Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 29 Jun 2022 21:01 IST

1. ప్రముఖుల రాక .. సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌

ప్రధాని సహా కేంద్రమంత్రుల రాక సందర్భంగా సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో ఆంక్షలు, నిషేదాజ్ఞలు విధించారు. మాదాపూర్‌ హెచ్‌ఐసీసీ నోవాటెల్‌ చుట్టు పక్కల 5కిలోమీటర్ల పరిధిలో డ్రోన్లు, పారాగైడర్లు, మైక్రో లైట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల వంటివి ఎగరడాన్ని పూర్తిగా నిషేధిస్తున్నట్టు సైబరాబాద్‌ సీపీ స్టీఫెన్‌ రవీంద్ర వెల్లడించారు. జులై 1 నుంచి 4వరకు సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని, ఐదుగురు కంటే ఎక్కువ మంది గుమికూడరాదని చెప్పారు. 

2. ‘మహా’ ఉత్కంఠ వేళ.. ఉద్ధవ్‌ కేబినెట్‌ కీలక నిర్ణయాలు!

ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే అధ్యక్షతన మహారాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. ఎప్పట్నుంచో శివసేన డిమాండ్‌గా ఉన్న ఔరంగాబాద్‌ పేరును శంభాజీనగర్‌గా; ఉస్మానాబాద్‌ను ధరాశివ్‌గా మారుస్తూ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. నవీ ముంబయి విమానాశ్రయం పేరును డీబీ పాటిల్‌ అంతర్జాతీయ విమానాశ్రయంగా మార్చింది. 

3. ‘మీ ప్రభుత్వం మైనార్టీలో ఉంది’.. ఠాక్రేకు గవర్నర్ లేఖ

మహారాష్ట్రలో రాజకీయ అనిశ్చితి కీలక దశకు చేరుకున్నట్లు కనిపిస్తోంది. రేపు అధికార సంకీర్ణ కూటమి(MVA) మెజార్టీ నిరూపించుకోవాలని ఈ ఉదయం గవర్నర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని తెలియజేస్తూ.. గవర్నర్ బీఎస్‌ కోశ్యారీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాశారు. ప్రభుత్వం మైనార్టీలో ఉందని భాజపా, ఇతరుల నుంచి అనేక లేఖలు వచ్చాయని, దానికి అనుగుణంగానే నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.

4. ఎంపీ రఘురామ కృష్ణరాజు సీఐడీ విచారణకు హైకోర్టు అనుమతి

తనపై సీఐడీ నమోదు చేసిన కేసులను కొట్టివేయాలని కోరుతూ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. రాజద్రోహం సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్ల కింద రఘురామ కృష్ణరాజును విచారించుకోవచ్చని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. రెండు వర్గాల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టే విధంగా రఘురామ వ్యాఖ్యలు చేశారని సీఐడీ సుమోటోగా ఆయనపై కేసు నమోదు చేసింది.

5. 300 మంది ఉద్యోగుల్ని తొలగించిన వైట్‌హ్యాట్‌

ప్రముఖ ఎడ్‌టెక్‌ సంస్థ బైజూస్‌ నేతృత్వంలోని ఆన్‌లైన్‌ కోడింగ్‌ ప్రొవైడర్‌ వైట్‌హ్యాట్‌ జూనియర్‌ 300 మంది ఉద్యోగులను తొలగించింది. వర్క్‌ ఫ్రమ్‌ హోం నుంచి తిరిగి ఆఫీసులకు రావాలని కంపెనీ కోరడంతో ఇటీవలే 1000 మంది రాజీనామా చేశారు. తాజాగా మరో 300 మందిని కంపెనీయే బయటకు పంపింది. తొలగించిన ఉద్యోగుల్లో కోడింగ్‌ బోధించేవాళ్లు, సేల్స్‌ విభాగానికి చెందినవారు ఉన్నారు.

6. నటి స్వర భాస్కర్‌ను చంపుతామంటూ బెదిరింపు లేఖ

బాలీవుడ్‌ నటి స్వర భాస్కర్‌ను (Swara Bhaskar) చంపుతామంటూ బెదిరింపు లేఖ రావడం కలకలం సృష్టించింది. ముంబయిలోని వెర్సోవాలో నివాసముంటున్న స్వర భాస్కర్‌కు రెండు రోజుల క్రితం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు స్పీడ్‌ పోస్టు ద్వారా ఓ లేఖను పంపించారు. లేఖను అందుకున్న ఆమె వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించారు. తనకు ప్రాణాపాయం ఉందంటూ నటి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు వెర్సోవా పోలీసులు వెల్లడించారు.

7. గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌ ఇకనుంచి ‘కుటుంబ సర్వనాశన ట్యాక్స్‌’

హోటల్‌ వసతి, ప్రీ-ప్యాక్డ్‌ ఆహార పదార్థాలపై వస్తు సేవల పన్ను (GST) వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) మండిపడ్డారు. ఇప్పటివరకు ప్రధానమంత్రి ‘గబ్బర్‌ సింగ్‌ ట్యాక్స్‌’గా ఉన్న జీఎస్‌టీ ఇప్పుడు ‘గృహస్తీ సర్వనాశన్‌ ట్యాక్స్‌’ (కుటుంబాలను సర్వనాశనం చేసే టాక్స్‌)గా రూపుచెందబోతోందని ఆరోపించారు.

8. 63వేల PACSల కంప్యూటరీకరణకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయాలు (Union Cabinet Decisions) తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న 63వేల ప్రైమరీ అగ్రికల్చర్‌ క్రెడిట్‌ సొసైటీ(పీఏసీఎస్‌)ల కంప్యూటరీకరణకు ఆమోదముద్ర వేసింది. ఇందుకోసం బడ్జెట్‌లో రూ.2516 కోట్లు ఖర్చు చేయనున్నట్టు కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్‌ వెల్లడించారు. ఈ నిర్ణయం ద్వారా 13కోట్ల మంది రైతులకు, మరీ ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం కలగనుందన్నారు.

9. ఉప రాష్ట్రపతి ఎన్నికకు మోగిన నగారా

తదుపరి ఉపరాష్ట్రపతి ఎన్నికకు నగారా మోగింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యుల్‌ ఖరారు చేసింది. ఆగస్టు 6న (శనివారం) ఎన్నిక నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అదే రోజున ఓట్ల లెక్కింపు జరుగుతుందని తెలిపింది. జులై 17 నామినేషన్‌ దాఖలుకు చివరి తేదీగా పేర్కొంది. ప్రస్తుత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పదవీకాలం ఆగస్టు 10తో ముగియనుంది.

10. తెలంగాణలో ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు ఆగస్టు 1 నుంచి 10వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్మీడియట్‌ మొదటి ఏడాది, మధ్యాహ్నం 2.30గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించినట్లు పేర్కొంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని