Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Updated : 18 May 2022 21:04 IST

1. మందుబాబులకు షాక్‌.. తెలంగాణలో పెరిగిన మద్యం ధరలు!
మందుబాబులకు తెలంగాణ ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. రాష్ట్రంలో మద్యం ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. పెరిగిన మద్యం ధరలు ఈ నెల 19 నుంచి అమల్లోకి రానున్నట్లు ప్రభుత్వం తెలిపింది. మద్యం దుకాణాల్లో ఇవాళ్టి అమ్మకాలు పూర్తి కాగానే మద్యం సీజ్‌ చేయనున్న అధికారులు.. నిల్వలు లెక్కించి రేపటినుంచి పెరిగిన ధరల ప్రకారం విక్రయించేలా చర్యలు తీసుకోనున్నట్లు అబ్కారీ శాఖ వెల్లడించింది.

2. ఫార్మా రంగంలో ఏ రాష్ట్రానికి లేని అనుకూలతలు, ప్రత్యేకతలు హైదరాబాద్‌ సొంతం: కేటీఆర్‌
ఫార్మా రంగంలో మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడి పెట్టనుంది. దేశంలో ఎక్కడా లేని అత్యాధునిక పార్టికల్ క్యారెక్టరైజేషన్ లేబరేటరీని హైదరాబాద్ లో ఏర్పాటు చేయనున్నట్లు ఇంగ్లాండ్‌కు చెందిన సర్ఫేస్ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్స్ సంస్థ ప్రకటించింది. యునైటెడ్‌ కింగ్‌డమ్‌ (యూకే)లో పర్యటిస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌తో సమావేశం అనంతరం సంస్థ ఎండీ ప్రొఫెసర్ డారిల్ విలియమ్స్, ప్రతినిధుల బృందం లేబరేటరీ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది.

3. తెరాస రాజ్యసభ అభ్యర్థులు ఖరారు

త్వరలో జరగనున్న మూడు రాజ్యసభ స్థానాల ఎన్నికలకు అభ్యర్థులను తెరాస ఖరారు చేసింది. అభ్యర్థుల ఎంపికపై ఆ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు వారి పేర్లను వెల్లడించారు. తొలి నుంచీ ప్రచారంలో ఉన్న నమస్తే తెలంగాణ ఎండీ దీవకొండ దామోదర్‌రావుతో పాటు హెటిరో డ్రగ్స్‌ అధినేత డా.బండి పార్థసారథిరెడ్డి, బీసీ నేత, పారిశ్రామిక వేత్త వద్దిరాజు రవిచంద్ర (గాయత్రి రవి)లను ఎంపిక చేశారు. 


Video: కాశీలోని జ్ఞానవాపి మసీదులో శివలింగం దృశ్యాలు..


4. క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్‌లైన్‌ గేమింగ్‌పై 28% జీఎస్‌టీ?

క్యాసినో (casinos), గుర్రపు పందేలు (race courses), ఆన్‌లైన్‌ గేమింగ్‌ (online gaming)పై ఎంత జీఎస్‌టీ (GST) విధించాలన్న అంశంపై మంత్రుల కమిటీ ఓ నిర్ణయానికి వచ్చింది. వీటిపై 28 శాతం జీఎస్‌టీ వేయాలని పేర్కొంటూ తుది నివేదికను రూపొందించింది. త్వరలో జరగబోయే జీఎస్‌టీ మండలి సమావేశంలో ఈ నివేదికపై చర్చించి అధికారికంగా నిర్ణయం తీసుకునే అవకాశముంది.

5. దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం.. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ రాజీనామా!

దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అనిల్‌ బైజల్‌ అకస్మాత్తుగా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు పంపారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన రాజీనామా చేసినట్టు సమాచారం. 2016 డిసెంబర్‌ 31న లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన బైజల్‌.. దాదాపు ఐదున్నరేళ్లుగా ఆ పదవిలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

6. కాలుష్య భారతం.. ఒక్క ఏడాదిలోనే 23 లక్షల మంది బలి

అన్నిరకాల కాలుష్యాల కారణంగా భారత్‌లో ఒక్క (2019) ఏడాదిలోనే 23లక్షల అకాల మరణాలు సంభవించినట్లు తాజా నివేదిక వెల్లడించింది. వీటిలో 16లక్షల మంది కేవలం వాయు కాలుష్యం వల్లే మరణించినట్లు తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 2019లో కాలుష్యం కారణంగా 90లక్షల మంది ప్రాణాలు కోల్పోగా ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే ఎక్కువ మంది చనిపోయినట్లు పేర్కొంది. ఇలా ఓవైపు ప్రాణనష్టంతో పాటు అకాల మరణాలతో ఆ ఏడాదిలో ప్రపంచానికి 4.6 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక నష్టం వాటిల్లిందని అంచనా వేసింది.

7. రష్యాకు చైనా షాక్‌..! భారీగా కోత పెట్టిన డ్రాగన్‌ దేశం!

రష్యా అత్యంత కఠిన ఆంక్షలను ఎదుర్కొంటోంది. చైనా సాయంతో వీటి నుంచి బయటపడవచ్చని రష్యా భావిస్తోంది. కానీ, అమెరికా, పశ్చిమ దేశాల ఆంక్షలు కఠినంగా ఉండటంతో ఇప్పుడు చైనా కూడా వెనుకడుగు వేస్తోంది. కొన్నాళ్లుగా చైనా నుంచి రష్యాకు వెళుతున్న సాంకేతికపరమైన ఉత్పత్తుల పరిమాణంలో క్రమంగా తగ్గుదల నమోదవుతోంది. ఈ విషయాన్ని అమెరికా కామర్స్‌ సెక్రటరీ జినా రైమాండో వెల్లడించారు.


Video: యానాంలో ప్రకృతి సోయగం చూశారా..!


8. పెట్రోల్‌ కొనేందుకు డబ్బు లేదు.. బంక్‌ల వద్దకు రాకండి..!

ఆర్థిక, ఆహార సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో నిత్యావసరాలు లేక ప్రజలు అల్లాడిపోతున్నారు. పెట్రోల్‌ నిల్వలు నిండుకున్నాయని, ఇంధనాన్ని దిగుమతి చేసుకుందామంటే విదేశీ కరెన్సీ కూడా లేదని శ్రీలంక ప్రభుత్వం బుధవారం తెలిపింది. అందువల్ల ప్రజలెవరూ పెట్రోల్‌ బంకుల వద్ద బారులు తీరొద్దని అభ్యర్థించింది. అయితే ప్రస్తుతానికి డీజిల్‌ నిల్వలు మాత్రం సరిపడా ఉన్నాయని పేర్కొంది.

9. బ్యాంకులు వాటిపై ఓ కన్నేసి ఉంచాలి: శక్తికాంత దాస్‌

ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలపై బ్యాంకులు ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచాలని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ సూచించారు. అవసరమైనప్పుడల్లా తగిన చర్యలూ తీసుకోవాలని తెలిపారు. బ్యాలెన్స్‌ షీట్లపై ప్రభావం పడకుండా మూలధనాన్ని సమకూర్చుకొని పెట్టుకోవడం వంటి అంశాలపై దృష్టి సారించాలని హితవు పలికారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం నెలకొన్న ఆర్థిక పరిస్థితులపై  బ్యాంకుల అధిపతులతో గవర్నర్‌ సహా ఆర్‌బీఐ అధికారులు రెండురోజుల పాటు సమావేశమయ్యారు.

10. భారత్‌ సరికొత్త నౌకా విధ్వంసక క్షిపణి పరీక్ష

భారత్‌ తొలిసారి గగనతలం నుంచి ప్రయోగించే నౌకా విధ్వంసక క్షిపణిని బుధవారం విజయవంతంగా పరీక్షించింది. దీనిని డిఫెన్స్‌ రీసెర్చి అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ అభివృద్ధి చేసింది. దీనికి సంబంధించిన ఫుటేజీని ఇండియన్‌ నేవీ ట్విటర్‌లో పోస్టు చేసింది. భారత్‌ ఆయుధ పరీక్షా కేంద్రమైన ఒడిశాలోని బాలాసోర్‌ నుంచి ఈ క్షిపణిని సీకింగ్‌ 42బీ హెలికాప్టర్‌ నుంచి ప్రయోగించారు. మరో హెలికాప్టర్‌తో క్షిపణి మార్గాన్ని గమనించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని