Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 27 Jun 2022 20:56 IST

1. అగ్నిపథ్‌కు విశేష స్పందన.. 4 రోజుల్లో 94వేల మంది దరఖాస్తు

త్రివిధ దళాల్లో చేరాలనుకునేవారి కోసం కేంద్రం ఇటీవల తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ పథకంపై ఓవైపు విమర్శలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. నియామక ప్రక్రియకు విశేష స్పందన లభిస్తోంది. ఈ పథకం కింద వాయుసేనలో నియామక ప్రక్రియ ప్రారంభం కాగా.. కేవలం నాలుగు రోజుల్లోనే 94వేల మందికి పైగా దరఖాస్తు చేసుకోవడం విశేషం. ఈ మేరకు రక్షణశాఖ అధికార ప్రతినిధి భరత్‌ భూషణ్‌ బాబు ట్విటర్‌లో వెల్లడించారు.

2. ఈ ఏడాది ఖైరతాబాద్‌ మహా గణపతి రూపమిదే!

ఖైరతాబాద్‌ మహా గణపతి ఈ ఏడాది మట్టి ప్రతిమగా రూపుదిద్దుకోనున్నాడు. పంచముఖ మహా లక్ష్మీగణపతిగా ఖైరతాబాద్‌ వినాయకుడు భక్తులకు దర్శనం ఇవ్వనున్నాడు. ఇందుకు సంబంధించిన నమూనా ఫొటోను ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ విడుదల చేసింది. ఇందులో విగ్రహానికి కుడివైపు షణ్ముఖ సుబ్రహ్మణ్య స్వామి, ఎడమవైపు త్రిశక్తి మహా సరస్వతి దేవి విగ్రహాలు ఉన్నాయి. మొత్తం 50 అడుగుల ఎత్తుతో మట్టి ప్రతిమను ఏర్పాటు చేయనున్నారు.

3. ‘అమ్మఒడి’లో మరో కుదింపు.. ల్యాప్‌టాప్‌లు ఇచ్చే విధానానికి స్వస్తి!

‘అమ్మఒడి’ పథకంలో ఏపీ సర్కార్‌ మరో కోత విధించింది! అమ్మఒడిలో నగదుకు బదులుగా ల్యాప్‌టాప్‌ ఇచ్చే విధానానికి ప్రభుత్వం స్వస్తి పలికింది. ఈ ఏడాది నుంచి 8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇవ్వాలని నిర్ణయించింది. బైజూస్‌తో ఒప్పందంలో భాగంగా ట్యాబ్‌లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ల్యాప్‌టాప్‌ ధర రూ.26వేలు కావడంతో ప్రభుత్వం వాటి కొనుగోలు ఆలోచన విరమించుకున్నట్టు సమాచారం.

4. ఎన్టీఆర్‌ విగ్రహానికి వైకాపా రంగులు.. బొమ్ములూరులో ఉద్రిక్తత!

కృష్ణా జిల్లా గుడివాడ మండలం బొమ్ములూరులో తెదేపా వ్యవస్థాపకుడు ఎన్టీఆర్‌ విగ్రహం దిమ్మెకు వైకాపా రంగులు వేయడం ఘర్షణకు దారితీసింది. మినీ మహానాడు జరిగే అంగులూరుకు కి.మీ దూరంలోనే ఈ ఘటన జరిగింది. తెదేపా ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ మంత్రి పిన్నమనేని వెంకటేశ్వరరావు ఘటనా స్థలానికి చేరుకొని నిరసన తెలిపారు.  తెదేపా కార్యకర్తలు వైకాపా రంగులపై పసుపు రంగు వేసి.. ఎన్టీఆర్‌ విగ్రహానికి పాలాభిషేం చేశారు.

5. ఉద్ధవ్‌ ఠాక్రే రెండుసార్లు రాజీనామా చేయాలనుకున్నారు.. కానీ..!

మహారాష్ట్రలో తీవ్ర రాజకీయ సంక్షోభం కొనసాగుతున్న వేళ శివసేన అధినేత, ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే రాజీనామా విషయమై కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటుతో సీఎం పదవికి ఆయన రెండుసార్లు రాజీనామా చేయడానికి సిద్ధపడ్డారని పార్టీ అధికార వర్గాలు తెలిపాయి. అయితే, ‘మహా’ కూటమిలోని ఓ సీనియర్‌ నేత చెప్పడంతోనే ఆయన వెనక్కి తగ్గినట్లు సమాచారం.

6. ప్రశ్నిస్తే.. రైతులపై కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారు: రేవంత్‌

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. రైతులు గిట్టుబాటు ధర ఇవ్వలేదని నిలదీస్తే కేసులు పెట్టి బేడీలు వేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు అన్యాయం జరిగితే తిరగబడ్డ ప్రాంతం ఖమ్మమని.. మిర్చిపంట నష్టపోతే కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వలేదన్నారు. వరంగల్‌ డిక్లరేషన్‌ ద్వారా రైతులకు ఏకకాలంలో రూ.2లక్షలు మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. 

7. జర్మనీలో అపూర్వ స్వాగతం.. ముగ్ధుడైన ప్రధాని..!

జీ7 సదస్సులో పాల్గొనేందుకు ఆదివారం జర్మనీకి వెళ్లిన ప్రధాని మోదీకి అపూర్వ స్వాగతం లభించింది. మ్యూనిక్‌ విమానాశ్రయంలో బవేరియా రాష్ట్ర ప్రభుత్వం ఆయన్ను ఘనంగా ఆహ్వానించింది. ప్రత్యేక బవేరియన్ బ్యాండ్‌తో సాదర ఆహ్వానం పలికింది. ఆ రాష్ట్రం, ప్రవాస భారతీయులు చూపిన అభిమానానికి ముగ్ధుడైన ప్రధాని.. దానికి సంబంధించిన వీడియోను ట్విటర్‌లో షేర్ చేశారు. 

8. అగ్నివీరుల రిటైర్మెంట్‌ వయస్సు 65 ఏళ్లకు పెంచండి: దీదీ

‘అగ్నిపథ్‌’ పథకం కింద నియామకమయ్యే సైనికుల సర్వీసు నాలుగేళ్లయితే ఆ తర్వాత వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతుందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆందోళన వ్యక్తంచేశారు. ఆ సైనికుల రిటైర్మెంట్‌ వయస్సును 65ఏళ్లకు పెంచాలని ఆమె కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 2024 లోక్‌సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొనే భాజపా సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త రిక్రూట్‌మెంట్‌ స్కీమ్‌ను తీసుకొచ్చిందని దీదీ ఆరోపించారు.

9. శ్రీలంకలో ఇంధనానికి టోకెన్లు.. స్కూళ్లు, ఆఫీసులు మూసివేత!

ఆర్థిక, ఆహార, ఇంధన సంక్షోభాలతో శ్రీలంక పరిస్థితి రోజురోజుకీ దిగజారిపోతుంది. 2.20 కోట్ల జనాభా ఉన్న ద్వీపదేశం గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని ఆర్థికసంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ముఖ్యంగా ఇంధన కొరత దేశాన్ని తీవ్రంగా వేధిస్తోంది. దీంతో అక్కడ ముఖ్యమైన కార్యకలాపాలన్నీ స్తంభించిపోయాయి. బంకుల వద్ద ప్రజలు రోజులకొద్దీ వేచి ఉండాల్సిన పరిస్థితి కొనసాగుతోంది. 

10. సొంత పార్టీ నేతలే నాపై కుట్ర చేస్తున్నారు: మాజీ మంత్రి బాలినేని ఆవేదన

విపక్షాలు సహా సొంత పార్టీ నేతలే తనపై కుట్ర చేస్తున్నారని మాజీ మంత్రి, వైకాపా ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధంలేని విషయాలను తనకు అంటగడుతున్నారని మండిపడ్డారు. గతంలో చెన్నైలో పట్టుబడిన బంగారు వ్యాపారి డబ్బు తనదని ప్రచారం చేసి, హవాలా మంత్రి అని అవమానించారన్నారు. ఇటీవల కొత్తపట్నం మండలం అల్లూరు మహిళ గొడవలోకి తనను లాగుతున్నారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని