Top 10 News @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 01 May 2021 21:16 IST

1. ఏపీలో 19,412 కేసులు.. 61 మరణాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా మహమ్మారి ప్రతాపం కొనసాగుతోంది. రోజురోజుకీ కొవిడ్ బారిన పడుతున్న బాధితుల సంఖ్య గణనీయంగా పెరగుతోంది. వైరస్‌ బారినపడి చనిపోతున్న వారి సంఖ్య సైతం పెరుగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 98,214 పరీక్షలు నిర్వహించగా.. 19,412 కేసులు నిర్ధారణ కాగా.. 61 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి ఇప్పటివరకు రాష్ట్రంలో 11,21,102 మంది వైరస్‌ బారినపడగా.. మరణాల సంఖ్య 8వేల మార్క్‌ దాటినట్లు  రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Remdesivir: ప్రైవేటు ఆస్పత్రులకూ సరఫరా

2. Active cases:11 రాష్ట్రాలు.. 25లక్షలు! 

భారత్‌లో కరోనా పెను ఉప్పెనలా విరుచుకుపడుతోంది. ఈ మహమ్మారి రోజురోజుకీ మరింత ఉద్ధృతరూపం దాల్చుతోంది. దేశవ్యాప్తంగా అనేకచోట్ల కఠిన ఆంక్షలు అమలులో ఉన్నా.. టీకా పంపిణీ కార్యక్రమం కొనసాగుతున్నా వైరస్‌ వాయువేగంతో వ్యాపిస్తోంది. గతంలో ఎన్నడూ లేనంతగా శుక్రవారం 4లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగు చూశాయి. దీంతో క్రియాశీల కేసుల గ్రాఫ్‌ భారీగా పెరిగిపోతోంది.  కేంద్ర ఆరోగ్యశాఖ శాఖ తెలిపిన గణాంకాల ప్రకారం.. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒక్కొక్కటిగా బయట పెడతాం: బండి సంజయ్‌

తెరాస ఎమ్మెల్యేలు, మంత్రులపై అనేకసార్లు ఆరోపణలు వచ్చాయని.. సీఎం కేసీఆర్ అప్పుడెందుకు విచారణ జరిపించలేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ప్రశ్నించారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ మంత్రులపై ఆరోపణలు, ఫిర్యాదులు వచ్చాయో.. వారిని వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ అసమర్థత వల్లే ప్రభుత్వంలో అక్రమాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

బండి సంజయ్‌ బాధ్యతగా మాట్లాడాలి: తలసాని

4. Sangam Dairy: 5గంటలకుపైగా దూళిపాళ్ల విచారణ

గుంటూరు జిల్లాలోని సంగం డెయిరీలో అక్రమాలకు పాల్పడ్డారనే అభియోగాలతో అరెస్టు అయిన తెదేపా సీనియర్‌ నేత, సంగం డెయిరీ మాజీ ఛైర్మన్‌ దూళిపాళ్ల నరేంద్రకుమార్‌ను అవినీతి నిరోధకశాఖ కస్టడీకి తీసుకుంది. ఇవాళ ఉదయం రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలు నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ గొల్లపూడిలోని అనిశా కార్యాలయానికి తీసుకొచ్చారు. తదుపరి దర్యాప్తులో భాగంగా నరేంద్రను ప్రశ్నించేందుకు తమ కస్టడీకి ఇవ్వాలని న్యాయస్థానాన్ని అనిశా కోరింది. న్యాయవాది సమక్షంలో విచారణ చేయాలంటూ నాలుగు రోజుల కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. అంతిమ సంస్కారాలకు అంతులేని కష్టం

కరోనాతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ కన్నుమూసిన వారి అంతిమ సంస్కారాల కోసం వారి కుటుంబాలు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. మృతదేహాన్ని శవాగారం నుంచి శ్మశానానికి తరలించాలంటే పైసా లేనిదే పని జరగడం లేదు. ప్రైవేటు అంబులెన్స్‌ డ్రైవర్లు సిండికేట్‌గా మారి మృతుల కుటుంబసభ్యుల నుంచి భారీగా వసూలు చేస్తున్నారు. నిజామాబాద్ జిల్లా ఆసుపత్రి నుంచి తరలించేందుకు కిలోమీటర్‌కు రూ.1000 చొప్పున వసూలు చేస్తుండటం పరిస్థితికి అద్దం పడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్‌ను అలా దిగుమతి చేసుకోవచ్చు

6. Lock Down: దిల్లీలో మళ్లీ పొడిగింపు

 దేశ రాజధాని దిల్లీలో కరోనా విలయతాండవం ఆగడం లేదు. నానాటికీ కేసులు, మరణాలు పెరుగుతూనే ఉన్నాయి. దీంతో వైరస్‌ ఉద్ధృతి దృష్ట్యా ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ను మరో వారం పాటు పొడిగిస్తున్నట్టు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. రాజధాని వాసులు కూడా లాక్‌డౌన్‌ కొనసాగించడమే మేలని అభిప్రాయపడుతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. కర్నూలులో ఆక్సిజన్‌ అందక నలుగురు మృతి

కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నగరంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ఉన్న కేఎస్ కేర్ ఆస్పత్రిలో ఆక్సిజన్ కొరతతో నలుగురు కొవిడ్ బాధితులు మృతిచెందారు. దీంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఇతర రోగులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర ఆస్పత్రులకు పరుగులు తీశారు. సమాచారం అందుకున్న నాలుగో పట్ణణ పోలీసులు ఆస్పత్రికి వచ్చి తనిఖీలు చేయగా.. ఐసీయూలో నాలుగు మృతదేహాలు ఉన్నట్లు గుర్తించారు. అయితే ఆక్సిజన్‌ అందక ఏ ఒక్కరూ మృతి చెందలేదని ఆస్పత్రి యాజమాన్యం తేల్చి చెప్పింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Oxygen కొరత: డాక్టర్‌ సహా 8మంది మృతి

8. కొరటాల చిత్రంలో విద్యార్థి నాయకుడిగా ఎన్టీఆర్‌?

ఎన్టీఆర్‌ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ‘ఎన్టీఆర్‌ 30’ వర్కింగ్‌ టైటిల్‌గా నందమూరి కల్యాణ్ రామ్ సమర్పణలో యుధసుధ ఆర్ట్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సుధాకర్ మిక్కిలినేని నిర్మాత. చిత్ర కథ అంతా విద్యార్థి రాజకీయాల చుట్టూ తిరగనుందని సమాచారం. ఇందులో ఎన్టీఆర్‌ విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నాడనే వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. David Warner స్థానంలో రప్ఫాడించే రాయ్‌!

ఐపీఎల్‌ తాజా సీజన్లో ఓటములతో విసిగిపోయిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సంస్కరణల బాట పట్టింది. కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌పై వేటు వేసింది. కివీస్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పజెప్పింది. రాజస్థాన్‌ రాయల్స్‌తో మ్యాచులో విదేశీ బృందం కూర్పులో మార్పులుంటాయని స్పష్టం చేసింది. దాంతో వార్నర్‌ స్థానంలో ఎవరొస్తారోనన్న ఆసక్తి పెరిగింది! పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. Mahesh babu: దాదాపు 11ఏళ్ల తర్వాత..

టాలీవుడ్‌ అగ్రనటుడు మహేశ్‌బాబు అభిమానులకు శుభవార్త చెప్పారు. తన తర్వాత సినిమాను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వంలో చేయనున్నారు. ఇప్పటికే ఈ ఇద్దరి కాంబినేషన్‌లో ‘అతడు’, ‘ఖలేజా’ చిత్రాలు వచ్చిన సంగతి తెలిసిందే.  దాదాపు 11ఏళ్ల తర్వాత మళ్లీ ఈ ఇద్దరి కలయికలో మరో సినిమా ఖరారైంది. దీంతో మహేశ్‌ అభిమానులు తెగ సంబరపడుతున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

* అనసూయ ఆగ్రహం.. టెడ్డీకి పోటీ లేదంట..

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని