Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 07 Jun 2022 20:56 IST

1. సీడీఎస్‌ నియామకం.. రూల్స్‌ మార్చిన కేంద్రం

దేశ తదుపరి చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్ ‌(సీడీఎస్‌) నియామకం చేపట్టే ముందు కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. సీడీఎస్‌ నియామకానికి అర్హత పరిధిని మరింత పెంచుతూ సర్వీసు నిబంధనల్లో సవరణలు చేసింది. ఈ మేరకు కేంద్ర రక్షణ శాఖ మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. తాజా సవరణలతో త్రీ స్టార్‌ అధికారులు, రిటైర్డ్‌ అధికారులు సీడీఎస్‌ పదవికి అర్హులు కానున్నారు. 

2. గదిలో మంటలు.. లాలూకు తృటిలో తప్పిన ప్రమాదం

రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) అధినేత, బిహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తృటిలో పెను ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన ఉంటున్న గదిలో అగ్నిప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. సిబ్బంది అప్రమత్తమై వెంటనే మంటల్ని ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. మేదినీనగర్‌లో బస చేస్తోన్న లాలూ.. ఈ ఉదయం తన గదిలో అల్పాహారం తింటుండగా  ఫ్యాన్‌కు మంటలు అంటుకున్నాయి.

విధి వీల్‌చైర్‌కు పరిమితం చేసినా.. కృషి కలెక్టర్‌ను చేసింది!

3. వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు: జేపీ నడ్డా

వైకాపా ప్రభుత్వాన్ని సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా అన్నారు. రాజమహేంద్రవరంలోని ఆర్ట్స్‌ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన భాజపా గోదావరి గర్జన సభకు నడ్డా ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. తెలుగు సంస్కృతికి ఈ ప్రాంతం ప్రతిబింబంగా ఉంటుందని, రాష్ట్రంలో భాజపా అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

4. విద్యార్థులు ధైర్యంగా ఉండాలి.. ఫెయిలైంది ప్రభుత్వ వ్యవస్థలే: చంద్రబాబు

పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దని తెలుగుదేశం అధినేత చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలన్నారు. వ్యవస్థలో లోపాలకు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థి లోకానికి సూచించారు. నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదని తెలిపారు. 

5. ఇంగ్లిష్‌ మీడియం వల్లే పదిలో ఉత్తీర్ణతశాతం తగ్గి ఉండొచ్చు: సజ్జల

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్‌ మీడియం ప్రవేశపెట్టడం వల్లే పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత శాతం తగ్గి ఉండవచ్చని, దీన్ని తాము పట్టించుకోమని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఇంగ్లిష్‌ మీడియం అమలు వల్ల తొలుత సవాళ్లు, ఇబ్బందులు ఉంటాయని సీఎం కూడా చెప్పారని తెలిపారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపడం ద్వారా పోటీ పరీక్షల్లో ముందుకు వెళ్లేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని, ఇంగ్లిష్‌ మీడియం వల్ల దీర్ఘకాలంలో మంచి ఫలితాలు వస్తాయన్నారు.

6. భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య కేసు... హైకోర్టుకు మధ్యంతర నివేదిక

ఖమ్మంలో భాజపా కార్యకర్త సాయి గణేశ్‌ ఆత్మహత్య కేసు దర్యాప్తు మధ్యంతర నివేదికను పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. సాయిగణేశ్‌ ఆత్మహత్య కేసును సీబీఐకి అప్పగించాలంటూ న్యాయవాది కృష్ణయ్య దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై సీజే జస్టిస్‌ సతీశ్‌ చంద్రశర్మ, జస్టిస్‌ అభినందన్‌ కుమార్‌ షావిలి ధర్మాసనం ఇవాళ మరోసారి విచారణ చేపట్టింది. పోలీసులు సమర్పించిన నివేదికను పిటిషనర్‌కు ఇవ్వాలని రిజిస్ట్రీని హైకోర్టు ఆదేశించింది.

7. మహారాష్ట్రలో మళ్లీ మొదలైన రిసార్ట్‌ రాజకీయాలు

మహారాష్ట్రలో ఖాళీగా ఉన్న ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికల గడువు సమీపిస్తోన్న వేళ అక్కడ రిసార్ట్‌ రాజకీయం మొదలయ్యింది. మద్దతుదారులు చేజారిపోకుండా ఆయా పార్టీలు శాసనసభ్యులను ప్రత్యేక ప్రాంతాలకు తరలిస్తున్నాయి. ముఖ్యంగా నాలుగు స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న అధికార మహావికాస్‌ అఘాడీ (MVA) ఓవైపు.. మూడు స్థానాల్లో ఎలాగైనా గెలుస్తామనే ధీమాతో ఉన్న భాజపాలు విజయం కోసం కృషి చేస్తున్నాయి. 

8. ఎంపీ నవనీత్ రాణా అరెస్టుపై ఉన్నతాధికారులకు సమన్లు!

మహారాష్ట్ర సీఎం ఇంటి ముందు హనుమాన్‌ చాలీసా పఠనం వ్యవహారంలో అమరావతి ఎంపీ నవనీత్‌ రాణాను అరెస్టు చేయడంపై ఉన్నతాధికారులకు షాక్‌ తగిలింది! మహారాష్ట్ర సీఎస్‌ మనుకుమార్‌ శ్రీవాస్తవ, డీజీపీ రజనీశ్‌ సేథ్‌, ముంబయి పోలీస్‌ కమిషనర్‌ సంజయ్‌ పాండే, బైకుల్లా జిల్లా జైలు సూపరింటెండెంట్ యశ్వంత్‌ భానుదాస్‌లకు పార్లమెంటరీ హక్కుల సంఘం సమన్లు జారీ చేసింది. జూన్‌ 15న కమిటీ ఎదుట హాజరు కావాలని ఆదేశించింది. 

9. యుద్ధ క్షేత్రంలో తెరుచుకున్న థియేటర్‌.. తొలిరోజే హౌస్‌ఫుల్‌

మూడు నెలలకుపైగా రష్యా కొనసాగిస్తోన్న భీకర యుద్ధంతో ఉక్రెయిన్‌ నగరాలు వణికిపోతూనే ఉన్నాయి. ఈ క్రమంలో పలు ప్రాంతాలు ఇప్పటికే రష్యా ఆధీనంలోకి వెళ్లిపోగా మరికొన్ని నగరాలు మాత్రం ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో మూడు నెలల తర్వాత ఓ థియేటర్‌ తిరిగి తెరుచుకుంది. అయితే, ప్రదర్శన మొదలుపెట్టిన తొలిరోజే మూడు ఆటలకు సంబంధించిన టికెట్లన్నీ అమ్ముడుపోవడం విశేషం.

10. ప్రియురాలిపై కోపం.. మ్యూజియంపై ప్రతాపం!

ప్రియురాలితో గొడవపడి బయటకు వచ్చిన యువకుడు.. కోపంతో ఓ మ్యూజియంపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో ఏకంగా 50 లక్షల డాలర్ల విలువైన కళాఖండాలు, ఇతర ఆస్తులను ధ్వంసం చేయడం గమనార్హం. అమెరికాలోని ‘డల్లాస్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్‌’లో ఈ ఘటన చోటుచేసుకుంది. 21 ఏళ్ల బ్రియాన్‌ హెర్నాండెజ్‌ గత బుధవారం రాత్రి మ్యూజియంలోకి చొరబడి.. ఈ మేర నష్టం కలిగించినట్లు డల్లాస్‌ పోలీసులు వెల్లడించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు