Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 13 Jun 2024 21:25 IST

1. మంత్రులకు శాఖల కేటాయింపు.. కొనసాగుతున్న చంద్రబాబు కసరత్తు

ఆంధ్రప్రదేశ్‌లో మంత్రులుగా ప్రమాణం చేసిన 24మందికి శాఖల కేటాయింపుపై ముఖ్యమంత్రి చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. మంత్రుల అభీష్టం, వారి సామర్థ్యాన్ని బట్టి శాఖలు కేటాయిస్తానని ఇప్పటికే సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం మంత్రుల శాఖల కేటాయింపుపై ఉండవల్లిలోని తన నివాసంలో కసరత్తు చేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి..’ జగన్‌ కామెంట్స్‌ వైరల్‌

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌ మాట్లాడుతున్న తీరు చూసి, అందరూ నవ్వుకుంటున్నారు. తాజాగా వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్సీలతో సమావేశంలో జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ప్రజల మన్ననలు పొందిన తర్వాతే ఎన్నికలకు వెళ్లాం. ఈ ఎన్నికల్లో ఏమైందో తెలియదు. కళ్లు మూసుకుంటే ఐదేళ్లు అయిపోయాయి. మళ్లీ 2024 నుంచి 2029 వరకు కళ్లు మూసుకుంటే ఎన్నికలు వచ్చేస్తాయి’’అని అన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. నన్ను కలిసేందుకు వచ్చేవారు బొకేలు, శాలువాలు తేవొద్దు: పవన్‌

ఏపీ మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ను కలిసేందుకు నాయకులు, కార్యకర్తలు, ప్రముఖులు ప్రయత్నిస్తున్నారు. దీనిపై పవన్‌ స్పందించారు. త్వరలోనే జిల్లాలవారీగా అందరినీ కలుస్తానని చెప్పారు. ఈ నెల 20న పిఠాపురంలో పర్యటిస్తానన్నారు. తనను కలిసేందుకు వచ్చే వారు పూల బొకేలు, శాలువాలు తీసుకురావొద్దని విజ్ఞప్తి చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాష్ట్రవ్యాప్తంగా మహిళా శక్తి క్యాంటీన్లు: సీఎస్‌ శాంతికుమారి

తెలంగాణలో మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వెల్లడించారు. మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్న సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాల మేరకు రెండేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 150 మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గ్రామైక్య సంఘాలకు వీటి నిర్వహణ బాధ్యతలు అప్పగిస్తామని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. సీఎం చంద్రబాబును కలిసేందుకు వివాదాస్పద అధికారుల ప్రయత్నాలు

ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు క్యూ కట్టారు. గత ప్రభుత్వ హయాంలో వివాదాస్పద నిర్ణయాలు తీసుకున్న అజయ్‌ జైన్‌, శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు, సునీల్‌ కుమార్‌, కేవీవీ సత్యనారాయణ తదితరులు.. చంద్రబాబు రాగానే సచివాయలం మొదటి బ్లాక్‌ వద్దకు పరుగులు పెట్టారు. కానీ, ముఖ్యమంత్రి కార్యాలయం అనుమతించకపోవడంతో వెనుదిరిగినట్టు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. జాతీయ భద్రత సలహాదారుగా అజిత్‌ డోభాల్‌ పునర్నియామకం

ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో నూతన సర్కారు కొలువుదీరింది. ఈ క్రమంలోనే దేశ భద్రత అంశానికి సంబంధించి కీలకమైన నిర్ణయం తీసుకుంది. జాతీయ భద్రత సలహాదారు (NSA)గా విశ్రాంత ఐపీఎస్‌ అధికారి అజిత్‌ డోభాల్‌ను మరోసారి నియమించింది. ‘ఎన్‌ఎస్‌ఏ’గా ఆయన నియామకానికి క్యాబినెట్ నియామకాల కమిటీ ఆమోద ముద్ర వేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. 4 రోజుల్లో 4 ఉగ్రదాడులు.. జమ్మూ-కశ్మీర్‌ పరిస్థితులపై ప్రధాని మోదీ సమీక్ష

జమ్మూ-కశ్మీర్‌లో వరుస ఉగ్ర ఘటనలు కలకలం సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలోనే జమ్మూ-కశ్మీర్‌లోని భద్రత పరిస్థితులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం సమీక్షించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా, జాతీయ భద్రత సలహాదారు అజిత్‌ డోభాల్‌, జమ్మూ-కశ్మీర్‌ ఎల్జీ మనోజ్‌సిన్హాలతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. బాలికపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. యడియూరప్పపై అరెస్ట్‌ వారెంట్‌

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, భాజపా సీనియర్‌ నేత బీఎస్‌ యడియూరప్ప.. ఓ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన ఆరోపణలు తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనపై పోక్సో కేసు కూడా నమోదైంది. తాజాగా బెంగళూరు కోర్టు గురువారం ఆయనపై నాన్‌-బెయిలబుల్‌ అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. భారత్‌లా మనం ఎందుకు ఉండలేకపోతున్నాం..? పాక్‌ నేత వీడియో వైరల్‌

భారత్‌లో ఇటీవల విజయవంతంగా పూర్తయిన సార్వత్రిక ఎన్నికలపై పాకిస్థాన్‌కు చెందిన ఓ నేత ప్రశంసలు కురిపించారు. సెనెట్‌లో చేసిన ప్రసంగంలో న్యూదిల్లీని ప్రస్తావిస్తూ తమ దేశ ప్రభుత్వాన్ని ఎండగట్టారు. భారత్‌లా తాము ఎందుకు ఉండలేకపోతున్నామని నిలదీశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఒక డాలరు పెట్టి కొన్న పాత పేపర్లలో.. అన్నీ సైనిక రహస్యాలే!

చరిత్రకు సంబంధించిన విషయాలపై ఆసక్తి చూపే ఓ వ్యక్తికి అనూహ్య పరిణామం ఎదురయ్యింది. ఒక డాలరు కంటే తక్కువతో కొనుగోలు చేసిన కొన్ని పాత పేపర్లలో ఆ దేశ సైనిక రహస్యాలు ఉన్నట్లు వెల్లడైంది. వెంటనే అప్రమత్తమైన అతడు.. అందులో ఉన్న సున్నిత అంశాల దృష్ట్యా వాటిని భద్రతా దళాలకు అందించాడు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని