Published : 25 May 2022 21:01 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ఆత్మకూరు ఉప ఎన్నిక షెడ్యూల్‌ విడుదల

నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ స్థానంలో ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్‌ విడుదల చేసింది. మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హఠాన్మరణంతో ఖాళీ అయిన ఈ స్థానంలో జూన్‌ 23న పోలింగ్‌ జరపాలని నిర్ణయించింది. నామినేషన్లకు ఆఖరి గడువు జూన్‌ 6గా నిర్ణయించగా.. నామినేషన్ల పరిశీలన జూన్‌ 7, నామినేషన్ల ఉపసంహరణ గడువును జూన్‌ 9గా పేర్కొంది. అలాగే, జూన్‌ 23న పోలింగ్ , జూన్‌ 26న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు తెలిపింది.

2. కోనసీమలో ఎస్పీ వాహనంపై ఆందోళనకారుల రాళ్ల దాడి

కోనసీమలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ వాహనంపై కొంతమంది ఆందోళనకారులు రాళ్ల దాడికి దిగారు. జిల్లాలోని రావులపాలెం రింగ్‌రోడ్డు వద్ద ఎస్పీ ఐశ్వర్య రస్తోగి కారుపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. రాళ్ల దాడి జరిగిన వెంటనే అప్రమత్తమై పోలీసులు వెంబడించడంతో ఆందోళనకారులు పారిపోయారు. కోనసీమ సాధన సమితి ఇవాళ చలో రావులపాలెంకు పిలుపునిచ్చింది. చలో రావులపాలెం అంటూ నిరసన కార్యక్రమాలు చేపట్టేందుకు వారు నిర్ణయించారు. 

గనిలో దొరికిన వజ్రం..లక్షాధికారిగా మారిన గృహిణి

3. వైకాపా నుంచి ఎమ్మెల్సీ అనంతబాబు సస్పెన్షన్‌

తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్‌ చేశారు. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు అనంతబాబును పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. తన మాజీ డ్రైవర్‌ సుబ్రహ్మణ్యం మరణానికి తానే బాధ్యుడినని అనంతబాబు వాంగ్మూలం ఇచ్చినట్లు పోలీసులు ప్రకటించిన నేపథ్యంలో సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది.

4. విధ్వంసాలు సృష్టిస్తే మాత్రం సహించేది లేదు: మంత్రి రోజా

కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు విషయంలో ప్రతిపక్షాల తీరును రాష్ట్ర మంత్రి రోజా తప్పుబట్టారు. కోనసీమకు అంబేడ్కర్‌ పేరు పెట్టే విషయంలో ప్రతిపక్షాలు ద్వంద్వ వైఖరితో వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టాలని గతంలో ప్రతిపక్షాలు నిరాహార దీక్షలు చేసినట్లు గుర్తు చేశారు. ప్రజలు సైతం అంబేడ్కర్‌ పేరు పెట్టాలని కోరినట్లు చెప్పారు. అందరూ కోరిన మేరకే సీఎం జగన్‌ కోనసీమ జిల్లాకు అంబేడ్కర్‌ పేరు పెట్టారని పేర్కొన్నారు.

5. అమలాపురం పోలీసుల అదుపులో అన్యం సాయి!

అమలాపురంలో నిన్న చోటుచేసుకున్న అల్లర్ల కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో అనుమానితుడిగా ఉన్న వైకాపా కార్యకర్త అన్యం సాయితో పాటు 46 మందిని అరెస్టు చేసిన పోలీసులు వారిని విచారిస్తున్నారు. మంత్రి విశ్వరూప్‌ అనుచరుడైన అన్యం సాయి.. ఈ నెల 20న కోనసీమ సాధన సమితి ఆందోళనల్లో పాల్గొన్నాడు. అమలాపురం కలెక్టరేట్‌ వద్ద పెట్రోల్‌ పోసుకొని హల్‌చల్‌ చేశాడు.

Mariupol: తవ్వేకొద్దీ శవాల గుట్టలు...

6. తెలంగాణలో రూ.వెయ్యి కోట్లతో ష్నైడర్ ఎలెక్ట్రిక్ కార్యకలాపాల విస్తరణ

తెలంగాణలో తన కార్యకలాపాలను ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ మరింత విస్తరించనుంది. ఇందుకోసం రాష్ట్రంలో భారీ పెట్టుబడి పెట్టేందుకు ముందుకొచ్చింది. తెలంగాణలో రూ.1000 కోట్లు పెట్టుబడి పెట్టేందుకు ష్నైడర్ ఎలెక్ట్రిక్ సంస్థ సంసిద్ధత వ్యక్తం చేసింది. రాష్ట్రంలో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నట్లు ప్రకటించింది. దావోస్‌లోని తెలంగాణ పెవిలియన్‌లో మంత్రి కేటీఆర్‌తో సమావేశమైన సంస్థ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ లుక్ రిమోంట్ ఈ ప్రకటన చేశారు.

7. హిందూస్థాన్‌ జింక్‌లో వాటాల విక్రయానికి కేబినెట్‌ ఆమోదం!

పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేస్తోంది. ఇటీవలే ఎల్‌ఐసీ ఐపీఓ ద్వారా దాదాపు రూ.21 వేల కోట్లు సమీకరించింది. తాజాగా హిందూస్థాన్ జింక్‌లో ఉన్న 29.5 శాతం వాటాలను విక్రయించేందుకు సిద్ధమవుతోంది. దీనికి ఆర్థిక వ్యవహారాల కేబినెట్‌ కమిటీ ఆమోదం కూడా లభించినట్లు సమాచారం. ఈ మొత్తం వాటాను ప్రభుత్వం రూ.38,560 కోట్లకు విక్రయించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది.

సినిమా పాటలకు స్టెప్పులతో అదరగొట్టిన జేసీ ప్రభాకర్‌ రెడ్డి

8. ఉగ్రవాదులకు నిధుల కేసు.. యాసిన్‌ మాలిక్‌కు జీవితఖైదు

ఉగ్రవాదులు, ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చిన కేసులో కశ్మీరీ వేర్పాటువాద నేత యాసిన్‌ మాలిక్‌కు జీవితఖైదు పడింది. ఇప్పటికే ఈ కేసులో దోషిగా తేల్చిన పటియాలా హౌస్‌ ఎన్‌ఐఏ (జాతీయ దర్యాప్తు సంస్థ) కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. యాసిన్‌ మాలిక్‌ ఇటీవల తన నేరాన్ని అంగీకరించడంతో ఎన్‌ఐఏ కోర్టు అతడిని దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే. 

9. బంకుల్లో పెట్రోల్‌ లేదు.. ఏటీఎంలో నగదు నిల్..!

పాకిస్థాన్‌లో నెలకొన్న దారుణ పరిస్థితులపై ఆ దేశ క్రికెటర్‌, మాజీ ఆల్‌రౌండర్‌ మహమ్మద్‌ హఫీజ్‌ ఆవేదన వ్యక్తంచేశారు. గతంలో పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) వ్యవహార తీరుపై గతంలో గళంవిప్పిన హఫీజ్‌.. తాజాగా అక్కడి పరిస్థితులపై రాజకీయ నేతలను ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశాడు. లాహోర్‌లోని బంకుల్లో పెట్రోల్‌ లేదని,  ఏటీఎం యంత్రాల్లో నగదు అందుబాటులో లేదని పేర్కొన్నారు. దీంతో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారంటూ ట్వీట్‌ చేశారు.

10. కాంగ్రెస్‌ కష్టాలు.. 5 నెలల్లో ఐదుగురు ముఖ్య నేతలు ఔట్‌..!

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో వచ్చిన ఫలితాలతో మేల్కొన్న కాంగ్రెస్‌ పార్టీ.. నష్ట నివారణ చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా చింతన శిబిరం పేరుతో ఇటీవల మేధోమధన సదస్సును కూడా నిర్వహించింది. అయినప్పటికీ పార్టీ నుంచి వలసలు ఆగడం లేదు. పంజాబ్‌లో కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ మొదలు తాజాగా కపిల్‌ సిబల్‌ వరకు కాంగ్రెస్‌లో అగ్రనేతల రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. ఇలా గడిచిన ఐదు నెలల్లోనే చాలా మంది ముఖ్య నాయకులు పార్టీని వీడిపోయారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని