Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 06 Jun 2022 20:58 IST

1. గవర్నర్‌ బిశ్వభూషణ్‌తో సీఎం జగన్‌ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ కలిశారు. దాదాపు గంట సేపు గవర్నర్, సీఎం భేటీ అయ్యారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ అంశాలపై వారు చర్చించారు. ఈనెల 20వ తేదీ నుంచి వారం రోజుల పాటు శాసనసభ సమావేశాలు జరపాలని ప్రభుత్వం దాదాపుగా నిర్ణయించింది. ఇందుక సంబంధించి శాసనసభ నిర్వహణ తేదీలు, సహా సభలో పెట్టే పలు కీలక బిల్లులపై గవర్నర్‌తో సీఎం చర్చించినట్లు సమాచారం. 

శిక్షలే కాదు.. మృగాళ్లకు ఆ ఆలోచనే రాకుండా చేయాలి: పవన్‌ 

2. నలుగురు పోలీసు అధికారులకు 4 వారాలు జైలు శిక్ష

తెలంగాణలో నలుగురు పోలీసు అధికారులకు హైకోర్టు 4 వారాల జైలు శిక్ష విధించింది. కోర్టు ధిక్కరణ కేసులో పోలీసు అధికారులకు ఉన్నత న్యాయస్థానం శిక్ష విధిస్తూ తీర్పు వెల్లడించింది. జక్కా వినోద్ కుమార్ రెడ్డి, జక్కా సౌజన్య రెడ్డి గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ హైకోర్టు విచారణ చేపట్టింది. భార్యాభర్తల వివాదం కేసులో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా వీరు వ్యవహరించారని పోలీసు అధికారులపై అభియోగాలు దాఖలయ్యాయి.

3. కేసులు ఎదుర్కోవడం నాకు కొత్త కాదు: రఘునందన్‌రావు

జూబ్లీహిల్స్‌లో బాలికపై జరిగిన సామూహిక అత్యాచారం ఘటనకు సంబంధించి బాధితురాలి ఫొటోలు తాను విడుదల చేయకముందే అన్ని టీవీల్లో దృశ్యాలు వచ్చాయని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు వెల్లడించారు. అంతేకాకుండా తాను బాలిక పేరు ఎక్కడా చెప్పలేదని, ముఖం కూడా చూపెట్టలేదని స్పష్టం చేశారు. మరోవైపు కేసులు ఎదుర్కోవడం తనకు కొత్త కాదని.. డీసీపీ జోయల్‌ డేవిస్‌కు ఆ విషయం బాగా తెలుసునన్నారు. తన తప్పుంటే కేసు పెట్టుకోవాలని సూచించారు. 

నేరం చేసినట్లు ఒప్పుకోవాలని అడిగారు: గౌతు శిరీష

4. అది జగన్‌ స్కీం కాదు.. నరేంద్ర మోదీది: జేపీ నడ్డా

దేశాన్ని సురక్షితంగా ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను భాజపా కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. ఏపీ పర్యటనలో భాగంగా విజయవాడ చేరుకున్న ఆయన.. అక్కడ నిర్వహించిన భాజపా శక్తి కేంద్ర ప్రముఖుల సమ్మేళనంలో మాట్లాడారు.  రాష్ట్రంలో 46వేలకు పైగా పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయని.. బూత్‌ల వారీగా ప్రజల వద్దకు పార్టీని తీసుకెళ్లాల్సిన బాధ్యత శక్తి కేంద్ర ప్రముఖులపై ఉందని చెప్పారు.

5. ఉద్యోగుల సాధారణ బదిలీలకు ఏపీ సర్కారు పచ్చజెండా

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉద్యోగుల సాధారణ బదిలీలకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. రాష్ట్రంలో సాధారణ బదిలీలపై ఇప్పటివరకు నిషేధం కొనసాగుతూ వచ్చింది. ఆ నిషేధాన్ని సడలిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అందుకు సంబంధించిన ఉత్తర్వులపై రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ సంతకం చేశారు. దీంతో ఉద్యోగుల సాధారణ బదిలీలపై అడ్డంకులు తొలిగిపోయినట్లు అయింది.

Imran Khan: ఇమ్రాన్‌ ఖాన్‌ను అరెస్టు చేస్తాం..!

6. తెలంగాణలో జూన్‌ 30 నుంచి బోనాల జాతర

తెలంగాణలో బోనాల జాతర వచ్చేసింది. ఈ నెల 30న గోల్కొండ బోనాలతో ఆషాడ బోనాలు ప్రారంభం కానున్నాయి. జులై 17న మహంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భవిష్యవాణి జరగనున్నాయి. జులై 24న భాగ్యనగర బోనాలు, జులై 25న ఉమ్మడి దేవాలయాల ఘట్టాలను ఊరేగించనున్నారు. జులై 28న గోల్కొండ బోనాలతో ఉత్సవాలు ముగియనున్నాయి.

7. తిరుమల శ్రీవారికి ఒక్కరోజు విరాళాల్లో ఇదే అత్యధికం

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారికి భక్తులు భారీ విరాళాన్ని అందించారు. తమిళనాడుకు చెందిన పలువురు భక్తులు శ్రీవారికి రూ.10 కోట్లు విరాళంగా అందజేశారు. స్వామివారికి ఇలా ఒక్క రోజే భారీ స్థాయిలో విరాళం అందించడం తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) చరిత్రలో ఇదే తొలిసారి కావడం గమనార్హం.

8. ‘మీలా మతోన్మాదులకు స్మారకాలు కట్టడంలేదు’.. పాక్‌పై భారత్‌ నిప్పులు

అనుచిత వ్యాఖ్యలు చేశారని పేర్కొంటూ భారత్‌లోని మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని పాక్‌ ప్రధాని షెహబాజ్‌ చేసిన వ్యాఖ్యలను భారత్‌ తిప్పికొట్టింది. నిత్యం మైనారిటీ హక్కులను ఉల్లంఘించే ఓ దేశం.. మరో దేశంలోని మైనారిటీల సంక్షేమం గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ పేర్కొన్నారు. పాకిస్థాన్‌లా మేము మతోన్మాదులను కీర్తించడం, వారి గౌరవార్థం స్మారక చిహ్నాలను నిర్మించడం లేదని వ్యాఖ్యానించారు.

ఎవరైనా అలాగే అనుకుంటారు.. అందులో కొత్తేముంది?: సుప్రియా సూలే

9. కేరళలో నోరోవైరస్‌ కలవరం.. ఇద్దరు చిన్నారుల్లో గుర్తింపు

ఇప్పటికే కరోనాతో సతమతమవుతోన్న ప్రజలకు కొత్త వైరస్‌లు పెను ముప్పుగా తయారవుతున్నాయి. కేరళ తిరువనంతపురంలో తాజాగా నోరోవైరస్‌ (Norovirus) వ్యాప్తి కలకలం రేపుతోంది. ఇద్దరు చిన్నారుల్లో ఈ వైరస్‌ గుర్తించినట్లు కేరళ ప్రభుత్వం వెల్లడించింది. కలుషిత నీరు, ఆహారం వల్ల అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఆస్కారం ఉండడంతో అప్రమత్తమైన అధికారులు.. పరిస్థితులను సమీక్షిస్తూ వైరస్‌ కట్టడి చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు.

10. రెండింతలకు రష్యా చమురు దిగుమతులు?

అధిక ధరలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు ఉపశమనం కల్పించేందుకు భారత ప్రభుత్వం ఉన్న అవకాశాలను ఉపయోగించుకుంటోంది. రష్యా నుంచి తక్కువ ధరకే చమురు కొనుగోలు చేస్తున్న కేంద్రం.. అక్కడి నుంచి దిగుమతులను రెండింతలు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందుకు ప్రభుత్వరంగ చమురు శుద్ధి సంస్థలు కూడా సంసిద్ధంగా ఉండడంతో రష్యాతో చర్చలు ప్రారంభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని