Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీకోసం.. 

Published : 30 Jun 2022 20:55 IST

1. మహారాష్ట్ర సీఎంగా శిందే, డిప్యూటీ సీఎంగా ఫడణవీస్‌ ప్రమాణం

మహారాష్ట్రలో గత తొమ్మిది రోజులుగా కొనసాగిన తీవ్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. భాజపా, శివసేన తిరుగుబాటు వర్గం కలవడంతో సంకీర్ణ ప్రభుత్వం కొలువుదీరింది. మహారాష్ట్ర కొత్త ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్‌ శిందే, ఉపముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. వీరిద్దరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ రాజ్‌భవన్‌లో ప్రమాణం చేయించారు. 

2. భాజపాకు బిగ్‌ షాక్‌... తెరాసలో చేరిన కార్పొరేటర్లు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల వేళ హైదరాబాద్‌లో ఆ పార్టీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. జీహెచ్‌ఎంసీకి చెందిన నలుగురు భాజపా కార్పొరేటర్లు, తాండూరు మున్సిపల్‌ భాజపా ఫ్లోర్‌ లీడర్‌ గురువారం మంత్రి కేటీఆర్‌ సమక్షంలో తెరాసలో చేరారు. ప్రధాని మోదీ హైదరాబాద్‌కు వస్తున్న వేళ నలుగురు కార్పొరేటర్లు భాజపాను వీడటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. 

3. కేసీఆర్‌.. మోదీ పరిపాలనకు బేరీజు వేయండి: మంత్రి కేటీఆర్‌

ఎనిమిదేళ్ల కేసీఆర్‌ పాలన, మోదీ పరిపాలనకు బేరీజు వేయాలని తెలంగాణ మంత్రి కేటీఆర్‌ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... భాజపా నేతలపై విమర్శలు గుప్పించారు. తెలంగాణకు కేంద్రంలోని భాజపా ప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నించారు.  మేం చేసిన అభివృద్ధి పనులు వంద చెబుతాం... తెలంగాణలో కేంద్రం చేసిన మంచి పని ఒక్కటి చెప్పాలని సవాల్‌ విసిరారు. 

4. పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్‌ ప్రయోగం విజయవంతం

పీఎస్‌ఎల్వీ సీ53 మిషన్‌ ప్రయోగం విజయవంతమైంది. తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ (షార్‌) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్‌ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లింది. సింగపూర్‌, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశ పెట్టనుంది. డీఎస్‌-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్‌ ఇమేజింగ్‌ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్‌, మల్టీ-స్పెక్ట్రల్‌ పేలోడ్‌ను కలిగి ఉంది.

5. గన్నవరం వైకాపాలో 3 ముక్కలాట.. అభ్యర్థి ఎవరో తేల్చేసిన కొడాలి నాని

గన్నవరంలో జరిగిన వైకాపా ప్లీనరీలో మాజీమంత్రి కొడాలి నాని చేసిన వ్యాఖ్యలతో కలవరం మొదలైంది. ‘‘2024లో గన్నవరం నుంచి వైకాపా అభ్యర్థిగా వల్లభనేని వంశీ పోటీ చేస్తారు. నేతల మధ్య విభేదాలు ఉంటే పిలిచి మాట్లాడతానని సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి చెప్పారు. అందరూ కలిసి పనిచేయాలి’’ అని కొడాలి నాని ప్రకటించారు. దీంతో యార్లగడ్డ, దుట్టా వర్గీయుల్లో కలవరం మొదలైంది.

6. ఏపీలో రేపటి నుంచి ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపు?

ఆంధ్రప్రదేశ్‌లో ఆర్టీసీ బస్సు ఛార్జీల పెంపునకు రంగం సిద్ధమైంది. రేపటి నుంచి బస్సు ఛార్జీలు పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. డీజిల్‌ సెస్‌ పెంపు వల్ల ఛార్జీలు పెంచక తప్పలేదని అధికారులు చెబుతున్నారు. అయితే, డీజిల్‌ సెస్‌ పెంపు నుంచి సిటీ బస్సులకు మినహాయింపు ఇస్తున్నట్టు ఉన్నతాధికారులు వెల్లడించారు.

7. టీమ్‌ఇండియా కెప్టెన్‌గా బుమ్రా... తుదిజట్టు ప్రకటించిన ఇంగ్లాండ్‌

ఇంగ్లాండ్‌తో ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా శుక్రవారం ప్రారంభంకానున్న ఐదో టెస్టు కోసం టీమ్‌ ఇండియా కెప్టెన్‌ ఎవరనేది బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. వైస్‌ కెప్టెన్‌గా ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లిన జస్ప్రిత్‌ బుమ్రాను కెప్టెన్‌గా నియమించింది. రిషభ్‌ పంత్‌ వైస్‌ కెప్టెన్‌గా ఉండనున్నాడు. రోహిత్‌ శర్మ కరోనా బారినపడి, పూర్తి ఫిట్‌నెస్‌తో లేకపోవడంతో బుమ్రాను కెప్టెన్‌గా ఖరారు చేశారు.

8. దేశంలో స్తంభించిన ఎస్‌బీఐ సేవలు.. వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు!

దేశవ్యాప్తంగా ఎస్‌బీఐ సేవలకు (SBI down) అంతరాయం ఏర్పడింది. మధ్యాహ్నం నుంచి ఎస్‌బీఐ సేవలు పూర్తిగా స్తంభించాయి. దీంతో యూజర్లు సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదు చేస్తున్నారు. ఆన్‌లైన్‌ బ్యాంకింగ్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు తమ ఫిర్యాదుల్లో పేర్కొంటున్నారు. యూపీఐ విషయంలో సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెబుతున్నారు. 

9. దాయాది దేశం.. మరో శ్రీలంక కానుందా..?

టీ వినియోగాన్ని తగ్గించండని మంత్రి వ్యాఖ్యలు.. రాత్రి పది దాటిన తర్వాత వివాహ వేడుకలపై నిషేధం.. కాగితం కొరత.. విద్యుత్ టారిఫ్‌లను పెంచడం.. పెట్రోలియం ఉత్పత్తులపై పన్ను విధింపు.. ఇవన్నీ ప్రస్తుతం పాకిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులు. నిధుల కొరతతో సతమతమవుతోన్న దాయాది దేశం ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పన్నుల ద్వారా రాబడులు పెంచుకోవాలని చూస్తోంది.

10. ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ రద్దు.. నాలుగేళ్లలో ఐదోసారి ఎన్నికలు

భిన్న సిద్ధాంతాలు కలిగిన పార్టీలతో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినప్పటికీ దానిని విజయవంతంగా నడపడంలో మాత్రం ఇజ్రాయెల్‌ (Israel) ప్రభుత్వం విఫలమైంది. దీంతో పార్లమెంటును రద్దు చేసి కొత్తగా ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. దీనికి ఇజ్రాయెల్‌ పార్లమెంట్‌ ఆమోదం తెలపడంతోపాటు నవంబర్‌లో మరోసారి ఎన్నికలు జరపనున్నట్లు తెలిపింది. అయితే, గడిచిన నాలుగేళ్లలో ఇలా ఎన్నికలు జరపడం ఐదోసారి కావడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని