Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Updated : 17 Apr 2022 21:04 IST

1. ఎవరైనా జగన్‌ బొమ్మపై గెలవాల్సిందే: అనిల్‌ కుమార్‌ యాదవ్‌

నెల్లూరు జిల్లాలో ఉన్నది ఒకే వర్గమని.. అది సీఎం జగన్ వర్గం అని మాజీ మంత్రి అనిల్‌కుమార్‌ యాదవ్ అన్నారు. నాయకులు ఎవరైనా సరే జగన్‌ బొమ్మతోనే గెలవాలన్నారు. తాను ఎవరికీ పోటీగా సభ పెట్టలేదని వెల్లడించారు. నెల్లూరు పట్టణంలోని గాంధీ బొమ్మ సెంటర్‌లో కార్యకర్తలతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో అనిల్‌ కుమార్‌ యాదవ్‌ ప్రసంగించారు. అనిల్‌ సభకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు హాజరయ్యారు.

ముంబయిలో భాజపాయేతర ముఖ్యమంత్రుల భేటీ!

2. మంత్రి హోదాలో తొలిసారి నెల్లూరుకు కాకాణి.. ఘన స్వాగతం పలికిన శ్రేణులు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన కాకాణి గోవర్ధన్‌ రెడ్డికి నెల్లూరులో పార్టీ నేతలు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మంత్రి హాదాలో తొలిసారిగా అమరావతి నుంచి నెల్లూరుకు వస్తున్న సందర్భంగా కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తన కార్యకర్తలతో కలిసి కాకాణికి ఘనంగా స్వాగతం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపిస్తూ భారీ గజమాలతో మంత్రిని సత్కరించారు. 

3. తెరాసతో కాంగ్రెస్‌ పొత్తు ప్రచారం.. మాణికం ఠాకూర్‌ క్లారిటీ

తెరాసతో కాంగ్రెస్‌కు పొత్తు ఉంటుందనే ప్రచారం పూర్తిగా అవాస్తవమని తెలంగాణ కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మాణికం ఠాకూర్‌ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు.  భాజపా, తెరాసపై పోరాటంలో కాంగ్రెస్‌ ఒక్క అంగుళం కూడా వెనక్కి తగ్గదని పేర్కొన్నారు. మే 6న వరంగల్‌లో నిర్వహించే సభతో తమ బలమేంటో నిరూపిస్తామని మాణికం ఠాకూర్‌ చెప్పారు.

4. నల్లమలలో వర్షం.. సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి నిరాకరణ

నల్లమల అటవీ ప్రాంతంలో మరోసారి వర్షం కురుస్తున్న నేపథ్యంలో సలేశ్వరం వెళ్లేందుకు భక్తులకు అనుమతి లేదని అధికారులు తెలిపారు. వర్షం వల్ల సలేశ్వర క్షేత్రంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండల పైనుంచి గుండంలోకి రాళ్లు జారిపడుతున్నాయి. నల్లమల అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి కూడా భారీ వర్షం కురవడంతో సలేశ్వర క్షేత్రానికి వెళ్లే మార్గమంతా బురదమయంగా మారింది.

ప్రతిఘటనకు దిగితే నాశనం చేస్తాం: రష్యా హెచ్చరిక

5. డుప్లెసిస్‌.. ఇకపై ఫీల్డింగ్‌ చేసేటప్పుడు నన్ను రింగ్‌లోనే ఉంచు: కోహ్లీ

బెంగళూరు మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ తన సారథి ఫా డుప్లెసిస్‌ను విచిత్రమైన కోరిక కోరాడు. ఇకపై ఆ జట్టు ఆడే మ్యాచ్‌ల్లో తనని ఫీల్డింగ్‌లో 30 గజాల సర్కి్‌ల్‌లోనే ఉంచాలన్నాడు. శనివారం రాత్రి దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 16 పరుగుల తేడాతో గెలుపొందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం బెంగళూరు జట్టు డ్రెస్సింగ్‌ రూమ్‌లో సంబరాలు చేసుకుంటున్న సమయంలో కోహ్లీ ఇలా కోరాడు.

6. తదుపరి సీడీఎస్‌పై కేంద్రం కసరత్తు.. రిటైర్డ్‌ అధికారులకూ ఛాన్స్‌!

హెలికాప్టర్‌ ప్రమాదంలో జనరల్‌ బిపిన్‌ రావత్‌ మరణించడంతో చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ (సీడీఎస్‌) పదవి ఖాళీ అయ్యింది. దాదాపు నాలుగు నెలలు గడుస్తున్నా ఆ స్థానంలో కొత్తగా ఎవరినీ ప్రభుత్వం నియమించలేదు. త్వరలోనే దీనిపై కేంద్రం ఓ ప్రకటన చేయనున్నట్లు  తెలుస్తోంది. అయితే, ఈ పోస్టుకు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న, పదవీ విరమణ పొందిన అధికారుల పేర్లనూ పరిశీలించనున్నట్లు తెలుస్తోంది.

7. ‘పుతిన్‌తో మాట్లాడి ఉపయోగం లేదు.. టైం వేస్ట్‌’

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర కొనసాగుతున్న వేళ  వ్లాదిమిర్‌ పుతిన్‌పై ఇటలీ ప్రధానమంత్రి మారియో డ్రాఘి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌పై పోరును ముగించేందుకు పుతిన్‌తో మాట్లాడటం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదన్నారు. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపేలా పుతిన్‌తో పశ్చిమ దేశాలు ఇప్పటివరకు చేసిన దౌత్యపరమైన ప్రయత్నాలేవీ ఫలించలేదన్న డ్రాఘి.. ఆ నేతల మాటలను ఈ సందర్భంగా ఉటంకించారు.

8. హైదరాబాద్‌ ఘన విజయం.. టాప్‌-4లోకి కేన్‌ సేన

పంజాబ్‌పై హైదరాబాద్‌ ఏడు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. పంజాబ్‌ నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ కేవలం మూడు వికెట్లను మాత్రమే కోల్పోయి 18.5 ఓవర్లలో ఛేదించింది. హైదరాబాద్‌ బ్యాటర్లలో కేన్‌ విలియమ్సన్‌ (3) విఫలం కాగా.. మార్‌క్రమ్‌ (41*), నికోలస్‌ పూరన్‌ (35*), రాహుల్ త్రిపాఠి (34), అభిషేక్ శర్మ (31) రాణించారు. 

9. ఆసక్తికర టైటిల్‌తో నిఖిల్‌ పాన్‌ ఇండియా చిత్రం.. ఫస్ట్‌ లుక్‌ అదిరింది

విజయవంతమైన ‘గూఢచారి’, ‘ఎవరు’ తదితర చిత్రాల ఎడిటర్‌ గ్యారీ బి. హెచ్‌ దర్శకుడిగా మారారు. నిఖిల్‌ హీరోగా ఓ పాన్‌ ఇండియా చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఆ ప్రాజెక్ట్‌ టైటిల్‌, నిఖిల్‌ ఫస్ట్‌లుక్‌ను ఆదివారం విడుదల చేశారు. ‘స్పై’ అనే పేరుతో రూపొందుతున్న ఈ చిత్రంలో నిఖిల్‌ గూఢచారిగా కనిపించబోతున్నట్టు పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది.

10. కేసీఆర్ మౌనం తెలంగాణకు తీరని ద్రోహం చేస్తోంది: బండి సంజయ్‌

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో రూ.లక్ష కోట్లకుపైగా ఖర్చు పెట్టి గోదావరి నుంచి 200 కి.మీల దూరంలోనున్న ఫాంహౌజ్‌కు సీఎం కేసీఆర్ నీళ్లు తెచ్చుకున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. లక్షలాది మంది రైతులకు ప్రయోజనం కలిగించే ఆర్డీఎస్ ఆధునికీకరణ కోసం రూ. 70 కోట్లు కేటాయించలేకపోతున్నారని మండిపడ్డారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని