Updated : 27 Feb 2022 21:04 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రష్యాతో చర్చలకు సిద్ధం.. ఉక్రెయిన్‌ ప్రకటన

రష్యాతో చర్చలకు సిద్ధమని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ప్రకటించారు. ముందుగా చెప్పినట్లు బెలారస్‌ వేదికగా కాకుండా సరిహద్దు ప్రాంతంలో పరస్పరం చర్చించేందుకు అంగీకరించారు. ఈ విషయంపై బెలారస్‌ అధ్యక్షుడు అలెగ్జాండర్‌ లుకషెంకో ఫోన్‌లో మాట్లాడిన ఆయన.. చర్చలకు ఒప్పుకున్నట్లు ఉక్రెయిన్‌ అధ్యక్ష భవనం వెల్లడించింది.

యుద్ధరంగంలోకి ఉక్రెయిన్‌ బ్యూటీ

2. మీ పోరాటం వీరోచితం.. రష్యన్‌ బలగాలను అభినందించిన పుతిన్‌

ఉక్రెయిన్‌పై సైనిక చర్యలో పాల్గొంటున్న సాయుధ బలగాల సేవలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆదివారం ప్రశంసించారు. ఈ మేరకు ఆదివారం క్రెమ్లిన్ ఓ ప్రకటన విడుదల చేసింది. చేసిన ప్రమాణానికి కట్టుబడి.. రష్యా ప్రజలు, మాతృభూమి కోసం పోరాడుతోన్న ప్రత్యేక కార్యాచరణ దళాల సిబ్బందికి, ఆయా విభాగాల నిపుణులకు పుతిన్‌ కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు అందులో పేర్కొంది.

3. కొందరు నా చావు కోరుతున్నారు.. ఆ విషయంలో సంతోషమే!: మోదీ

ఉత్తర్‌ప్రదేశ్‌ ఎన్నికలు చివరి దశకు చేరుకున్న వేళ ప్రధాన ప్రతిపక్షమైన సమాజ్‌వాదీ పార్టీపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొందరు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని, చివరికి తన చావును సైతం కోరుకుంటున్నారంటూ విమర్శించారు. ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌ గతేడాది ఓ సందర్భంలో చేసిన వ్యాఖ్యలనుద్దేశిస్తూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.

బంగారాన్ని ఇలా కూడా స్మగ్లింగ్‌ చేయొచ్చా?

4. జూన్‌లో కొవిడ్‌ నాలుగో వేవ్‌.. అంచనా వేసిన పరిశోధకులు

దేశంలో కరోనా మూడో దశ ప్రభావం క్రమంగా తగ్గుతోంది. కేసులు దిగివస్తున్నాయి. ఇదిలా ఉంటే కాన్పూర్‌ ఐఐటీకి చెందిన పరిశోధకులు కీలక విషయాలను వెల్లడించారు. వచ్చే జూన్‌లో భారత్‌లో కొవిడ్‌ నాలుగో వేవ్‌ మొదలయ్యే అవకాశాలున్నాయని తెలిపారు. జూన్‌ 22 నుంచి అక్టోబర్‌ 24 వరకు ఫోర్త్‌ వేవ్‌ ప్రభావం ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. అయితే ఈ దశ తీవ్రత ఎలా ఉండనుందో ఇప్పుడే చెప్పలేమన్నారు.

5. ప్రగతి భవన్‌ను నాలెడ్జ్‌ సెంటర్‌గా మారుస్తాం: రేవంత్‌రెడ్డి

ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధైర్యం లేక తనను పీసీసీ అధ్యక్షుడిగా నియమించగానే రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలని సవాల్‌ విసిరారు. ఇంటికో ఉద్యోగమిస్తామని గద్దెనెక్కిన కేసీఆర్‌.. తన ఇంట్లో అందరికీ ఉద్యోగాలు కల్పించుకున్నారని ఆరోపించారు. 

6. సీఎం కేసీఆర్‌తో ప్రశాంత్‌ కిశోర్ భేటీ ... రాజకీయ వర్గాల్లో ఆసక్తి

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ జాతీయ రాజకీయాలపై దృష్టి సారించిన వేళ వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ రాష్ట్ర పర్యటన ఆసక్తి రేపుతోంది. రెండ్రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రశాంత్‌ కిశోర్‌... సీఎం కేసీఆర్‌ను ఆయన వ్యవసాయ క్షేత్రంలో కలిశారు. దేశ వ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, కేసీఆర్‌ ఆలోచనలు, వ్యాఖ్యలపై ప్రశాంత్‌ కిశోర్‌ (పీకే) బృందం వివిధ రాష్ట్రాల్లో సర్వేలు చేస్తూ అభిప్రాయాలు సేకరిస్తోంది.

7. సాగర తీరంలో మిలాన్‌-22... ఆకట్టుకున్న యుద్ధ విన్యాసాలు

తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో నగరంలోని బీచ్‌రోడ్డులో ఆదివారం సాయంత్రం నిర్వహించిన  బహుళ దేశాల నౌకాదళ విన్యాసాలు (మిలాన్‌-22) వేడుకగా సాగాయి. నమూనా యుద్ధవిన్యాసాలు, ‘అంతర్జాతీయ నగర కవాతు’(ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌) వేడుకల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. గగనతలంలో ఫైటర్‌జెట్స్‌, హెలికాఫ్టర్లు, యుద్ధవిమానాల విన్యాసాలు నగరవాసులను సంభ్రమాశ్చర్యాల్లో  ముంచెత్తాయి.

8. కోహ్లీ వందో టెస్టు.. బీసీసీఐ నిర్ణయంపై అభిమానుల ఆగ్రహం

టీమ్‌ఇండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ వందో టెస్టు మ్యాచ్‌ కోసం క్రికెట్‌ అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే బీసీసీఐ తీసుకున్న నిర్ణయంపై కోహ్లీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు టెస్టుల సిరీస్‌లో భాగంగా మార్చి 4 నుంచి శ్రీలంకతో మొహాలీ స్టేడియం వేదికగా తొలి టెస్టు మ్యాచ్‌ జరగనుంది. ఇదే మ్యాచ్‌ కోహ్లీకి కెరీర్‌లో వందో టెస్టు కావడం విశేషం.

9. ఐపీఎల్‌ 15వ సీజన్‌... తొలి మ్యాచ్‌ వీరి మధ్యేనా?

టాటా ఇండియన్‌ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 15వ సీజన్‌ ఎప్పుడో తెలిసిపోయింది. పది జట్లు పాల్గొనే ఐపీఎల్ 2022 సీజన్‌లో మ్యాచ్‌ల ఫార్మాట్‌ తెలిసింది. షెడ్యూల్‌తోపాటు తొలి మ్యాచ్‌ ఎవరెవరి మధ్య జరగనుంది.. వేదిక ఎక్కడనేది మాత్రమే అధికారికంగా ఖరారు కావాల్సి ఉంది. అయితే విశ్వసనీయ వర్గాల ప్రకారం గత సీజన్‌లో ఫైనల్‌కు చేరిన జట్ల మధ్యే ఈసారి మొదటి మ్యాచ్ ఉండనుంది.

10. యూపీలో ముగిసిన ఐదో దశ పోలింగ్‌.. 54శాతం ఓటింగ్‌

ఉత్తర్‌ప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో భాగంగా.. ఐదో విడత పోలింగ్ స్వల్ప ఉద్రిక్తతలు మినహా ప్రశాంతంగా ముగిసింది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఓటర్లు  ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 53.98 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల కమిషన్‌ వెల్లడించింది.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని