Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Updated : 11 Jan 2022 21:09 IST

1. జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ క్రియాశీలపాత్ర పోషించాలి: తేజస్వీ

భారతీయ జనతాపార్టీ వ్యతిరేక పార్టీలతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సంప్రదింపులు కొనసాగుతున్నాయి. బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ కుమారుడు, ఆ రాష్ట్ర ప్రతిపక్షనేత తేజస్వి యాదవ్‌ నేతృత్వంలోని ఆర్జేడీ బృందం ఇవాళ కేసీఆర్‌తో సమావేశమైంది. జాతీయ రాజకీయాల్లో క్రియాశీల పాత్ర పోషించాలని సీఎం కేసీఆర్‌ను లాలూ ప్రసాద్‌ యాదవ్‌, తేజస్వి యాదవ్‌ కోరారు. ఆర్జేడీ నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని పేర్కొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. పొత్తులపై స్పందించిన పవన్‌ కల్యాణ్‌

జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పొత్తులపై స్పందించారు. ఇప్పటికే జనసేన పార్టీ భాజపాతో పొత్తులో ఉందని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకోవాలనే విషయాన్ని పార్టీ కార్యకర్తలు తన నిర్ణయానికే వదిలేసినందుకు ధన్యవాదాలు తెలిపిన పవన్‌ కల్యాణ్‌... పొత్తుల విషయంలో తానొక్కడినే నిర్ణయం తీసుకోలేనని వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. చిరంజీవి నాతో బాగానే ఉన్నారు: చంద్రబాబు

సినిమా టికెట్ల వివాదంలోకి తెదేపాను ఎందుకు లాగుతున్నారని ఆ పార్టీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. సినీ పరిశ్రమ తెలుగుదేశం పార్టీకి సహకరించలేదన్నారు. తాను.. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఈ మధ్య కూడా తనకు వ్యతిరేకంగా సినిమాలు తీశారన్నారు. 2009లో చిరంజీవి పార్టీ పెట్టకుంటే అప్పుడే అధికారంలోకి వచ్చేవాళ్లమని తెలిపారు. చిరంజీవి పార్టీ పెట్టకముందు, పార్టీ పెట్టిన తర్వాత కూడా తనతో బాగానే ఉన్నారని, ఇప్పుడు కూడా బాగానే ఉన్నారని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో భారీ వర్షం

తెలంగాణలోని ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పలు చోట్ల భారీ వర్షం కురిసింది. పలు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. కరీంనగర్‌ పట్టణంలోని గీతా భవన్‌ సెంటర్‌లో ఉన్న హోర్డింగ్‌ కూలిపోయింది. రాముడి పట్టాభిషేకం ఆవిష్కరించేలా ఏర్పాటు చేసిన 70 అడుగుల ఎత్తైన భారీ కటౌట్‌ కూలిపోయింది. గాలుల ధాటికి విద్యుత్‌ దీపాల అలంకరణ లుమినార్‌ నేలకొరిగింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రెండు రోజులపాటు ఐపీఎల్ మెగా వేలం

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్ మెగా వేలం ఫిబ్రవరి 12, 13వ తేదీల్లో రెండు రోజులపాటు జరుగుతుందని ఐపీఎల్ ఛైర్మన్‌ బ్రిజేష్ పటేల్ వెల్లడించారు. కొత్త ఫ్రాంచైజీలు అహ్మదాబాద్, లఖ్‌నవూలకు ‘లెటర్‌ ఆఫ్‌ ఇంటెంట్’ను జారీ చేయాలని ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా బీసీసీఐ కూడా క్లియరెన్స్‌ ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. కరోనా పాజిటివ్‌ వస్తే ఏడు రోజులు వేతనంతో కూడిన సెలవు

ప్రభుత్వ, ప్రైవేట్‌ కార్యాలయాలలో అత్యవసర సేవల విభాగాలు మినహా ఉద్యోగుల హాజరును 50 శాతానికి పరిమితం చేయాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ అధికారులను ఆదేశించారు. వర్క్‌ఫ్రమ్ హోంని ప్రోత్సహించాలని సూచించారు. ప్రైవేట్‌ కార్యాలయాల్లో పనిచేసేవారికి కరోనా పాజిటివ్‌గా తేలితే వారికి ఏడు రోజులపాటు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని స్పష్టం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. పాట నచ్చలేదని.. వధువుకు విడాకులిచ్చిన వరుడు!

ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో ఓ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వివాహ వేడుకల్లో పెళ్లి కూతురు ఓ పాటకు డ్యాన్స్‌ చేసింది. (నీపై నేను అధిపత్యం చెలాయిస్తా. నేను చెప్పినంటే నువ్వు నడుచుకోవాలి. నేను అహంకారిని) అని అర్థం వచ్చే పాట అది. దీంతో వరుడికి, అతడి కుటుంబసభ్యులకు కోపం వచ్చి వధువుతో వాగ్వాదానికి దిగారు. ఆ పాటతో తమ మనోభావాలు దెబ్బతిన్నాయని పేర్కొన్న వరుడు.. వివాహ వేదికపైనే విడాకులిచ్చాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. సైనాపై సిద్ధార్థ్ వ్యాఖ్యలు.. స్పందించిన కేంద్రమంత్రి రిజిజు

బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ను ఉద్దేశించి నటుడు సిద్ధార్థ్‌ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరెన్‌ రిజిజు స్పందించారు. దేశానికే గర్వకారణమైన సైనా నెహ్వాల్‌పై చేసిన అటువంటి వ్యాఖ్యలు వారి సంకుచిత మనస్తత్వాన్ని తెలియజేస్తున్నాయని మండిపడ్డారు. ఇప్పటికే సిద్ధార్థ్‌ వ్యాఖ్యలపై జాతీయ మహిళా కమిషన్‌తోపాటు పలు రంగాల ప్రముఖుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఐటీ రిటర్నుల దాఖలుకు మరోసారి గడువు పొడిగింపు

ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును ఆడిట్‌ వర్తించే సంస్థలకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) మళ్లీ పొడిగించింది. కరోనా ఉద్ధృతి నేపథ్యంలో పన్ను చెల్లింపుదారుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని 2021-22 మదింపు సంవత్సరానికి ఐటీఆర్‌ దాఖలు చేయడానికి  మార్చి 15 వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ మంగళవారం సాయంత్రం ప్రకటించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. తొలి ఇన్నింగ్స్‌లో టీమ్‌ఇండియా ఆలౌట్‌

కీలకమైన కేప్‌టౌన్‌ టెస్టులో తొలి రోజే టీమ్ఇండియా ఆలౌటైంది. దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 223 పరుగులకే ఆలౌటైంది. కెప్టెన్‌ విరాట్ కోహ్లీ (79) అద్భుతంగా రాణించినా కీలకమైన సమయంలో పెవిలియన్‌కు చేరాడు. ఛెతేశ్వర్‌ పుజారా (43), రిషభ్‌ పంత్ (27) ఫర్వాలేదనిపించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని