Published : 06 Jul 2022 20:58 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. రాజ్యసభకు ఇళయరాజా, విజయేంద్రప్రసాద్‌.. మోదీ ప్రకటన

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రపతి కోటాలో నలుగురు దక్షిణాది ప్రముఖులను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ప్రముఖ దర్శకుడు రాజమౌళి తండ్రి, సినీ కథా రచయిత వి.విజయేంద్ర ప్రసాద్‌తో పాటు సంగీత దిగ్గజం ఇళయరాజా, పరుగుల రాణి పీటీ ఉషా, సామాజిక సేవకుడు వీరేంద్ర హెగ్డేలను రాజ్యసభకు నామినేట్‌ చేసింది. ఈ సందర్భంగా వారు అందించిన  సేవల్ని గుర్తు చేసుకుంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ట్వీట్‌ చేశారు.

2. బూస్టర్‌ డోసు వ్యవధి ఇక 6 నెలలే

బూస్టర్‌ డోసు వ్యవధిని 6 నెలలకు తగ్గించాలని నేషనల్‌ టెక్నికల్‌ అడ్వైజరీ గ్రూప్‌ ఆన్‌ ఇమ్యూనైజేషన్‌ (NTAGI) ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇప్పటివరకు ఈ వ్యవధి తొమ్మిది నెలలుగా ఉంది. దీంతో రెండో డోసు తీసుకున్న 6నెలలు పూర్తైన వారికి బూస్టర్‌ డోసును అందించనున్నారు. దేశవ్యాప్తంగా మరోసారి కొవిడ్‌ ఉద్ధృతి పెరుగుతోన్న దృష్ట్యా కొవిడ్‌ వర్కింగ్‌ గ్రూప్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

3. కేంద్ర మంత్రి నఖ్వీ రాజీనామా.. ఉపరాష్ట్రపతిగా పోటీ చేసే అవకాశం?

భాజపాలో కీలక మైనార్టీ నేత, కేంద్ర మైనార్టీ వ్యవహారాల శాఖ మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ తన పదవికి రాజీనామా చేశారు. ఆయనతో పాటు మరో మంత్రి ఆర్‌సీపీ సింగ్‌ కూడా పదవి నుంచి తప్పుకున్నారు. వీరిద్దరి రాజ్యసభ పదవీకాలం గురువారంతో ముగియనుంది. ఈ నేపథ్యంలోనే వారు మంత్రి పదవులు రాజీనామా చేశారు. అయితే నఖ్వీ రాజీనామాపై అనేక ఊహాగానాలను వ్యక్తమవుతున్నాయి.

4. అమ్మ ఒడి బూటకం.. ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకం: చంద్రబాబు

అమ్మఒడి ఒక బూటకం.. ఇంగ్లిష్‌ మీడియం ఒక నాటకమని తెదేపా అధినేత చంద్రబాబు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో 8 వేల పాఠశాలలు రద్దు చేస్తున్నారని ఆరోపించారు. పేద పిల్లలను చదువుకోకుండా చేయాలని కుట్ర చేస్తున్నారన్నారు. చిత్తూరు జిల్లా మదనపల్లెలో నిర్వహించిన తెదేపా మినీ మహానాడులో చంద్రబాబు మాట్లాడారు. ఏపీలో మూడేళ్లుగా అరాచక పాలన సాగుతోందని దుయ్యబట్టారు. 

5. కేసీఆర్‌.. నయా భూస్వాములను తయారు చేస్తున్నారు: రేవంత్‌రెడ్డి

సాయుధ తిరుగుబాట్లతో దొరల గడీల నుంచి విముక్తి పొందిన తెలంగాణలో సీఎం కేసీఆర్‌ మళ్లీ నయా భూస్వాములను తయారు చేస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆరోపించారు. పేదలు ఆత్మగౌరవంగా భావించే భూములను ప్రాజెక్టులు, రింగ్‌రోడ్డు, లేఅవుట్ల పేరుతో ప్రభుత్వమే కబ్జా చేస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో ధరణి సమస్యలను నిరసిస్తూ ఇందిరాపార్క్‌ వద్ద ధర్నాచౌక్‌లో కిసాన్‌ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ధరణి రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

6. నిమ్జ్‌ కోసం బలవంతపు భూసేకరణ.. రైతు బిడ్డ ఆవేదన

జహీరాబాద్‌ నిమ్జ్‌ కోసం అధికారుల బలవంతపు భూసేకరణను వ్యతిరేకిస్తూ బాధిత రైతు కుమార్తె ఆవేదనతో విడుదల చేసిన వీడియో సందేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. సంగారెడ్డి జిల్లా న్యాల్‌కల్‌ మండలం మామిడిగి గ్రామానికి చెందిన రైతు రాజారెడ్డి కుమార్తె అక్షయ నిమ్జ్‌ రైతుల దయనీయ స్థితిపై  విడుదల చేసిన ఒకటిన్నర నిమిషాల వీడియో సర్వత్రా చర్చనీయాశంగా మారింది. 

7. కెప్టెన్‌గా శిఖర్‌ ధావన్‌, వైస్‌ కెప్టెన్‌గా జడేజా

వెస్డిండీస్‌తో వన్డే సిరీస్‌కు భారత్‌ జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ సిరీస్‌కు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, బుమ్రా, హార్దిక్‌, పంత్‌కు విశ్రాంతినిచ్చింది. శిఖర్‌ ధావన్‌ కెప్టెన్‌గా, జడేజా వైస్‌ కెప్టెన్‌గా జట్టును ప్రకటించింది. రుతురాజ్‌, గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్, శ్రేయస్‌, ఇషాన్‌ కిషన్‌, సంజూ, శార్దూల్‌, యుజ్వేంద్ర, అక్షర్‌, అవేశ్‌ ఖాన్‌, ప్రసిద్ధ్‌, సిరాజ్‌, అర్షదీప్‌ను సభ్యులుగా జట్టుకు ఎంపిక చేసింది. 

8. కుదుటపడని లాలూ ఆరోగ్యం.. ఎయిమ్స్‌కు తరలింపు..!

రాష్ట్రీయ జనతాదళ్(RJD) అధినేత, బిహార్‌(Bihar) మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌(Lalu Prasad Yadav)ను మెరుగైన చికిత్స నిమిత్తం ఎయిమ్స్‌కు తరలిస్తున్నారు. ఇటీవల ఇంట్లో మెట్లపై నుంచి జారిపడటంతో లాలూ గాయపడ్డారు. వీపు భాగానికి గాయమై భుజం విరగడంతో ఆయనకు పట్నాలోని పారస్‌ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. 

9. చైనాకు కరోనా తిప్పలు.. మరోసారి వైరస్ విజృంభణ..!

కరోనా వైరస్ చైనాను దశలవారీగా తిప్పలుపెడుతోంది. ఇప్పుడిప్పుడే కాస్త తేరుకుంటున్న నగరాల్లో మళ్లీ కఠిన ఆంక్షలు అమల్లోకి వస్తున్నాయి. బుధవారం జియాన్, షాంఘై నగరాల్లో 300పైగా కొత్త కేసులు నమోదయ్యాయని అధికారులు వెల్లడించారు. ఈ కొత్త కేసులు ప్రజల్లో వణుకు పుట్టిస్తున్నాయి. ఈ ఏడాది ప్రారంభంలో ఎదుర్కొన్న లాక్‌డౌన్‌ల గురించి తలుచుకుంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

10. 3 నెలల్లో 24 బి.డాలర్ల రష్యా చమురు కొనుగోలు చేసిన భారత్‌, చైనా

ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం మొదలుపెట్టిన మూడు నెలల్లో భారత్‌, చైనాలు కలిసి మొత్తం 24 బిలియన్‌ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేశాయి. అమెరికా, ఐరోపా సమాఖ్య హెచ్చరికలను పట్టించుకోకుండా ఈ కొనుగోళ్లు జరిగాయి. మేతో ముగిసే మూడునెలలకు చైనా మొత్తం 18.9 బిలియన్‌ డాలర్ల విలువైన రష్యా చమురును కొనుగోలు చేయగా.. భారత్‌ అదే సమయంలో 5.1 బిలియన్‌ డాలర్ల విలువైన ఇంధనాన్ని దిగుమతి చేసుకొంది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts