Updated : 31 May 2022 10:27 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నదిలో పడిన వాహనం.. ఏడుగురు జవాన్లు దుర్మరణం

లద్దాఖ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జవాన్లు ప్రయాణిస్తోన్న ఓ వాహనం నదిలో పడి ఏడుగురు దుర్మరణం చెందారు. మరో 19 మంది గాయపడ్డారు. శుక్రవారం ఉదయం పార్థాపూర్‌ శిబిరం నుంచి 26 మంది సైనికులు వాహనంలో హనీఫ్‌ సబ్‌ సెక్టార్‌ వైపు వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. టుర్టుక్‌ సెక్టార్‌ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తోన్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపై నుంచి జారి షియోక్‌ నదిలో పడింది. 

బీఎస్‌ఎన్‌ఎల్‌ రూ.2399 ప్లాన్‌పై 60 రోజుల ఎక్స్‌ట్రా వ్యాలిడిటీ

2. చార్‌ధామ్‌ యాత్ర.. ఆందోళనకర రీతిలో యాత్రికుల మరణాలు!

కొవిడ్‌ కారణంగా నిలిచిపోయిన చార్‌ధామ్‌ యాత్ర.. రెండేళ్ల విరామం తర్వాత మొదలు కావడంతో వేల మంది ఊపిరి పీల్చుకున్నారు. ఓ వైపు భక్తులతోపాటు యాత్రపైనే ఆధారపడి జీవనం సాగించే ఎంతో మందికి ఉపశమనం కలిగింది. కానీ, ఈసారి చార్‌ధామ్‌ యాత్ర మొదలైన నెలరోజుల్లోపే 78 మంది యాత్రికులు మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోవడం కలవరపెడుతోంది. ఈ నేపథ్యంలో యాత్రికులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.

3. కరోనా తరహాలో మంకీపాక్స్‌ ఉండదు: డబ్ల్యూహెచ్‌ఓ

మంకీపాక్స్ వైరస్‌ కరోనా అంత ప్రమాదకారి కాదని, దీనిని నియంత్రించవచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) వెల్లడించింది. కానీ, దీనిపై పలు అనిశ్చితులు నెలకొన్నాయని పేర్కొంటూ.. ఈ వైరస్‌ నివారణకు వినియోగించే మశూచి టీకాలు ఏయే దేశాల వద్ద ఎన్ని ఉన్నాయో తమ వద్ద పూర్తి సమాచారం లేదని తెలిపింది. ప్రస్తుతం 20 దేశాల్లో 200లకు పైగా మంకీపాక్స్‌ కేసులు వెలుగుచూశాయి.

Booker Prize : తల్లీకూతుళ్ల మధ్య సంఘర్షణే చదివించేసింది!

4. ఈసారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా: నారా లోకేశ్

మహానాడు సందర్భంగా నారా లోకేశ్‌ మీడియాతో ముచ్చటించారు. ‘‘పార్టీ నేతలకు సుదీర్ఘకాలం పదవుల విధానం రద్దు ప్రతిపాదనను పెట్టాను. ఈ విధానాన్ని నా నుంచే అమలు చేయాలని భావిస్తున్నా. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా మూడుసార్లు చేశాను. ఈ సారి తప్పుకొని వేరొకరికి అవకాశం ఇస్తా. ఈ తరహాలోనే పార్టీలో 2+1 విధానం రావాలి. రెండు పర్యాయాలు వరుసగా ఒక పదవిలో ఉన్న వారికి విరామం ఇవ్వాలి’’ అని చెప్పారు. 

5. 7.33 లక్షల మంది అభ్యర్థులు.. 12.91 లక్షల దరఖాస్తులు

తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు 7.33 లక్షల మంది అభ్యర్థులు 12.91 లక్షల దరఖాస్తులు చేసుకున్నట్లు పోలీసు నియామక మండలి వెల్లడించింది. వీటిలో ఎస్సై పోస్టులకి 2.47 లక్షలు, కానిస్టేబుల్‌ పోస్టులకు 9.50 లక్షల దరఖాస్తులు వచ్చినట్లు నియామక మండలి తెలిపింది. ములుగు, ఆసిఫాబాద్, భూపాలపల్లి, నారాయణపేట్, జనగాం, సిరిసిల్ల జిల్లాల నుంచి తక్కువ సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నట్లు నియామక మండలి తెలిపింది. 

6. కార్పొరేటర్‌ తిన్న బిర్యానీలో బల్లి.. హోటల్‌ నిర్వాహకుడిపై కేసు

హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌లో కొనుగోలు చేసిన బిర్యానీలో బల్లి కనిపించడం కలకలం రేపింది. రామ్‌నగర్‌ డివిజన్‌ కార్పొరేటర్‌ రవిచారి సోదరుడు శ్రీనివాస్‌.. ఆర్టీసీ క్రాస్‌ రోడ్డులోని ఓ హోటల్‌ నుంచి చికెన్‌ బిర్యానీ తెప్పించుకున్నారు.  ఇద్దరూ కలిసి బిర్యానీ తింటుండగా అందులో బల్లి కనిపించింది. దీంతో ఒక్కసారిగా కంగుతిన్నారు. ఈ మేరకు చిక్కడపల్లి పోలీసులకు కార్పొరేటర్‌ ఫిర్యాదు చేశారు. 

7. పార్టీ అధికార ప్రతినిధుల పనితీరుపై బండి సంజయ్‌ మండిపాటు

భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధుల పనితీరుపై ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార ప్రతినిధులుగా చేయాల్సిన పనులు చేయడంలేదని మండిపడ్డారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో అధికార ప్రతినిధులతో బండి సంజయ్‌ సమావేశమయ్యారు. 9 మంది అధికార ప్రతినిధులు ఉన్నప్పటికీ పార్టీ కోసం ఆశించిన స్థాయిలో పనిచేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

YSRCP: బోసిపోయిన ‘సామాజిక న్యాయభేరి’

8. ఓలా కార్ల ఫ్యాక్టరీకి స్థల సేకరణ.. పరిశీలనలో తెలంగాణ

విద్యుత్తు వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌ కార్ల తయారీ దిశగా వేగంగా ముందుకెళ్తోంది. ఇప్పటికే డిజైన్లు సిద్ధం చేసిన ఈ సంస్థ తయారీ కేంద్రం నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న ఓ ఉన్నతాధికారి తెలిపారు. దాదాపు 1000 ఎకరాల్లో కారు, సెల్‌ తయారీకి సంబంధించిన గిగా ఫ్యాక్టరీ ఏర్పాటుకు ప్రణాళికలు రచించినట్లు సదరు అధికారి వెల్లడించారు. 

9. మాజీ సీఎం చౌతాలాకు జైలుశిక్ష.. ₹50లక్షల జరిమానా

అక్రమాస్తుల కేసులో హరియాణా మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్‌ చౌతాలా (87)కు నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. దీనితోపాటు రూ.50 లక్షల జరిమానా విధిస్తూ దిల్లీలోని రౌస్‌ ఎవెన్యూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో మే 21న ఆయన్ను దోషిగా తేల్చిన న్యాయస్థానం తాజాగా శిక్ష ఖరారు చేసింది. చౌతాలాకు శిక్ష, జరిమానాతోపాటు ఆయన పేరుమీదున్న నాలుగు ఆస్తులను కూడా జప్తు చేయాలని కోర్టు ఆదేశించింది.

Australia: నిద్ర లేచేసరికి చుట్టూ పొగమంచే!

10. పోలీసులకు ఫోన్‌ చేసి మరీ ఉత్తరాఖండ్‌ మాజీ మంత్రి ఆత్మహత్య..!

సొంత మనవరాలిని వేధించినట్లు తనపై కోడలే కేసు పెట్టడంతో ఉత్తరాఖండ్‌కు చెందిన మాజీ మంత్రి రాజేంద్ర బహుగుణ (59) ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనకు ముందు పోలీసు ఎమర్జెన్సీ నంబర్‌ 112కు ఫోన్‌ చేసి తాను ఆత్మహత్య చేసుకొంటున్న విషయాన్ని వెల్లడించారు. వెంటనే పోలీసులు అక్కడకు చేరుకొన్నారు. కానీ, అప్పటికే ఇంటి ట్యాంక్‌పైకి ఎక్కిన రాజేంద్ర తుపాకీతో కాల్చుకొంటానని పోలీసులను బెదిరించారు. అధికారులు లౌడ్‌స్పీకర్‌లో ఆయనతో మాట్లాడి నచ్చజెప్పేందుకు ప్రయత్నించారు. 

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని