి తీసుకెళ్లేసరికే ఆయన మరణించారని వెల్లడించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కెనడా అడుగు ఎటో!

భారత్‌, కెనడాల మధ్య వివాదాస్పదంగా మారిన ఖలిస్థాన్‌ ఉగ్రవాది నిజ్జర్‌ హత్య కేసు ఎటు దారితీస్తుంది? నిజ్జర్‌ హత్యలో భారత ప్రభుత్వ హస్తముందని ఆరోపిస్తున్న కెనడా తద్వారా ఏం సాధించగలుగుతుంది? ఈ కేసును ఎంతదాకా లాగగలదు? చట్టప్రకారం కెనడా ఏం చేయగలుగుతుంది?.. ఇవన్నీ ఇప్పుడు ఉదయిస్తున్న ప్రశ్నలు. ‘మా పౌరుడైన హర్‌దీప్‌సింగ్‌ నిజ్జర్‌ను మా దేశంలోనే ఇతరులు వచ్చి కాల్చి చంపటం అంటే మా సార్వభౌమత్వాన్ని ధిక్కరించినట్లే’ అన్నది కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణ!పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. రాత్రివేళ రెండేళ్ల పాప అదృశ్యం.. డ్రోన్లు, జాగిలాలతో పోలీసుల జల్లెడ

అమెరికాలోని మిషిగన్‌కు చెందిన రెండేళ్ల చిన్నారి థియా చేజ్‌ రాత్రి సమయంలో అదృశ్యం కావడంతో కుటుంబసభ్యులు కంగారుపడిపోయారు. పోలీసులు ఆమె జాడ కోసం డ్రోన్లు, జాగిలాలతో ఆ ప్రాంతాన్ని జల్లెడ పట్టారు. గత బుధవారం రాత్రి పెంపుడు శునకాలతో ఆడుకొంటూ థియా ఇంటి నుంచి బయటకు వెళ్లింది. స్థానికులతో కలిసి అందరూ పాప జాడ కోసం చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో గాలించారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. పుష్పగిరిలో వజ్రాల వేట

వల్లూరు-చెన్నూరు మండలాల సరిహద్దులోని పుష్పగిరి కొండపై కొన్ని రోజులుగా వజ్రాలఅన్వేషణ సాగుతోంది. అదృష్టం వరిస్తే కష్టాలన్నీ తీరుతాయనే ఉద్దేశంతో పలువురు దూర ప్రాంతాల నుంచి వచ్చి వజ్రాల కోసం అన్వేషిస్తున్నారు. వర్షం కురిసిన మరుసటి రోజుల్లో చెన్నూరు, ఖాజీపేట, ప్రొద్దుటూరు, పోరుమామిళ్ల, మైదుకూరు తదితర ప్రాంతాలకు చెందిన కొందరు కూలీలతో పుష్పగిరి గుట్టంతా శోధిస్తుండడం గమనార్హం.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘సింగం’ లాంటి పోలీసు చిత్రాలు ప్రమాదకరం: బాంబే హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యలు

న్యాయ ప్రక్రియను పట్టించుకోకుండా సత్వరమైన న్యాయాన్ని అందించే ‘సింగం’ వంటి పోలీసు సినిమాలు ప్రమాదకరమని బాంబే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ గౌతమ్‌ పటేల్‌ అభిప్రాయపడ్డారు. ఇలాంటి సినిమాలు హానికరమైన సందేశాన్ని పంపుతాయన్నారు. ఇండియన్‌ పోలీసు ఫౌండేషన్‌ వార్షికోత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని