Updated : 23 May 2022 21:22 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. దేశం ఫస్ట్‌.. పార్టీ నెక్ట్స్.. ఫ్యామిలీ లాస్ట్‌.. అనేదే భాజపా నినాదం: తరుణ్‌చుగ్‌

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి భాజాపా అధికారంలోకి రావడం ఖాయమని ఆ  పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్‌ చుగ్‌ ధీమా వ్యక్తం చేశారు. ఇదే విషయాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా మాట్లాడుకుంటున్నారని వెల్లడించారు. నాంపల్లిలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన జిల్లా అధ్యక్షులు, ఇతర ముఖ్యనేతల సమావేశంలో తరుణ్‌ చుగ్‌ మాట్లాడారు. రాష్ట్రంలో భాజపా కార్యకర్తలు పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు చాలా కష్టపడుతున్నారని పేర్కొన్నారు.

2. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌ ఫార్మా సిటీ ఏర్పాటు: దావోస్‌లో కేటీఆర్‌

కరోనా సంక్షోభం నేపథ్యంలో లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ప్రాధాన్యత మరింతగా పెరిగిందని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. లైఫ్ సైన్సెస్ మెడికల్ రంగానికి ఊతం ఇచ్చేందుకు అవసరమైన ప్రభుత్వ విధానాలకు భారతదేశంలో కొంత తక్కువ మద్దతు ఉందన్నారు. ప్రపంచ స్థాయి పోటీని తట్టుకుని నిలబడాలంటే భారత లైఫ్ లైసెన్స్ రంగం బలోపేతానికి విప్లవాత్మకమైన సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు.


Video: 180 దేశాలకు చెందిన కరెన్సీ నోట్లు ఒకే చోట!


3. దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోన్న సీఎం కేసీఆర్: బండి సంజయ్‌

తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలే లేనట్లుగా, రాష్ట్రమంతా ప్రశాంతంగా ఉన్నట్లుగా సీఎం కేసీఆర్ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దిల్లీ, పంజాబ్‌ వెళ్లి దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా ప్రసంగాలు చేస్తున్నారని ఆక్షేపించారు. అబద్ధాలను నిజాలని చెప్పే ప్రయత్నం చేస్తున్నారని అగ్రహం వ్యక్తం చేశారు.

4. భారత్‌-జపాన్‌ సహజ భాగస్వాములు: ప్రధాని మోదీ

భారత్‌, జపాన్‌ సహజ భాగస్వాములని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జపనీయుల పెట్టుబడులు భారతదేశ అభివృద్ధి గమనంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని వ్యాఖ్యానించారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం జపాన్‌కు వెళ్లిన ప్రధాని.. తొలి రోజు టోక్యోలో ప్రవాస భారతీయులతో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రసంగించారు. జపాన్‌తో భారత్‌ బంధం ఆధ్యాత్మికమైందని, సహకారంతో కూడుకున్నదన్నారు. భారత్, జపాన్‌ సహజ భాగస్వాములన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో జపాన్‌ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.

5. భాజపా పాలన హిట్లర్‌, ముస్సోలిని కన్నా దారుణంగా ఉంది: మమత

కేంద్రంలోని భాజపా ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్రాల వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి, బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మండిపడ్డారు. దేశంలో సమాఖ్య నిర్మాణాన్ని కూల్చివేస్తోందన్నారు. కోల్‌కతాలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. కాషాయ పార్టీ పాలన అడోల్ఫ్‌ హిట్లర్‌, జోసెఫ్‌ స్టాలిన్‌ లేదా బెనిటో ముస్సోలిని కన్నా దారుణంగా ఉందని వ్యాఖ్యానించారు.


TS News: మోదీ ముఖం ఎందుకు చూడాలి?: ఎర్రబెల్లి


6. కిమ్‌కు కరోనా భయంలేదు.. మాస్క్‌ తీసి..!

ఉత్తర కొరియాలో కరోనా లక్షణాలతో లక్షల సంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశాధినేత ముఖానికి కనీసం మాస్క్‌కు కూడా లేకుండా ఓ సైనిక జనరల్‌ అంత్యక్రియల్లో పాల్గొన్నారు. ఆ విషయం ఓ పెద్ద ఘనకార్యంలా ఆ దేశ మీడియా సంస్థ కేసీఎన్‌ఏ ప్రచారం చేసుకొంది. కిమ్‌ తండ్ర మరణం తర్వాత ఉ.కొరియాలో జరిగిన అతిపెద్ద అంత్యక్రియల కార్యక్రమం ఇదే కావడం గమనార్హం.

7. డ్రాగా ముగిసిన భారత్‌ X పాకిస్థాన్‌ మ్యాచ్‌

క్రీడాభిమానులు ఎంతగానో ఎదురుచూసిన భారత్‌, పాకిస్థాన్‌ మధ్య హాకీ మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. హాకీ ఆసియా కప్‌లో దాయాది దేశాల మద్య సాగిన పోరు 1-1  గోల్స్‌తో డ్రా అయ్యింది. మ్యాచ్‌ ఆసాంతం భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించగా.. చివర్లో పాక్‌ ఓ గోల్‌ చేసి ఓటమిని తప్పించుకుంది. మ్యాచ్‌ ప్రారంభం అయిన మొదటి క్వార్టర్‌లోనే భారత ఆటగాడు కార్తీ సెల్వమ్‌ అద్భుత గోల్‌ చేశాడు. ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఒక్క గోల్‌ కూడా నమోదు కాలేదు.

8. శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌పై రూ.100కోట్ల పరువునష్టం దావా

శివసేన నేత, రాజ్యసభ ఎంపీ సంజయ్‌ రౌత్‌పై రూ.100కోట్లకు పరువునష్టం దావా దాఖలైంది. భాజపా నేత కిరీట్‌ సోమయ్య భార్య, ప్రొఫెసర్‌ మేధా బాంబె హైకోర్టులో ఈ దావా దాఖలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా టాయిలెట్‌ స్కామ్‌  పేరుతో శివసేనకు చెందిన సామ్నా పత్రికలో వస్తోన్న కథనాలు తన పరువుకు నష్టం కలిగించేవిగా ఉన్నాయని అందులో పేర్కొన్నారు. తదుపరి కథనాలు ఆపడంతో పాటు క్షమాపణలు చెప్పాలంటూ డాక్టర్‌ మేధా తన పిటిషన్‌లో పేర్కొన్నారు.


Viral Video: రూ.లక్షల విలువైన మద్యం సీసాలను  రోడ్డు రోలర్‌తో తొక్కించి..!


9. అఫ్గానిస్థాన్‌ తరహాలో ఉక్రెయిన్‌లో దెబ్బతిన్న రష్యా..

ఉక్రెయిన్‌ ఆక్రమణలో రష్యా తీవ్రంగా దెబ్బతిందని బ్రిటన్‌ చెబుతోంది. ఈ సైనిక చర్యలో రష్యా వైపు ప్రాణ నష్టం.. గతంలో అఫ్గాన్‌ ఆక్రమణ సమయంలో సొవియట్‌ సేనల నష్టాలతో సమానమని యూకే రక్షణ మంత్రిత్వ శాఖ సోమవారం వెల్లడించింది. ‘‘పేలవమైన వ్యూహాలు, కమ్యూనికేషన్ల లోపాలు, కమాండింగ్‌ వ్యవస్థలో పదేపదే తప్పులు చేయడం వంటి కారణంగా రష్యా వైపు భారీగా మరణాలు నమోదవుతున్నాయి. డాన్‌బాస్‌లో అదే విధంగా పోరాటం కొనసాగిస్తున్నారు’’ అని రష్యా పరిస్థితిపై తమకు వచ్చిన ఇంటెలిజెన్స్‌ను యూకే వెల్లడించింది.

10. చెన్నై సురేశ్‌ రైనా లాంటి ఆటగాడిని కనుగొనాలి: శాస్త్రి

భారత టీ20 లీగ్‌లో అత్యంత ప్రజాదరణ కలిగిన, అత్యంత విజయవంతమైన జట్టు చెన్నై ఇకపై విజేతగా నిలవాలంటే సురేశ్‌ రైనా లాంటి ఆటగాడిని కనుగొనాలని టీమ్‌ఇండియా మాజీ కోచ్‌ రవిశాస్త్రి అభిప్రాయపడ్డాడు. ఎన్నో ఏళ్లుగా రైనా ఆ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడని, ఇప్పుడు ఆ జట్టు బ్యాటింగ్‌ లైనప్‌ బలంగా చేసుకోవాలంటే అలాంటి ఆటగాడిని వెతకాలని శాస్త్రి పేర్కొన్నాడు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని