Updated : 05 Jul 2022 21:02 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. కేంద్రంపై ట్విటర్‌ ‘న్యాయ’ పోరాటం..?

నూతన ఐటీ చట్టాల (IT Rules) విషయంలో ప్రముఖ మైక్రోబ్లాగింగ్‌ సైట్‌ ట్విటర్‌ (Twitter), కేంద్రం మధ్య ఏడాదిగా నెలకొన్న విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఐటీ నిబంధనలను ట్విటర్‌ అమలు చేయాల్సిందేనంటూ ఇటీవల కేంద్రం ‘చివరి’ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో తప్పనిసరై ట్విటర్‌ వాటిని అమల్లోకి తెచ్చింది. అయితే ఈ వ్యవహారంపై తాజాగా ట్విటర్‌ కేంద్రంపై న్యాయ పోరాటానికి సిద్ధమవుతోన్నట్లు తెలుస్తోంది

2. తాజ్‌మహల్‌ నిర్మించకపోతే లీటరు పెట్రోల్‌ రూ.40కే వచ్చేది: ఒవైసీ

ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ  ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. షాజహాన్‌ తాజ్‌మహల్‌ నిర్మించకపోతే.. దేశంలో ఇప్పుడు పెట్రోలు లీటరు రూ.40కే వచ్చేదంటూ కేంద్రంలోని భాజపా ప్రభుత్వాన్ని, ప్రధాని నరేంద్ర మోదీని విమర్శిస్తూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఓ బహిరంగ సభలో ఒవైసీ మాట్లాడుతూ.. దేశంలోని అన్ని సమస్యలకు మోదీ ప్రభుత్వం మైనారిటీలను, మొఘలులను కారకులుగా చూపిస్తోందని మండిపడ్డారు.

3. అగ్నివీరుల కోసం విశాఖలో ఎంపికలు!

ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల అభ్యర్థులతో సహా యానాం వారి కోసం ఆర్మీ అగ్నివీర్‌ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ విశాఖలో ఏర్పాటు చేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణా, పార్వతీపురం మన్యం, అల్లూరి జిల్లా, అనకాపల్లి, కోనసీమ, ఏలూరు, కాకినాడ, ఎన్టీఆర్‌ జిల్లాల అభ్యర్థులకు విశాఖలో ఎంపికలు నిర్వహిస్తున్నట్టు రక్షణ శాఖ తెలిపింది. 

4. ఏపీలో 2018 గ్రూప్- 1 తుది ఫలితాలు విడుదల

ఆంధ్రప్రదేశ్‌లో 2018 గ్రూప్‌-1 ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్వ్యూల్లో ఎంపికైన అభ్యర్థుల వివరాలను ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ విజయవాడలో వెల్లడించారు. ఫలితాలను ఏపీపీఎస్సీ వెబ్‌సైట్‌లో పొందుపర్చారు. 2018లో 167 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నియమాక ప్రక్రియ చేపట్టింది. గ్రూప్‌-1 ఉద్యోగాలకు ఎంపికైన వారిలో 67 మంది మహిళలు, 96 మంది పురుషులు ఉన్నారు.

5. ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదు

ఆంధ్రప్రదేశ్‌లోని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుపై హైదరాబాద్‌లో కేసు నమోదైంది. ఇంటెలిజెన్స్‌ కానిస్టేబుల్‌ సుభాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేశారు. రఘురామకృష్ణరాజుతో పాటు ఆయన కుమారుడు భరత్‌, సీర్పీఎఫ్‌ కానిస్టేబుల్‌ సందీప్‌, సీఆర్పీఎఫ్‌ ఏఎస్‌ఐ, రఘురామ పీఏ శాస్త్రిలను ఎఫ్ఐఆర్‌లో నిందితులుగా చేర్చారు.

6. టికెట్లపై అప్పుడే హామీ ఇవ్వట్లేదు: రేవంత్‌ రెడ్డి

ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి, భట్టి విక్రమార్క, మాణిక్యం ఠాగూర్‌ భేటీ అయ్యారు. రాష్ట్రంలో నేతల తీరు, తిరుగుబాటు ధోరణిపై చర్చించారు. పార్టీలో చేరుతున్న వారికి టికెట్లపై అప్పుడే హామీ ఇవ్వట్లేదని ఈ సందర్భంగా రేవంత్ చేశారు. పీజేఆర్‌ కుమారుడు కాంగ్రెస్‌ను వదిలే ప్రసక్తే లేదని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ను లేకుండా చేయాలని తెరాస, భాజపా యత్నిస్తున్నాయని రేవంత్‌ మండిపడ్డారు.

7. భాజపాలోకి హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి?

తెలంగాణ హైకోర్టు న్యాయవాది రచనా రెడ్డి త్వరలో కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. భాజపా రాష్ట్ర కార్యాలయంలో పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ను మంగళవారం ఆమె కలిశారు. దీంతో రచనా రెడ్డి భాజపాలో చేరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు ముంపు గ్రామాల రైతుల తరఫున హైకోర్టులో రచనా రెడ్డి కేసులు వేసి వాదించిన సంగతి తెలిసిందే. 

8. తెలంగాణలో 550 దాటిన కొత్త కేసులు

తెలంగాణలో కొవిడ్‌ మహమ్మారి విజృంభిస్తోంది. రాష్ట్రంలో ఇవాళ 25,913 మందికి కొవిడ్‌ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 552 కేసులు నమోదయ్యాయి. కరోనా బారి నుంచి ఇవాళ 496 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,753 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌ విడుదల చేసింది. హైదరాబాద్‌లో అత్యధికంగా 316 కేసులు నమోదయ్యాయి. 

9. ఒకే రోజు రెండు ఘటనలు.. మరో స్పైస్‌జెట్‌ విమానం దించివేత!

ప్రైవేటు రంగ ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్‌కు (Spice Jet) చెందిన మరో విమానంలో సమస్య తలెత్తింది. విండ్‌ షీల్డ్‌కు పగుళ్లు రావడంతో సదరు విమానానికి ముందుగా ప్రాధాన్యం ఇచ్చి ల్యాండ్‌ చేయాల్సి వచ్చింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది క్షేమమని ఎయిర్‌లైన్స్‌ ఓ ప్రకటనలో తెలిపింది. గుజరాత్‌లోని కాండ్ల నుంచి ముంబయికి బయల్దేరిన SG-3324 విమానం మధ్యాహ్నం 2.50 గంటలకు ముంబయి చేరుకోవాల్సి ఉంది. 

10. ‘రిఫరీ తప్పిదం’తో సింధూకు అన్యాయం.. క్షమాపణలు చెప్పిన కమిటీ

రిఫరీ పొరబాటు కారణంగా ఇటీవల బ్యాడ్మింటన్‌ ఆసియా ఛాంపియన్‌షిప్‌ టోర్నీలో భారత స్టార్ షట్లర్‌, ఒలింపిక్‌ విజేత పీవీ సింధూ ఓటమిపాలవ్వాల్సి వచ్చింది. ఈ ఘటనపై తాజాగా స్పందించిన బ్యాడ్మింటన్‌ ఆసియా టెక్నికల్‌ కమిటీ ఛైర్మన్‌ చిహ్‌ షెన్‌ చెన్‌.. ఆ ‘మానవ తప్పిదానికి’ సింధూకు క్షమాపణలు తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి పొరబాట్లు జరగకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సింధూకు కమిటీ ఛైర్మన్‌ లేఖ రాశారు.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని