Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం..

Updated : 18 Jan 2022 21:05 IST

1. TSRTC: సంక్రాంతి వేళ కాసుల పంట

TSRTCకి సంక్రాంతి పండుగ కాసుల వర్షం కురిపించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈనెల 7వ తేదీ నుంచి 14వ తేదీ వరకు టీఎస్ఆర్‌టీసీ సాధారణ షెడ్యూల్ బస్సులకు అదనంగా సుమారు 4 వేల బస్సులను నడిపించింది. ఎలాంటి అదనపు ఛార్జీలు వసూలు చేయకుండా సుమారు 55 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చినట్లు ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. తద్వారా ఆర్టీసీకీ రూ.107 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు వెల్లడించారు.

2. మహిళా వర్సిటీగా కోఠి మహిళా కళాశాల..!
త్వరలో వందేళ్లు పూర్తి చేసుకోబోతున్న హైదరాబాద్ కోఠి మహిళా కళాశాలను తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. కోఠి మహిళా కళాశాలను మహిళా విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దే అంశంపై విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్షించారు.

3. ఏపీలో రాత్రి కర్ఫ్యూపై మార్గదర్శకాలు విడుదల

ఏపీలో కొవిడ్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇవాళ్టి నుంచి రాత్రిపూట కర్ఫ్యూ విధిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది. ఇవాళ్టి నుంచి జనవరి 31వ తేదీ వరకు రాత్రి 11గంటల నుంచి ఉదయం 5గంటల వరకు కర్ఫ్యూ అమల్లో ఉంటుందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కర్ఫ్యూ నిబంధనల నుంచి ఆసుపత్రులు, ఔషధ దుకాణాలు, వైద్యులు, మెడికల్‌ సిబ్బంది, ప్రింట్‌, ఎలక్ట్రానిక్‌ మీడియా, టెలికమ్యూనికేషన్లు, పెట్రోలు బంకులు, ఐటీ సేవలు, అత్యవసర సేవల సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు.

4. గణతంత్ర వేడుకల్లో భారీ మార్పు.. ఈసారి అరగంట ఆలస్యంగా..!

వరుసగా రెండో ఏడాది గణతంత్ర వేడుకలపై కరోనా ప్రభావం పడింది. మహమ్మారి ఉద్ధృతి నేపథ్యంలో ఈ ఏడాది కూడా వేడుకలను నిరాడంబరంగానే జరుపుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈసారి వేడుకల్లో భారీ మార్పు జరగనున్నట్లు తెలుస్తోంది. దిల్లీ వాతావరణ పరిస్థితుల దృష్ట్యా రిపబ్లిక్‌ డే పరేడ్‌ అరగంట ఆలస్యంగా ప్రారంభమవుతుందని రక్షణ మంత్రిత్వ శాఖ అధికారి ఒకరు వెల్లడించారు. 

5. గూగుల్‌ మీట్‌లో పెళ్లంట.. జొమాటోలో విందంట..!

కరోనా ఆంక్షల నేపథ్యంలో గతేడాది కొంత మంది వధూవరులు జూమ్‌ కాల్‌లోనే పెళ్లిపీటలెక్కడం లేదా.. తమ పెళ్లిని ఆన్‌లైన్‌ లైవ్‌లో ప్రసారం చేయడం వంటివి చేశారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన ఓ జంట మరో అడుగు ముందుకేసింది. ఆన్‌లైన్‌ వేదికగా 450 మంది అతిథులతో పెళ్లి వేడుకలకు సిద్ధమవుతోంది. అంతేనా.. ఆ అతిథులకు ‘జొమాటో’తో విందు కూడా ఇవ్వనుంది..!

6. తుది తీర్పునకు లోబడే ఉపాధ్యాయుల కేటాయింపులు: హైకోర్టు

కొత్త జిల్లాలకు ఉపాధ్యాయుల కేటాయింపులు తుది తీర్పునకు లోబడి ఉండాలని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జీవో 317పై స్టే ఇవ్వాలని ఉపాధ్యాయుల తరఫు న్యాయవాదులు కోరారు. కొత్త జిల్లాలకు వెళ్లిన ఉద్యోగులు విధుల్లో చేరారని.. అదనపు ఏజీ బీఎస్‌ ప్రసాద్‌ కోర్టుకు తెలిపారు. జీవో 317పై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన ధర్మాసనం.. పిటిషనర్ల అభ్యంతరాలపై వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 

7. కరోనా ఎఫెక్ట్‌.. తెలంగాణలో పాస్‌పోర్టు సేవల్లో పరిమితులు

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి ఉద్ధృతమవుతోన్న నేపథ్యంలో పాస్‌పోర్టు సేవలను పరిమితం చేశారు. ప్రస్తుతం ఉన్న స్లాట్లలో కేవలం 50శాతం మాత్రమే బుక్ చేసుకుంటామని హైదరాబాద్ ప్రాంతీయ పాస్‌పోర్టు అధికారి దాసరి బాలయ్య తెలిపారు. హైదరాబాద్‌ ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో కొనసాగుతోన్న సేవా కేంద్రాల్లోనూ 50 శాతం పాస్‌పోర్టులను మాత్రమే జారీ చేయనున్నట్లు వెల్లడించారు.

8. అందరి కళ్లు విరాట్‌పైనే.. ఏం చేస్తాడో మరి.!

కెప్టెన్సీకి ముగింపు పలికి పూర్తి స్థాయి బ్యాటర్‌గా మారిన కోహ్లీ.. దక్షిణాఫ్రికాతో రేపటి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌లో ఏ మేరకు రాణిస్తాడన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. కోహ్లీ మిడిలార్డర్‌లో బ్యాటింగ్‌కు దిగినా.. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్‌ చేసినా.. అందరి కళ్లు అతడిపైనే ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. బ్యాటుతో మునుపటి ఫామ్‌ను అందుకోవాల్సిన అవసరం ఉంది. చాలా రోజులుగా అందుకోలేకపోతున్న శతక దాహాన్ని.. ఈ సారైనా తీర్చుకుంటాడేమో చూడాలి.

9. 5జీ సేవలతో విమానయాన రంగంపై ప్రభావం

అంతర్జాల వినియోగంలో మరింత వేగాన్ని పెంచేందుకు రూపొందించిన 5జీ సేవలు.. విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అమెరికాలో బుధవారం ప్రారంభం కానున్న 5జీ సీబ్యాండ్ సేవలపై అక్కడి ఎయిర్​లైన్లు ఆందోళన చెందుతున్నాయి. ఈ బ్యాండ్ వల్ల అనేక విమానాలు నిలిచిపోతాయని పేర్కొంటున్నాయి. విమానాల విషయంలో గందరగోళం తలెత్తుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

10. 50లక్షల మందికి పైగా ప్రికాషన్‌ డోసు పంపిణీ

దేశ వ్యాప్తంగా ఈనెల 10 నుంచి ప్రారంభించిన ప్రికాషన్‌ డోసు పంపిణీ వేగంగా కొనసాగుతోంది. ఇప్పటివరకు 50లక్షల మందికి పైగా హెల్త్‌ కేర్‌ సిబ్బంది, ఫ్రంట్‌లైన్‌ వర్కర్లు,  60ఏళ్లు పైబడిన వారికి ప్రికాషన్‌ డోసులు పంపిణీ చేసినట్టు కేంద్రం వెల్లడించింది. అలాగే, గడిచిన 24గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 80లక్షల టీకా డోసులు పంపిణీ చేయడంతో ఆ సంఖ్య 158.04 కోట్లకు చేరిందని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్‌సుఖ్‌ మాండవీయ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని