Published : 04 Jul 2022 20:55 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. నేవీలో అగ్నిపథ్‌ నియామకాలు.. 10వేల మంది మహిళల దరఖాస్తు

త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ నియామకాలకు విశేష ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే ఈ పథకం కింద వాయుసేనలో రిజిస్ట్రేషన్లు ప్రారంభమవ్వగా.. దాదాపు 3లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జులై 1 నుంచి నేవీ, ఆర్మీల్లోనూ ఈ పథకం కింద నియామక ప్రక్రియ మొదలైంది. కాగా.. అగ్నిపథ్‌లో భాగంగా నావికాదళంలో చేరేందుకు దాదాపు 10వేల మంది మహిళలు దరఖాస్తులు చేసుకున్నట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి.

సర్వీసు ఛార్జీ వసూలు చేయొద్దు.. హోటల్స్‌, రెస్టారెంట్లకు కీలక ఆదేశాలు!

2. ఆపరేషన్‌ ఆకర్ష్‌.. భాజపాలో ఈటలకు కొత్త బాధ్యతలు!

ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేయాలని కమలనాథులు నిర్ణయించారు. ఈ బాధ్యతలను ముఖ్యమైన నేతలకు అప్పగించాలని పార్టీ అధిష్ఠానం భావిస్తోంది. ప్రస్తుతం పార్టీ చేరికల కమిటీ ఛైర్మన్‌గా ఇంద్రసేనా రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆ బాధ్యతల నుంచి తనను తప్పించాలని ఆయన ఇప్పటికే కోరినట్లు సమాచారం. ఆ స్థానంలో చేరికల కమిటీ బాధ్యతలను ఈటల రాజేందర్‌కు, కో-ఛైర్మన్‌గా వివేక్ వెంకటస్వామికి అప్పగించాలనే యోచనలో భాజపా నేతలు ఉన్నట్లు సమాచారం.

3. విద్యార్థులకు త్వరలో ఉపకార వేతనాలు.. వెంటనే అందించాలని మంత్రి ఆదేశం

తెలంగాణలో విద్యార్థులకు ఉపకార వేతనాలను వెంటనే విడుదల చేయాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. మార్చి నెలాఖరు వరకు ఇవ్వాల్సిన ₹362.88 కోట్లను విడుదల చేయాలని స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈబీసీ, దివ్యాంగులు, మైనార్టీ విద్యార్థులకు ఉపకార వేతనాల విడుదలపై మంత్రి ఇవాళ సమీక్ష చేపట్టారు. ఆరు శాఖలకు సంబంధించిన ₹362.88 కోట్ల ఉపకార వేతనాలు వెంటనే విడుదల చేయాలని పేర్కొన్నారు.

4. వారంలోగా 60వేల ఇళ్ల పంపిణీకి కార్యాచరణ.. అధికారులకు కేటీఆర్‌ ఆదేశాలు

జీహెచ్ఎంసీ నిర్మిస్తున్న డబుల్‌ బెడ్‌ రూమ్ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తవుతున్న నేపథ్యంలో.. వాటిని లబ్ధిదారులకు అందించే ప్రక్రియను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే నగరంలో లక్ష ఇళ్ల నిర్మాణాలు వేగంగా కొనసాగుతున్నాయన్న అధికారులు.. ఇందులో 60 వేల ఇళ్లు పూర్తయ్యాయని తెలిపారు. పూర్తయిన ఇళ్ల పంపిణీకి సంబంధించి అవసరమైన మార్గదర్శకాలను వారంలోగా సిద్ధం చేయాలని కేటీఆర్ స్పష్టం చేశారు.

5. కాంగ్రెస్‌ గూటికి తెరాస మేయర్‌.. రాహుల్‌ సమక్షంలో చేరిక

హైదరాబాద్‌ను కీలక నగరంగా కాంగ్రెస్‌ పార్టీ తీర్చిదిద్దిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరం చేస్తామంటున్న తెరాస నేతలు.. కనీసం రోడ్లపై పడ్డ గుంతలు పూడ్చటం లేదని మండిపడ్డారు. బడంగ్‌పేట్‌ మేయర్ పారిజాత, పలువురు తెరాస నేతలు రేవంత్‌ రెడ్డి నేతృత్వంలో దిల్లీలో రాహుల్‌గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. అనంతరం రేవంత్‌ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

6. ఉద్ధవ్‌ వైపే ఉంటానని కన్నీరు పెట్టుకొని.. శిందేకు ఓటేశారు!

ఏక్‌నాథ్‌ శిందే అసెంబ్లీలో విశ్వాస పరీక్షలో నెగ్గి తన బలాన్ని నిరూపించుకున్నారు. విశ్వాస పరీక్షకు కొద్ది సేపటికే మరో శివసేన ఎమ్మెల్యే ఒకరు తన రూటు మార్చుకొని ఏక్‌నాథ్‌ శిందేకు అనుకూలంగా ఓటు వేశారు. అయితే, రెబల్‌ ఎమ్మెల్యేల తిరుగుబాటు సమయంలో ఆయన ఉద్ధవ్‌ ఠాక్రేకు మద్దతుగా నిలవాలని కోరుతూ కన్నీటి పర్యంతమవ్వడం గమనార్హం.

Devendra Fadnavis: అవును.. మాది ‘ఈడీ’ ప్రభుత్వమే..!

7. తప్పెవరిదో వాళ్లే చెప్తారు.. ప్రజా కోర్టులో తేల్చుకుందాం రండి: ఉద్ధవ్‌ సవాల్‌

తమ పార్టీని అంతం చేసేందుకు భాజపా కుట్రలు పన్నుతోందని శివసేన అధ్యక్షుడు, మాజీ సీఎం ఉద్ధవ్‌ ఠాక్రే  ఆరోపించారు. ధైర్యం ఉంటే మధ్యంతర ఎన్నికలు జరపాలని సవాల్‌ విసిరారు. ముంబయిలోని శివసేన భవన్‌లో నిర్వహించిన పార్టీ జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఠాక్రే కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీని ఏకపక్షంగా నిర్వహించడం రాజ్యాంగాన్ని అవమానించడమేనన్నారు.

8. టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌ 245 ఆలౌట్‌.. 

టీమ్‌ఇండియా రెండో ఇన్నింగ్స్‌లో 245 పరుగులకు ఆలౌటైంది. దీంతో ఇంగ్లాండ్‌ ముందు మొత్తం 378 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. బెన్‌స్టోక్స్‌ వేసిన 82వ ఓవర్‌లో బుమ్రా(7) నాలుగో బంతికి భారీ సిక్సర్‌ కొట్టాడు. అయితే, ఐదో బంతిని కూడా స్టాండ్స్‌లోకి తరలించాలని చూసి గాల్లోకి షాట్‌ ఆడాడు. కానీ, క్రాలే పరుగెత్తుకుంటూ వెళ్లి క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో టీమ్‌ఇండియా ఇన్నింగ్స్‌కు తెరపడింది.

9. మార్కెట్లోకి సుజుకీ స్పోర్ట్స్‌ బైక్‌.. ధర ₹13.61 లక్షలు

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సుజుకీ ఇండియా కొత్త స్పోర్ట్స్‌ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. గ్లోబల్‌ మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ‘కటానా’ను భారత్‌కు తీసుకొచ్చింది. జపాన్‌కు చెందిన పురాతన కత్తిని స్ఫూర్తిగా తీసుకుని ఈ బైక్‌కు కటానా అని పేరు పెట్టారు. దీని ధరను కంపెనీ రూ.13.61 లక్షలు (ఎక్స్‌షోరూం)గా నిర్ణయించింది. ఇందులో 999 సీసీ లిక్విడ్‌ కూల్డ్‌ డీఓహెచ్‌సీ ఇన్‌లైన్‌ ఫోర్‌ సిలిండర్‌ ఇంజిన్‌ను అమర్చారు.

10. సీబీఎస్‌ఈ ‘పది’ ఫలితాలు ఇప్పుడే కాదు..!

సీబీఎస్‌ఈ టర్మ్‌-2 పదో తరగతి ఫలితాలు ఇవాళ విడుదల చేయడం లేదని అధికారిక వర్గాలు స్పష్టంచేశాయి. సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి ఫలితాలు విడుదల చేసే తేదీని బోర్డు ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. కొన్ని సామాజిక మాధ్యమాల్లో మాత్రం జులై 4న ఫలితాలు అంటూ ప్రచారం జరిగింది. దీంతో సోమవారం ఫలితాలు ప్రకటించడంలేదని సీబీఎస్‌ఈ కంట్రోలర్‌ కార్యాలయ అధికారులు చెప్పినట్టు ప్రముఖ జాతీయ మీడియా సంస్థలు పేర్కొన్నాయి.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని