Updated : 01 Jul 2022 21:02 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. హైదరాబాద్‌ చుట్టుపక్కల 330 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్లు.. ప్రయోగాత్మకంగా ఇక్కడే

జంట నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య వేగంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా గ్రేటర్‌లో ఎలక్ట్రిక్ వాహనాల కోసం పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు (EV charging station:) ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ ముందుకొచ్చింది. గ్రేటర్ వ్యాప్తంగా మొత్తం 230 ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించింది. ఇటు హెచ్ఎండీఏ పరిధిలో మరో 100 ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల ఏర్పాటుకు సైతం ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి.

ఆమె నా జీవితాన్ని నాశనం చేసింది: నరేశ్‌.. ఒక్క రూపాయీ తీసుకోలేదన్న రమ్య

2. వాయుసేన అమ్ములపొదిలో మరో ఆయుధం సిద్ధం..!

మానవ రహిత యుద్ధ విమానాలపై పరిశోధనలు ప్రారంభించిన భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) తాజాగా అరుదైన ఘనత సాధించింది. స్వదేశీ పరిజ్ఞానమైన ఆటోనామస్‌ ఫ్లయింగ్‌ వింగ్‌ టెక్నాలజీ ఆధారంగా తొలి విమానాన్ని విజయవంతంగా పరీక్షించింది. కర్ణాటకలోని చిత్రదుర్గ్‌లో గల ఏరోనాటికల్‌ టెస్ట్‌ రేంజ్‌లో ఈ మానవరహిత విహంగాన్ని విజయవంతంగా పరీక్షించినట్లు డీఆర్‌డీఓ వెల్లడించింది. 

3. దిగుమతి సుంకం ఎఫెక్ట్‌.. ఒక్కరోజే రూ.1310 పెరిగిన బంగారం ధర

పసిడి ప్రియులకు షాకిస్తూ బంగారంపై దిగుమతి సుంకాన్ని పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. దీంతో బులియన్‌ మార్కెట్లో పుత్తడి ధర ఒక్కసారిగా పెరిగింది. దేశ రాజధాని దిల్లీలో శుక్రవారం 10 గ్రాముల మేలిమి బంగారం ధర రూ.1,310 పెరిగి రూ.52,200కి చేరింది. మరోవైపు వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గడం గమనార్హం. అటు వెండి ధర కూడా రూ.400 పెరిగి కేజీ ధర రూ.59,000 పలికింది.

4. ఆ లక్ష్యంతోనే ఇంధన ఎగుమతులపై పన్ను: సీతారామన్‌

పెట్రోల్‌ (petrol), డీజిల్‌ (diesel), విమాన ఇంధనం (ATF) ఎగుమతులపై పన్ను (Export Tax) విధింపు ప్రకటనపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitaraman) స్పందించారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా ప్రతి 15 రోజులకు ఒకసారి వీటిని సమీక్షిస్తామని తెలిపారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని.. చమురు ధరల ఊగిసలాటకు హద్దుల్లేకుండా పోయాయని వివరించారు. 

5. పార్టీని భాజపాలో విలీనం చేయనున్న అమరీందర్‌ సింగ్‌!

గతేడాది పంజాబ్‌ ముఖ్యమంత్రి పదవి కోల్పోవడంతో కొత్త పార్టీని ఏర్పాటు చేసిన కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌ (80) తన పార్టీని భాజపాలో విలీనం చేస్తున్నట్లు వార్తలు గుప్పుముంటున్నాయి. ప్రస్తుతం విదేశాల్లో ఉన్న అమరీందర్‌ తిరిగివచ్చిన వెంటనే తన పార్టీ ‘పంజాబ్‌ లోక్‌ కాంగ్రెస్‌’ (పీఎల్‌సీ)ని కాషాయ పార్టీలో విలీనం చేయనున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. 

6. జేపీ నడ్డా రోడ్‌ షో... భారీగా తరలివచ్చిన భాజపా కార్యకర్తలు

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌ చేరుకున్నారు. శంషాబాద్‌ నుంచి భారీ కాన్వాయ్‌తో జేపీ నడ్డా రోడ్‌షో నిర్వహించారు. ఓపెన్‌ టాప్‌ వాహనంలో నిర్వహిస్తున్న ర్యాలీకి భారీగా కార్యకర్తలు తరలివచ్చారు. దారి పొడవునా పార్టీ జాతీయ అధ్యక్షుడికి భాజపా శ్రేణులు ఘన స్వాగతం పలికారు. శ్రేణులకు అభివాదం చేస్తూ నడ్డా ముందుకు సాగారు.

7. కేసు నమోదు చేసిన వెంటనే రఘురామను అరెస్టు చేయొద్దు: హైకోర్టు

కేసుల నమోదులో పోలీసులు చట్టబద్ధ ప్రక్రియ అనుసరించాలని ఏపీ హైకోర్టు స్పష్టం చేసింది. ఈనెల 4న ప్రధాని మోదీ భీమవరం పర్యటనలో పాల్గొనేందుకు తనకు రక్షణ కల్పించాలని నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు వేసిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. పోలీసులు ఏదో ఒక కేసు పెట్టి ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని రఘురామ తరఫున న్యాయవాది ఉమేశ్‌చంద్ర కోర్టుకు తెలిపారు. 

8. మరోసారి కోహ్లీ విఫలం.. కష్టాల్లో టీమ్‌ ఇండియా

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న కీలక టెస్టులో విరాట్‌ కోహ్లీ మరోసారి విఫలమయ్యాడు. భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో వర్షం కారణంగా అంపెర్లు భోజన విరామం కాస్త ముందుగానే ప్రకటించారు. అప్పటికి భారత్‌ స్కోరు 53/2. తిరిగి వాతావరణ అనుకూలిచండంతో ఆట ప్రారంభం అయ్యింది. 11 పరుగులతో టచ్‌లోకి వచ్చినట్లు కనిపించినా.. యువ పేసర్‌ మాథ్యూ పాట్స్‌ తెలివైన బంతికి కోహ్లీ పెవిలియన్‌కి చేరాడు. 

9. సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌పై నిషేధం.. ఉల్లంఘిస్తే రూ.లక్ష జరిమానా

ఒకసారి వాడి పారేసే ప్లాస్టిక్‌ వస్తువులపై నేటి నుంచి దేశవ్యాప్తంగా నిషేధం అమల్లోకి వచ్చింది. ఈ సందర్భంగా దిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిషేధాన్ని ఉల్లంఘించిన వారికి రూ.లక్ష వరకు జరిమానా లేదా ఐదేళ్ల జైలు శిక్ష విధించనున్నట్లు దిల్లీ పర్యావరణ మంత్రి గోపాల్‌ రాయ్‌ శుక్రవారం వెల్లడించారు.

10. వెనక్కితగ్గని రష్యా.. అపార్ట్‌మెంట్‌పై క్షిపణి దాడి.. 18 మంది మృతి

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నల్ల సముద్రంలోని స్నేక్‌ ఐలాండ్‌కు సమీపంలో ఉన్న ఒడెసా ఓడరేవులోని అపార్ట్‌మెంట్‌పై క్షిపణితో దాడి చేసింది. ఈ ఘటనలో దాదాపు 18 మంది మృతి చెందారని ఉక్రెయిన్‌ అధికారులు ధ్రువీకరించారు. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని దాడిలో చెలరేగిన మంటలను అదుపు చేశారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికితీసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని