Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 12 Jun 2022 20:56 IST

1. రాష్ట్రపతి ఎన్నికలు.. రంగంలోకి నడ్డా, రాజ్‌నాథ్‌ సింగ్‌!

రాష్ట్రపతి ఎన్నికల్లో తమ బలం చాటుకునేందుకు పార్టీలు రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రతిపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసేందుకు తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత్రి మమతా బెనర్జీ నడుం బిగించారు. వివిధ పార్టీల నేతలకు లేఖలు రాశారు. ఈ క్రమంలో అధికార భాజపా సైతం కదన రంగంలోకి దూకుతోంది. అభ్యర్థి ఎంపికలో ఏకాభిప్రాయ సాధనే లక్ష్యంగా సంప్రదింపులు జరపనుంది. ఇందుకోసం ఆ పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సిద్ధమ్యారు.

Prez polls: రాష్ట్రపతి ఎన్నికల్లో EVMలు ఎందుకు వాడరు?

2. ఈనెల 27న టెట్‌ ఫలితాలు: కన్వీనర్‌

తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు సుమారు 90శాతం మంది అభ్యర్థులు హాజరైనట్టు కన్వీనర్‌ తెలిపారు.  ఉదయం నిర్వహించిన పేపర్‌-1కు 3,18,506 (90.62శాతం), పేపర్‌-2కు 2,51,070 (90.35శాతం) మంది అభ్యర్థులు హాజరయ్యారు. టెట్‌ ఫలితాలను ఈనెల 27న  విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ తెలిపారు.

‘అదిగో ఎర్రని కిరణం’.. ‘విరాటపర్వం’ విప్లవగీతం

3. ఎలెస్ట్‌ కంపెనీ భారీ పెట్టుబడి.. కేటీఆర్‌ సమక్షంలో అవగాహన ఒప్పందం

దేశ చరిత్రలో తొలిసారిగా డిస్‌ప్లే ఫ్యాబ్‌ రంగంలో తెలంగాణకు భారీ పెట్టుబడులు దక్కాయి. రాష్ట్రంలో రూ.24వేల కోట్లు డిస్‌ప్లే ఫ్యాబ్‌ కోసం పెట్టుబడిగా పెట్టనున్నట్టు ఎలెస్ట్‌ కంపెనీ ప్రకటించింది. ఈమేరకు అవగాహన ఒప్పందాన్ని తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకుంది.బెంగళూరు కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఎలెస్ట్‌ కంపెనీ ఈ పెట్టుబడితో తెలంగాణలో డిస్‌ప్లే  ఫ్యాబ్‌ను ఏర్పాటు చేయనుంది. 

4. జూబ్లీహిల్స్‌ గ్యాంగ్‌ రేప్‌... నిందితులకు స్టార్‌ హోటల్‌ బిర్యానీ

జూబ్లీహిల్స్‌లో మైనర్‌ బాలికపై అత్యాచారం కేసులో సీన్‌ రీకన్‌స్ట్రక్షన్‌ అనంతరం నిందితులను పోలీస్‌ స్టేషన్‌కు తీసుకొచ్చి విచారించారు. మధ్యాహ్న సమయంలో నిందితులకు వారి బంధువులు స్టార్‌ హోటల్‌ నుంచి బిర్యాని తీసుకొచ్చారు. కొన్ని ప్రత్యేక కేసుల్లో వీవీఐపీలకు మాత్రమే ప్రత్యేక భోజన ఏర్పాట్లకు అనుమతిస్తారు. అయితే,  అత్యాచారం కేసులో ఉన్న నిందితులకు ఇలాంటి మర్యాదలు చేయడమేంటని పలువురు విమర్శిస్తున్నారు.

5. అమెరికా జాగ్రత్త.. తైవాన్‌ కోసం తుదివరకూ పోరాడతాం..!

దక్షిణ చైనా సముద్రంలో పరిస్థితులు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయి. తమ దళాలు యద్ధానికి సిద్ధంగా ఉండేలా చైనా, తైవాన్‌లు శిక్షణలు ఇస్తున్నాయి. మరోపక్క చైనా-అమెరికాల మధ్య తైవాన్‌ అంశం మరోసారి అగ్గిరాజేయడంతో దౌత్య యుద్ధానికి తెరలేచింది. ఇప్పటికే శనివారం ఒక సారి చైనా విదేశాంగ మంత్రి వీఫెంగ్‌ అమెరికాను తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.  

6. తెలంగాణలో కొత్తగా 129 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో రోజు వారీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. గత వారం నుంచి రోజుకు 100కుపైగా నమోదవుతున్నాయి. ఇవాళ 13,254 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా... కొత్తగా 129 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 67 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1039 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ అధికారులు తెలిపారు.

7. కావలి ఎమ్మెల్యే కుమారుడి వివాహ రిసెప్షన్‌కు హాజరైన సీఎం జగన్‌

నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌ కుమార్‌రెడ్డి తనయుడి వివాహ రిసెప్షన్‌కు ఏపీ సీఎం జగన్‌ హాజరయ్యారు. కావలి మండలం గౌరవరం వద్ద రామిరెడ్డి సుబ్బరామిరెడ్డి ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్‌లో వరుడు బాలసాకేత్‌రెడ్డి, వధువు మహిమలను ముఖ్యమంత్రి ఆశీర్వదించారు. రాష్ట్ర మంత్రులు అంబటి, కారుమూరి, కాకాణి, చెల్లుబోయినతో పాటు పలువురు వైకాపా నేతలు హాజరయ్యారు.

8. రాణించిన శ్రేయస్‌, ఇషాన్‌.. సౌతాఫ్రికా లక్ష్యం ఎంతంటే?

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20లో భారత్‌ బ్యాటింగ్‌ ముగిసింది. శ్రేయస్‌ అయ్యర్ (40; 35 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), ఇషాన్‌ కిషన్‌ (34; 21 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 148 పరుగులు చేసింది. ఓపెనర్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (1) మరోసారి నిరాశపర్చాడు. గత మ్యాచ్‌లో మెరిసిన రిషభ్‌ పంత్‌ (5), హార్దిక్‌ పాండ్య (9) విఫలమయ్యారు. 

9. ఐఐటీల్లో బీఈడీ కోర్సు.. త్వరలోనే కేంద్ర విద్యాశాఖ అనుమతి..!

దేశంలో ప్రస్తుతమున్న బీఈడీ కాలేజీల్లో ఎక్కువశాతం ఆశించిన స్థాయిలో శిక్షణ ఇవ్వలేకపోతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో దేశంలో నాణ్యమైన ఉపాధ్యాయ శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్న ఆయన.. దేశంలోని ప్రముఖ విద్యాసంస్థలైన ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ)ల్లో బీఈడీ శిక్షణను ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెడతామన్నారు.

10. ప్రధాని మోదీ ఇకనైనా మౌనం వీడాలి: శశిథరూర్‌

భాజపా మాజీ ప్రతినిధులు చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్రమోదీ మౌనం వీడాలని కాంగ్రెస్‌ నేత శశిథరూర్‌ అన్నారు. తన మౌనం ద్వారా వారిని వెనకేసుకొస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయన్నారు. ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శశిథరూర్‌ మాట్లాడారు. ఇస్లామిక్‌ దేశాలతో స్నేహ బంధాన్ని కాపాడడానికి ఇకనైనా మోదీ మౌనం వీడాలన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని