Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 PM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Published : 09 Jul 2024 20:59 IST

1. రైతు రుణామాఫీ తర్వాతే.. స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్దాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా పాలమూరు జిల్లా నిర్లక్ష్యానికి గురైందని తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తోన్న ఆయన.. జిల్లా కేంద్రంలో నిర్వహించిన సభలో మాట్లాడారు. రైతు రుణమాఫీ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ప్రధాని మోదీకి రష్యా అత్యున్నత పౌర పురస్కారం.. తొలి భారతీయ నేతగా ఘనత

భారత ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం రష్యా అత్యున్నత పౌర పురస్కారం ‘ఆర్డర్‌ ఆఫ్‌ సెయింట్‌ ఆండ్రూ ది అపోస్టల్‌ (Order of St Andrew the Apostle)’ను అందుకున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌ దీన్ని ప్రదానం చేశారు. ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయ నేత ఆయనే కావడం విశేషం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌

టీమ్‌ ఇండియా ప్రధాన కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ నియమితులయ్యారు. ఈ మేరకు బీసీసీఐ ప్రధాన కార్యదర్శి జైషా ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు. క్రికెట్‌ కెరీర్‌లో జట్టు కోసం ఎన్నో పాత్రలు పోషించిన గంభీర్‌.. ఇండియన్‌ క్రికెట్‌ను మరింత ముందుకు తీసుకెళ్తారన్న నమ్మకం తనకుందన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పెరగనున్న నాన్ ఏసీ కోచ్‌లు.. రెండేళ్లలో 10వేలు అందుబాటులోకి

సుదూర ప్రాంతాలకు ప్రయాణించేందుకు సామాన్యులు ఎక్కువగా ఎంచుకునేది రైలు మార్గాన్నే. ఈ నేపథ్యంలో వారి కోసం కేంద్ర రైల్వేశాఖ కీలక నిర్ణయం తీసుకుంది. 10 వేలకు పైగా నాన్‌- ఏసీ కోచ్‌లను రూపొందించేందుకు సన్నాహాలు చేస్తోంది. వచ్చే రెండు ఆర్ధిక సంవత్సరాల్లో  అందుబాటులోకి తీసుకురానుంది. ఈ విషయాన్ని భారత రైల్వేశాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. రత్నభాండాగారాన్ని ఆ రోజు తెరవండి..! కమిటీ నిర్ణయం

ఒడిశా పూరీ జగన్నాథ క్షేత్రంలోని రత్న భాండాగారాన్ని తెరిపించి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్‌ బిశ్వనాథ్‌ రథ్‌ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 14న రత్న భాండాగారం రహస్య గదిని తిరిగి తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్నట్లు తెలిపింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. గాంధీజీ చెప్పిన ఆ మాటలు మరువొద్దు: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము

ఒడిశా భువనేశ్వర్‌లోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (NISER) 13వ గ్రాడ్యుయేషన్‌ వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పాల్గొన్నారు. ‘‘జాతిపిత మహాత్మాగాంధీ ఏడు సామాజిక రుగ్మతలు ఉంటాయని విశ్వసించేవారు. అందులో ‘దయలేని సైన్స్‌’ కూడా ఒకటి. జాలి, దయ, మానవత్వం గురించి ఆలోచించకుండా సైన్స్‌ని ప్రచారం చేయడం మహా పాపం. ప్రతి ఒక్కరూ దీనిని గుర్తుంచుకోవాలి’’ అని హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. మ్యూచువల్‌ ఫండ్స్‌ @ ₹60 లక్షల కోట్లు

జూన్‌ చివరి నాటికి మ్యూచువల్‌ ఫండ్స్‌ నిర్వహణలోని ఆస్తుల విలువ రూ.61.33 లక్షల కోట్లకు చేరినట్లు యాంఫై చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ వెంకట్‌ చలసాని పేర్కొన్నారు. మ్యూచువల్‌ ఫండ్స్‌లోని పెట్టుబడుల విలువ రూ.60 లక్షల కోట్ల మైలురాయిని అందుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నీట్‌ పేపర్‌ లీక్‌ కేసు.. మరో ఇద్దరిని అరెస్టు చేసిన సీబీఐ

దేశంలో పెను దుమారం సృష్టించిన నీట్‌-యూజీ ప్రశ్నపత్రం లీక్‌ కేసు దర్యాప్తు చేస్తోన్న సీబీ మరో ఇద్దరిని అరెస్టు చేసింది. బిహార్‌లోని పట్నాకు చెందిన ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. వీరిలో ఒకరు నీట్ అభ్యర్థి కావడం గమనార్హం. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు అరెస్టు చేసిన వారి సంఖ్య 11కి చేరినట్లు సీబీఐ అధికారులు మంగళవారం వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. వారానికి 150 నిమిషాలైనా.. వ్యాయామం చేయకపోతే..

శరీరానికి కావాల్సిన వ్యాయామం దొరకకపోతే దీర్ఘకాలిక వ్యాధులకు దారితీస్తుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితి ఒక వ్యక్తి, కుటుంబానికే కాకుండా దేశ ఆరోగ్య వ్యవస్థకు ముప్పుగా మారుతుందని హెచ్చరిస్తున్నారు. అందుకే వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామంపై దృష్టి సారిస్తే మేలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఏఐ భామల అందాల పోటీ.. ‘మిస్‌ ఏఐ’ విజేత ఎవరో తెలుసా?

టెక్నాలజీలో అద్భుతాలు సృష్టిస్తోన్న కృత్రిమ మేధతో టీచర్లు, న్యూస్‌రీడర్లూ, ఇన్‌ఫ్లుయెన్సర్లు... ఇలా చాలామంది వృత్తి నిపుణులే పుట్టుకొచ్చారు. అందుకే ఇలాంటి ఏఐ సుందరాంగుల కోసం ‘మిస్‌ ఏఐ (Miss AI)’ పోటీలను నిర్వహించారు. ఇందులో మొరాకోకు చెందిన ఇన్‌ప్లుయెన్సర్‌ కెంజా లాయ్‌లీ (Kenza Layli) ప్రపంచంలోనే మొట్టమొదటి  ‘ఏఐ అందాల సుందరి’గా కిరీటం దక్కించుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు