Published : 07 Jul 2022 21:01 IST

Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

1. ‘సేవకుల వర్గం’ సృష్టికే ఆంగ్లేయుల విద్యావ్యవస్థ : మోదీ

బ్రిటిషర్లు తమ సొంత అవసరాలకు అనుగుణంగా ‘సేవకుల వర్గాన్ని’ సృష్టించడానికే భారత్‌కు విద్యా వ్యవస్థను అందించారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్లయినా వాటిలో చాలావరకు ఇంకా మారలేదని అన్నారు. జాతీయ విద్యా విధానంపై (NEP) వారణాసిలో జరిగిన సదస్సులో మాట్లాడిన ఆయన.. కేవలం డిగ్రీ పట్టా పొందిన వారిని కాకుండా దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు అవసరమైన వనరులను అందించేలా దేశ విద్యావ్యవస్థ ఉండాలని ప్రధాని మోదీ ఉద్ఘాటించారు.

2. ‘కాళీ’ వివాదం.. మమత కీలక వ్యాఖ్యలు..!

సొంత పార్టీ నేత మహువా మొయిత్ర చేసిన మతపరమైన వ్యాఖ్యలు వివాదాస్పదం కావడంతో తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ స్పందించారు. ప్రజలు తప్పులు చేస్తారని, వాటిని సరిదిద్దుకోవచ్చని వ్యాఖ్యానించారు. ‘పని చేసేప్పుడు మనం తప్పులు చేస్తుంటాం. వాటిని సరిదిద్దుకోవచ్చు. కొందరు చేసిన మంచి పనిని చూడరు. అకస్మాత్తుగా కేకలు వేయడం మొదలుపెడతారు. నెగిటివిటీ మన ఆలోచనలను దెబ్బతీస్తుంది. అందుకే సానుకూలంగా ఆలోచించండి’ అంటూ కోల్‌కతాలో జరిగిన కార్యక్రమంలో మాట్లాడారు. 

3. ఏపీలో హైస్కూల్‌ ప్లస్‌గా 292 ఉన్నత పాఠశాలలు

రాష్ట్ర వ్యాప్తంగా 292 ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్పు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ హైస్కూల్‌ ప్లస్‌ పాఠశాలలను బాలికలకు ప్రత్యేకంగా కేటాయిస్తూ ఆదేశాలు వెలువరించింది. హై స్కూల్‌ ప్లస్‌ పాఠశాలల్లో ఎంపీసీ, బైపీసీ, సీఈసీలలో రెండు కోర్సులు మాత్రమే అందించనున్నట్టు స్పష్టం చేసింది. స్థానికంగా ఉన్న డిమాండ్‌ను అనుసరించి కోర్సులు నిర్థారించాలని నిర్ణయించింది. 

4. సోనియా ఎవరిని నిర్ణయిస్తే వారే సీఎం: రేవంత్

వచ్చే ఏడాది జూన్‌ లేదా జులైలో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాబోతోందని టీపీసీసీ రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ అధినేత్రి సోనియా ఎవరిని నిర్ణయిస్తే వారినే పల్లకిలో భూజాలపై ఎత్తుకొని సీఎం పీఠంపై కూర్చోబెడతానని స్పష్టం చేశారు. అధ్యక్ష పదవి చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా గాంధీభవన్‌లో రేవంత్‌ మాట్లాడారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, కుటుంబ పెద్దగా కాంగ్రెస్‌ కాపాడుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. 

5. తెలంగాణలో కొత్తగా 592 కొవిడ్‌ కేసులు

తెలంగాణలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో ఇవాళ 27,488 మందికి కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 592 కేసులు నమోదయ్యాయి. ఇవాళ కొవిడ్‌ భారి నుంచి 477 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 4,997 యాక్టివ్‌ కేసులు ఉన్నాయని వైద్యారోగ్యశాఖ బులిటెన్‌లో తెలిపింది. రికవరీ రేటు 98.87శాతంగా ఉందని పేర్కొన్నారు.

6. విజయవాడలో రెండ్రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద వైకాపా ప్లీనరీ దృష్ట్యా ఈనెల 8, 9 తేదీల్లో 16వ జాతీయ రహదారిపై వాహనాలు దారిమళ్లిస్తున్నట్టు విజయవాడ పోలీస్‌ కమిషనర్‌ కాంతిరాణా,  గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమ్‌ వర్మ తెలిపారు. వైకాపా ప్లీనరీ నేపథ్యంలో జాతీయ రహదారిపైకి ఇతర వాహనాలు రాకుండా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10గంటల వరకు ట్రాఫిక్‌ ఆంక్షలు విధిస్తున్నట్టు చెప్పారు.

7. ఆకాశ ఎయిర్‌కు కీలక లైసెన్స్‌.. ఈ నెలలోనే సేవలు

బిగ్‌బుల్‌గా పేరొందిన ప్రముఖ మదుపరి రాకేశ్‌ ఝున్‌ఝున్‌ వాలా (Rakesh Jhunjhunwala) మరికొందరితో కలిసి నెలకొల్పిన ఆకాశ ఎయిర్‌కు (Akasa Air) కీలక అనుమతులు లభించాయి. కమర్షియల్‌ విమానాలు నడిపేందుకు కావాల్సిన లైసెన్సులను ఆ కంపెనీ పొందింది. ఈ విషయాన్ని ఆకాశ ఎయిరే స్వయంగా గురువారం ట్విటర్‌ వేదికగా వెల్లడించింది.

8. బోరిస్‌ జాన్సన్‌ రాజీనామా.. రష్యా స్పందన ఇదే!

బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అంతకుముందు ఈ వ్యవహారంపై రష్యా స్పందించింది. బ్రిటన్ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌కు రష్యా అంటే ఇష్టం లేదని.. ఆయన విషయంలో మాస్కోదీ అదే వైఖరని క్రెమ్లిన్‌ పేర్కొంది. ఈ క్రమంలోనే బ్రిటన్‌లో మరింత సమర్థులైన నాయకులు అధికారంలోకి వస్తారని ఆశిస్తున్నట్లు తెలిపింది.

9. 2001లో పూడ్చి.. ఇప్పుడు తవ్వితీసి! 

తాలిబన్‌ వ్యవస్థాపకుడు ముల్లా ఒమర్‌ వాడిన ఓ కారును దాదాపు 21 ఏళ్ల తర్వాత భూమిలో నుంచి బయటకు తవ్వి తీశారు. 9/11 ఘటన తర్వాత అఫ్గానిస్థాన్‌పై అమెరికా బలగాలు జరిపిన దాడుల నుంచి తప్పించుకునేందుకుగానూ ఆయన ఇదే వాహనాన్ని ఉపయోగించారు. ఈ తెల్లరంగు కారును తూర్పు అఫ్గానిస్థాన్‌ జాబుల్ ప్రావిన్స్‌లోని ఓ గ్రామ సమీపంలో వెలికితీశారు. 2001లో తాలిబాన్ ‪నేత అబ్దుల్ జబ్బార్ ఒమారీ సమక్షంలో దీన్ని పూడ్చిపెట్టారు. తాజాగా ఆయన ఆదేశాల మేరకు దాన్ని తవ్వి తీశారు.

10. పన్ను ఎగవేతకు వివో ‘స్మార్ట్‌’ స్కెచ్‌.. 50 శాతం టర్నోవర్‌ చైనాకు!

భారత్‌లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వివో ఇండియా (Vivo India) గత కొన్నేళ్లుగా పాల్పడుతున్న మోసాన్ని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ బయటపెట్టింది. కంపెనీకి చెందిన టర్నోవర్‌లో దాదాపు 50 శాతం నిధులను చైనాకు తరలించిందని దర్యాప్తు సంస్థ తెలిపింది. తద్వారా దేశంలో పన్ను ఎగవేతకు పాల్పడిందని పేర్కొంది. ఇటీవల వివోతో పాటు, అనుబంధ కంపెనీలకు చెందిన కార్యాలయాల్లో నిర్వహించిన సోదాలకు సంబంధించిన వివరాలను గురువారం వెల్లడించింది.

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

ఇవీ చదవండి


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని