Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 13 May 2022 20:57 IST

1. బండి సంజయ్‌పై కేటీఆర్‌ పరువునష్టం దావా!

భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై రాష్ట్ర మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా వేశారు. తన న్యాయవాది ద్వారా బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు జారీ చేశారు. ఈనెల 11వ తేదీన ట్విటర్‌లో మంత్రి కేటీఆర్‌పై బండి సంజయ్ నిరాధారమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. సంజయ్ చేసిన ఆరోపణలపై స్పందించిన కేటీఆర్‌.. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని, లేదంటే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

2. ఆంధ్రప్రదేశ్‌లో 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే ప్రక్రియ: మంత్రుల కమిటీ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 52 డ్రోన్లతో సమగ్ర భూసర్వే ప్రక్రియ నిర్వహిస్తున్నట్టు దీనిపై ఏర్పాటైన మంత్రుల కమిటీ స్పష్టం చేసింది. త్వరలోనే సర్వే ఆఫ్ ఇండియా, ఏపీ ప్రభుత్వం, ప్రైవేటు ఏజెన్సీల ద్వారా 172 డ్రోన్లు సమకూర్చుకోనున్నట్టు మంత్రులు తెలిపారు. ఇప్పటివరకూ 2,149 గ్రామాల్లో డ్రోన్ ద్వారా సర్వే పూర్తి అయ్యిందని వివరించారు. సచివాలయంలో భూసర్వే ప్రక్రియపై సమావేశమైన మంత్రుల కమిటీ దీనిపై అధికారులతో సమీక్ష నిర్వహించింది.

3. ఈ ప్రభుత్వం ఏం చేసిందని గడప గడపకు వెళ్తోంది?: చంద్రబాబు

రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత యువతపై ఉందని తెదేపా అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన.. స్థానిక యువతతో సమావేశమై మాట్లాడారు. ఉద్యోగాలు కల్పించే కోర్సులను వర్సిటీల్లో రద్దు చేశారన్నారు. ఉపాధి లేకుంటే యువత నిరాశ, నిస్పృహలకు లోనవుతారని పేర్కొన్నారు. వైకాపా ప్రభుత్వంపై తాను చేసే యుద్ధం యువత భవిష్యత్తు కోసమేనన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసిందని గడప గడపకు వెళ్తోంది? అని చంద్రబాబు ప్రశ్నించారు

4. దావోస్‌ సదస్సుకు వెళ్లేందుకు సీఎం జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి

స్విట్జర్లాండ్‌లోని దావోస్‌లో 52వ ప్రపంచ వాణిజ్య సదస్సుకు వెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌కు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ నెల 19 నుంచి 31 మధ్య దావోస్‌ వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టులో జగన్‌ పిటిషన్‌ వేశారు. దేశం విడిచి వెళ్లరాదన్న బెయిల్‌ షరతును సడలించాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి హోదాలో అధికార పర్యటనకు వెళ్తున్నట్లు జగన్‌ తెలిపారు.

5. మోస్ట్‌ సెర్చ్‌ జాబితాలో తాజ్‌మహల్‌ నంబర్‌ వన్‌.. మిగతా వారసత్వ ప్రదేశాలు ఇవే

యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల్లో ఒకటైన ‘తాజ్‌మహల్‌’కు విశేష గుర్తింపు దక్కింది. ప్రముఖ ట్రావెల్‌ వెబ్‌సైట్‌ ‘జిటాంగో’ వివరాల ప్రకారం.. మార్చి నెలలో ప్రపంచవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో అత్యధికంగా శోధించిన వారసత్వ సంపదల జాబితాలో ఈ పాలరాతి స్మారక కట్టడం మొదటి స్థానంలో నిలవడం విశేషం. ఒకే నెలలో దాదాపు 14 లక్షలకుపైగా ఈ నిర్మాణం గురించి ఆన్‌లైన్‌లో వెతికారు. 

6. భారత్‌లో టెస్లా కార్ల విక్రయ ప్రయత్నాలకు బ్రేక్‌..!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్‌లో అడుగు పెట్టేందుకు చేస్తున్న ప్రయత్నాలకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. దిగుమతి సుంకాలపై నెలకొన్న ప్రతిష్టంభన వీడకపోవడంతో భారత్‌లో టెస్లా కార్ల విక్రయించే ప్రణాళికకు విరామం ఇవ్వనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. టెస్లా కార్ల విక్రయంపై ఏడాదిగా భారత ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నప్పటికీ సఫలం కాలేకపోయింది.

7. రైల్వేలో ‘బేబీ బెర్తులు’.. మంత్రిపై ఆనంద్‌ మహీంద్రా ప్రశంసలు

భారతీయ రైల్వే ఇటీవలే ఓ పైలట్‌ ప్రాజెక్టును ప్రారంభించింది. చిన్నారులు, పసిబిడ్డలతో ప్రయాణించే వారి సౌకర్యార్థం లఖ్‌నవూ మెయిల్ రైలులో ‘బేబీ బెర్తులు’ అమర్చింది. దిగువన ఉండే ప్రధాన బెర్తుల్లో చిన్నారులు నిద్రించేందుకు వీలుగా వీటిని ఏర్పాటు చేసింది. ఈ తరహా ప్రాజెక్టు చేపట్టినందుకుగానూ రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను దిగ్గజ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్రా అభినందించారు.

8. ఆయిల్ ట్యాంకర్లలో స్మగ్లింగ్‌.. 15.93 కిలోల బంగారం స్వాధీనం

భారత్‌-మయన్మార్‌ సరిహద్దులో భారీగా బంగారం పట్టుబడింది. అక్రమంగా రవాణా చేస్తున్న 15.93 కిలోల విదేశీ బంగారాన్ని రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ అధికారులు స్వాధీనం చేసుకున్నట్టు ఆర్థిక మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ విదేశీ బంగారం విలువ రూ.8కోట్లకు పైనే ఉంటుందని అధికారులు తెలిపారు. ‘గోల్డ్ ఆన్ ది హైవే’ అనే పేరుతో చేపట్టిన ఆపరేషన్‌లో మణిపూర్‌లోని మావూ నుంచి అస్సాంలోని గువహటి వరకు వేర్వేరుగా ప్రయాణం చేస్తున్న రెండు ఆయిల్‌ ట్యాంకర్లు, ఒక ట్రక్కుపై నిఘా వేసి పట్టుకున్నారు. 

9. విరాట్‌ను డుప్లెసిస్‌ పదేళ్లు వెనక్కి తీసుకెళ్లగలగాలి : మైకెల్ వాన్‌

టీ20 లీగ్‌లో ఫామ్‌ కోల్పోయి తీవ్రంగా ఇబ్బంది పడుతున్న విరాట్‌ కోహ్లీ ప్రస్తుత సీజన్‌లో మూడు సార్లు గోల్డెన్‌ డక్‌గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో విరాట్ కోహ్లీ ఫామ్‌పై ఇంగ్లాండ్‌ మాజీ కెప్టెన్‌ మైకెల్‌ వాన్‌ స్పందించాడు. పదేళ్ల కిందట విరాట్ ఎంత స్వేచ్ఛగా బ్యాటింగ్‌ చేశాడో.. ఇప్పుడు కూడా అలానే ఆడాలని సూచించాడు. తొలి ఓవర్లలో కాస్త కుదురుకోగలిగితే కోహ్లీ భారీ స్కోర్లను చేయగలడని అభిప్రాయపడ్డాడు. 

10. యూఏఈ అధ్యక్షుడు షేక్‌ ఖలీఫా బిన్‌ కన్నుమూత

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (UAE) అధ్యక్షుడు, అబుదాబి పాలకుడు షేక్ ఖలీఫా బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుదిశ్వాస విడిచినట్టు అధ్యక్ష మంత్రిత్వశాఖ ప్రకటించిందని అక్కడి మీడియా తెలిపింది. షేక్‌ ఖలీఫా బిన్‌ వయస్సు 73 ఏళ్లు. తన తండ్రి మరణానంతరం 2004 నవంబర్‌ 3న యూఏఈ రెండో అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని