Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 21 Jun 2022 20:57 IST

1. తెలంగాణలో భారీగా పెరిగిన కరోనా కేసులు

తెలంగాణ  కరోనా కేసులు భారీగా పెరిగాయి. రాష్ట్రంలో ఈరోజు 26,704 మంది నమూనాలు పరీక్షించగా... కొత్తగా 403 కొవిడ్‌ కేసులు నమోదయ్యాయి. కొవిడ్‌ బారి నుంచి ఇవాళ 145 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం యాక్టివ్‌ కేసుల సంఖ్య 2,375కి చేరిందని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. గత వారంతో పోలిస్తే ఇవాళ రెట్టింపు కేసులు నమోదయ్యాయని వెల్లడించింది.

మాజీ మంత్రి దగ్గుబాటికి అస్వస్థత... పరామర్శించిన చంద్రబాబు

2. ఐదు రోజులు.. 50గంటల పాటు రాహుల్‌పై ఈడీ ప్రశ్నల వర్షం!

నేషనల్‌ హెరాల్డ్‌ మనీలాండరింగ్‌ కేసులో విచారణ ఎదుర్కొంటున్న కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi)ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) ఐదోరోజు విచారిస్తోంది. మంగళవారం ఉదయం నుంచి దాదాపు 10 గంటల పాటు విచారణ ఎదుర్కొన్న రాహుల్‌ గాంధీ.. సాయంత్రం 8గంటలకు ఈడీ కార్యాలయం నుంచి బయటకు వచ్చారు. అయితే, ఈరోజు విచారణ ముగిసిందని భావించినప్పటికీ.. అరగంట విరామం తర్వాత మళ్లీ విచారణ కొనసాగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 

3. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాల కుట్రలు: సీఎం జగన్‌

ఆంధ్రప్రదేశ్‌లో చురుగ్గా రోడ్ల మరమ్మతులు జరుగుతున్నాయని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ అన్నారు. నాడు-నేడు ద్వారా చేపట్టే పనుల్లో పురోగతి కనిపిస్తోందని వెల్లడించారు. రాష్ట్ర వ్యా్ప్తంగా రోడ్ల నిర్మాణం, మరమ్మతు పనులపై సంబంధిత అధికారులతో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. అసంపూర్తిగా ఉన్న రోడ్లు, వంతెనలు, ఆర్‌వోబీలను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

4. ‘అధికారం కోసం ఎన్నటికీ మోసం చేయను’.. చర్చనీయాంశంగా షిండే ట్వీట్‌

మహారాష్ట్ర మంత్రి ఏక్‌నాథ్ షిండే, ఆయన అనుచరగణం అజ్ఞాతంలోకి వెళ్లడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ క్రమంలో షిండే ట్విటర్ వేదిక చేసిన ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. ‘మేం బాలాసాహెబ్‌కు చెందిన బలమైన సైనికులం. ఆయన మాకు హిందుత్వను నేర్పించారు. బాలాసాహేబ్, ఆనంద్ దిఘే బోధనలను పాటిస్తోన్న మేం అధికారం కోసం ఎన్నటికీ మోసానికి పాల్పడం’ అంటూ షిండే ట్వీట్ చేశారు.

5. చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఛైర్మన్‌గా అనిల్‌ కుర్మాచలం

తెలంగాణలో మరో రెండు కార్పొరేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం ఛైర్మన్లను నియమించింది. రాష్ట్ర పునరుత్పాదక ఇంధన అభివృద్ధి సంస్ధ (రెడ్కో) ఛైర్మన్‌గా వై.సతీశ్‌ రెడ్డిని నియమించారు. రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్‌, థియేటర్‌ అభివృద్ధి సంస్థ (ఎఫ్‌డీసీ) ఛైర్మన్‌గా అనిల్ కుమార్‌ కుర్మాచలానికి బాధ్యతలు అప్పగించింది. ఈ మేరకు రెండు కార్పొరేషన్లకు ఛైర్మన్ల నియామకానికి సీఎం కేసీఆర్‌ ఆమోద ముద్ర వేశారు. 

6. సినీ కార్మికులు మళ్లీ అదేతప్పు చేస్తున్నారు.. సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్‌ఛాంబర్‌

సినీ కార్మికుల సమ్మె ప్రకటనపై తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు కొల్లు రామకృష్ణ స్పందించారు. పరిశ్రమలో సమ్మె చేయాలంటే నిబంధనల ప్రకారం 15 రోజుల ముందు ఫిల్మ్‌ఛాంబర్‌కు నోటీసు ఇవ్వాలన్నారు. అలాంటి నోటిసు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఇప్పటి వరకు రాలేదని స్పష్టం చేశారు. నిర్మాతలు బుధవారం సజావుగా షూటింగ్‌లు నిర్వహించుకోవచ్చని సూచించారు

7. పారిశ్రామిక రంగానికి అగ్నిపథ్‌ ఓ సువర్ణావకాశం: బి.కె.గోయెంకా

సైన్యంలో నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకం పారిశ్రామిక రంగానికి ఓ సువర్ణావకాశమని వెల్‌స్పన్‌ కంపెనీ ఛైర్మన్‌ బీకే గోయెంకా అన్నారు. నైపుణ్యం, క్రమశిక్షణ, ప్రతిభ కలిగిన అభ్యర్థులను నియమించుకునేందుకు పరిశ్రమలకు అగ్నివీరులు ఓ గొప్ప అవకాశం అని వ్యాఖ్యానించారు. తమ గ్రూపు సంస్థల నియామకాల్లో అగ్నివీరులకు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించారు.

8. అత్యాచారాలతో వణుకుతోన్న పాకిస్థాన్‌.. ఎమర్జెన్సీ విధింపునకు సిద్ధం

మహిళలపై అఘాయిత్యాలతో పాకిస్థాన్‌లోని పలు ప్రాంతాలు వణికిపోతున్నాయి. ముఖ్యంగా పంజాబ్‌ ప్రావిన్సులో మహిళలు, చిన్నారులపై లైంగిక దాడులు నిత్యకృత్యమయ్యాయి. ప్రతిరోజూ అక్కడ నాలుగైదు అత్యాచార కేసులు నమోదవుతున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇలా మహిళలపై జరుగుతోన్న దాడులను నియంత్రించేందుకు ఉపక్రమించిన ప్రావిన్సు అధికారులు.. ఆ ప్రాంతంలో ఎమర్జెన్సీ విధించాలని నిర్ణయించారు.

9. మాల్దీవుల్లో యోగా.. అడ్డుకున్న ఆందోళనకారులు.. అధ్యక్షుడు సీరియస్..!

మాల్దీవుల్లో నిర్వహించిన యోగా కార్యక్రమాన్ని కొందరు అడ్డుకున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాజధాని మాలేలోని జాతీయ ఫుట్‌బాల్‌ స్టేడియం గలోల్హులో ఔత్సాహికులు సహా ప్రముఖులు యోగా చేస్తుండగా.. అనేకమంది స్టేడియంలోకి దూసుకొచ్చారు. కొందరు జెండాలు పట్టుకొని, నినాదాలు చేస్తూ స్టేడియంలోకి చొరబడి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు. వారి చర్యలతో ఔత్సాహికులను భయభ్రాంతులకు గురయ్యారు.

10. బంగ్లాదేశ్‌లో భారీగా వరదలు.. లక్షలమంది నిరాశ్రయం

బంగ్లాదేశ్‌లోని సిల్హెట్‌, సుమన్‌ గంజ్‌ ప్రాంతాల్లో గత 122 ఏళ్లలో ఎన్నడూ లేనంత స్థాయిలో వరదలు వచ్చాయి. ఈ వరదల్లో ఇప్పటి వరకు 32 మంది ప్రాణాలు కోల్పోగా.. 90 లక్షల మంది ఇళ్లల్లోకి నీరు చేరింది. సహయక చర్యలు చేపట్డానికి బంగ్లాదేశ్‌ ఆర్మీ రంగంలోకి దిగింది. గత వారం బంగ్లాదేశ్‌, భారత్‌లోని ఈశాన్య రాష్ట్రాల్లో భారీగా వర్షపాతం నమోదైంది. ఫలితంగా ఇరువైపులా భారీగా వరదలు వచ్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని