Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు

ఈనాడు.నెట్‌లోని పది ముఖ్యమైన వార్తలు మీ కోసం.. 

Published : 27 Jan 2022 12:55 IST

1. పీఆర్సీ జీవోలు రద్దు చేయాల్సిందే..ఉద్యోగుల రిలేదీక్షలు

ఏపీలో పీఆర్సీ జీవోలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ సమ్మె నోటీసు ఇచ్చిన ఉద్యోగ సంఘాలు ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాయి. పీఆర్సీ సాదన సమితి నేతృత్వంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాలు నిరసనలు కొనసాగిస్తున్నాయి. విజయవాడ గాంధీనగర్‌లోని ధర్నాచౌక్‌, గుంటూరులో కలెక్టరేట్‌ ఎదురుగా ఉద్యోగులు రిలేదీక్షలు చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ‘రాయచోటి’ మాకొద్దు.. రాజంపేటలో విద్యార్థుల భారీ నిరసన

ఏపీ ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజనపై పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత కడప జిల్లా పరిధిలో ఉన్న రాయచోటిని అన్నమయ్య జిల్లాకు కేంద్రంగా చేయడంపై రాజంపేటలో విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజంపేట వైకాపా మున్సిపల్‌ ఛైర్మన్‌ శ్రీనివాసులురెడ్డి ఆధ్వర్యంలో సుమారు 3వేల మంది విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఒంగోలు, మార్కాపురంలను జిల్లాలు చేయాలి: లంకా దినకర్‌

ఏపీ ప్రభుత్వం పాలన సౌలభ్యం కోసం జిల్లాల పెంపు అంటోందని.. అలా అయితే ప్రకాశం జిల్లాలోని ఒంగోలు, మార్కాపురంలను జిల్లాలుగా చేయాలని భాజపా నేత లంకా దినకర్‌ డిమాండ్‌ చేశారు. అస్పష్టమైన విభజనతో పాలన వికేంద్రీకరణ సాధ్యం కాదని చెప్పారు. ఒంగోలు కేంద్రంగా కొండపి, కందుకూరు, అద్దంకి, సంతనూతలపాడు నియోజకవర్గాలతో నూతన ప్రకాశం జిల్లాగా ఏర్పాటు చేయడం ఉత్తమమైన కూర్పు అవుతుందని దినకర్‌ సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. రాయలసీమకు సముద్రతీరం!

అమరావతి: కొత్త జిల్లాల ఏర్పాటుతో కోస్తా, సీమ జిల్లాల లెక్కలూ మారనున్నాయి. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఇప్పటివరకు శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు 9 జిల్లాలను కోస్తా ప్రాంతంగా... కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురంలను రాయలసీమగా పరిగణిస్తున్నారు. 26 జిల్లాల పునర్విభజనతో కోస్తా జిల్లాల సంఖ్య 12 కానుంది. అలాగే ఏజెన్సీ ప్రాంతంలో రెండు, మైదాన ప్రాంతంలో 12 జిల్లాలు రానున్నాయి. సూళ్లూరుపేట నియోజకవర్గాన్ని తిరుపతి కేంద్రంగా ఏర్పడే శ్రీబాలాజీ జిల్లాతో కలపడంతో రాయలసీమకు తీరప్రాంతం వచ్చినట్లయింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

నెటిజన్లకు సారీ చెప్పిన నటి అనసూయ..!​​​​​​​

5. మార్కెట్లపై ‘ఫెడ్‌’ దెబ్బ.. 1100 పాయింట్లు పతనమైన సెన్సెక్స్‌

దేశీయ స్టాక్‌ మార్కెట్ సూచీలకు ఫెడ్‌ దెబ్బ గట్టిగా తాకింది. ఈ ఏడాది మార్చిలో వడ్డీ రేట్ల పెంపు ఉంటుందని ‘అమెరికా ఫెడరల్ రిజర్వ్‌’ బుధవారం అర్ధరాత్రి వెల్లడించింది. ఈ మేరకు దేశీయ మార్కెట్లు గురువారం భారీ నష్టాలతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. బాంబే స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ సెన్సెక్స్‌ ఆరంభంలోనే దాదాపు 1000 పాయింట్లకు పైగా పతనమవ్వగా.. జాతీయ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ సూచీ నిఫ్టీ 17వేల మార్క్‌ వద్ద ఊగిసలాడుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఒక్కరోజే 3 లక్షల మంది కోలుకున్నారు..!

దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. .బుధవారం 14 లక్షల మందికి కరోనా నిర్ధరాణ పరీక్షలు నిర్వహించగా.. 2,86,384 మందికి వైరస్ సోకినట్లు నిర్ధారణ అయింది. 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 573 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఉద్ధృతి వేళ.. మెల్లగా రికవరీలు పెరగటం ఊరటనిస్తోంది. నిన్నఒక్కరోజే 3,06,357 మంది కొవిడ్ నుంచి కోలుకోగా.. మొత్తంగా ఇప్పటి వరకు 3.76 కోట్ల మంది వైరస్‌ను జయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఈడీ కస్టడీలోకి కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథి

కార్వీ సంస్థ ఛైర్మన్‌ పార్థసారథిని ఈడీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. ఇటీవలే ఆయనను బెంగళూరులో అరెస్టు చేసి చంచల్‌గూడ జైలుకు తరలించిన విషయం తెలిసిందే. ఇవాళ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్న అధికారులు వైద్య పరీక్షల అనంతరం ఈడీ కార్యాలయానికి తరలించారు. నాలుగు రోజుల పాటు పార్థసారథిని ఈడీ ప్రశ్నించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ప్రభుత్వ ఒత్తిడితోనే నా ఫాలోవర్లను తగ్గిస్తున్నారు.. ట్విటర్‌పై రాహుల్‌ గాంధీ ఫైర్‌

ట్విటర్‌పై కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ ఫైర్‌ అయ్యారు. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి ట్విటర్‌లో కావాలనే తన ఫాలోవర్లను తగ్గిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో వాక్‌ స్వాతంత్ర్యాన్ని అడ్డుకోవడంలో ట్విటర్‌ తెలియకుండా భాగస్వామిగా మారిందని ఆక్షేపించారు. ఈ మేరకు ట్విటర్‌ సీఈవో పరాగ్‌ అగర్వాల్‌కు లేఖ రాశారు. అయితే ఈ లేఖపై స్పందించిన సామాజిక మాధ్యమ సంస్థ.. రాహుల్‌ ఆరోపణలను తోసిపుచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఈ విషయంలో ఇతర దేశాలను గుడ్డిగా అనుసరించం..!

కరోనా కొత్త వేరియంట్లను అడ్డుకునేందుకు.. ఇప్పటికే పలు సంపన్న దేశాలు బూస్టర్ డోసులు అందిస్తున్నాయి. భారత్‌ కూడా ప్రికాషనరీ డోసు పేరిట.. ముప్పు పొంచి ఉన్నవర్గాలకు మూడో టీకా ఇస్తోంది. ఈ బూస్టర్ డోసు కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ఇతర దేశాలను గుడ్డిగా అనుసరించకూడదని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘డెల్టా’నూ అడ్డుకుంటున్న ఒమిక్రాన్‌ రోగనిరోధకత

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ బారినపడిన వారిలో వస్తున్న రోగనిరోధక స్పందన గణనీయంగా ఉంటున్నట్లు భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం వెల్లడించింది. ఈ రోగనిరోధకత ఒమిక్రాన్‌పైనే కాకుండా.. డెల్టా సహా ఇతర ఆందోళనకర వేరియంట్లపైనా సమర్థంగా పనిచేస్తున్నట్లు తెలిపింది. దీంతో డెల్టా రకం వల్ల మళ్లీ ఇన్‌ఫెక్షన్‌ రాకుండా కూడా చేసే అవకాశాలున్నట్లు పేర్కొంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని