Updated : 19 May 2022 13:11 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్‌ 10 వార్తలు

1. తెలంగాణలో లిక్కర్‌పై 20 నుంచి 25శాతం పెంపు

తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. మద్యం ధరలను దాదాపు 20 నుంచి 25 శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఒక్కో బీరుపై రూ.10, క్వార్టర్‌ లిక్కర్‌ సీసాపై రూ.20, వెయ్యి ఎంఎల్‌ల లిక్కర్‌పై రూ.120 వరకు ధర పెరిగింది. పెంచిన మద్యం ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి. అయితే, ఆయా బ్రాండ్‌లను బట్టి ధరల్లో స్వల్ప తేడా ఉండనుంది.

2. మహిళా వాలంటీర్‌ హత్య కేసు నిందితుడు పద్మారావు ఆత్మహత్య

బాపట్ల జిల్లా వేమూరు మండలంలోని చావలి గ్రామంలో వాలంటీర్‌ శారద(30) హత్య కేసులో నిందితుడిగా ఉన్న పద్మారావు ఆత్మహత్య చేసుకున్నాడు. నిడుబ్రోలు రైల్వేస్టేషన్‌లో పద్మారావు(35) తిరుపతి నుంచి విశాఖ వెళ్తున్న డబుల్ డెక్కర్ రైలు కింద పడి బలవన్మరణానికి పాల్పడ్డాడు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగింది. అతని జేబులో ఉన్న కార్డుల ఆధారంగా కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందించారు. 

3. ఆహార ధాన్యాలు.. కరోనా వ్యాక్సిన్లలా కాకూడదు..!

గోధుమ ఎగుమతులను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పశ్చిమ దేశాల నుంచి విమర్శలు వస్తున్న వేళ.. భారత్‌ దీటుగా స్పందించింది. అవసరమైన వారికి ఆహార ధాన్యాలను అందించాలనే ఉద్దేశంతోనే ఎగుమతులపై ఆంక్షలు విధించినట్లు తెలిపింది. ఆహార ధాన్యాల సరఫరా కొవిడ్‌ వ్యాక్సిన్ల మాదిరిగా ఉండకూడదంటూ అంతర్జాతీయ వేదికగా పశ్చిమ దేశాలకు హితవు పలికింది.

4. అవే హెచ్చుతగ్గులు.. మరోసారి 2 వేలకు పైగా కేసులు

దేశంలో స్వల్ప హెచ్చుతగ్గులతో కరోనావైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. బుధవారం 4.77 లక్షలమందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 2,364 మందికి వైరస్ సోకినట్లు తేలింది. తాజాగా కొత్త కేసులు పెరిగి.. మరోసారి రెండు వేల ఎగువకు చేరాయి. నిన్న 2,582 మంది కొవిడ్ నుంచి బయటపడ్డారు. ఇప్పటి వరకూ 4.31 కోట్లమందికి పైగా కరోనా బారినపడగా.. 4.25 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. దీంతో రికవరీ రేటు 98.75 శాతానికి చేరింది. 

5. ఏపీ రోడ్లపై చినజీయర్‌స్వామి ఆవేదనతో స్పందించారు: లోకేశ్‌

రాజ‌కీయాల‌కు దూరంగా హిందూ ధ‌ర్మ ప్రచార‌మే జీవిత‌ల‌క్ష్యంగా సాగుతోన్న చిన‌ జీయ‌ర్ స్వామి ఏపీలో ర‌హ‌దారుల దుస్థితిపై ఆవేద‌న‌తో స్పందించారని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ అన్నారు. గోతులు, ఒడుదొడుకుల గురించి జీయర్ స్వామి ప్రస్తావించిన ఓ వీడియోను లోకేశ్‌ విడుదల చేశారు. జంగారెడ్డి గూడెం నుంచి రాజ‌మ‌హేంద్రవరం వ‌ర‌కూ రోడ్డు ప్రయాణం ఒక జ్ఞాప‌కంగా మిగులుతుందంటూ రోడ్ల దుస్థితిని భ‌క్తుల‌కు చెప్పారని గుర్తుచేశారు.

6. నేనేం బాధపడట్లేదు.. ఇదో అత్యుత్తమ క్రికెట్‌ మ్యాచ్‌: శ్రేయస్

లఖ్‌నవూతో తలపడిన మ్యాచ్‌లో ఓటమితో తానేం బాధపడట్లేదని కోల్‌కతా కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ స్పష్టం చేశారు.  అత్యంత ఉత్కంఠభరితమైన స్థితిలో ముగిసిన ఈ గేమ్‌.. అత్యుత్తమ క్రికెట్‌ మ్యాచ్‌ల్లో ఒకటని చెప్పాడు. ఈ గేమ్‌లో మేం చూపించిన ధైర్యం, పట్టుదల అత్యద్భుతమైనవని పేర్కొన్నారు. కాగా, నిన్నటి ఓటమితో  భారత టీ20 లీగ్‌ 15వ సీజన్‌లో కోల్‌కతా కథ ముగిసిన సంగతి తెలిసిందే. 

7. మరోసారి పెరిగిన గ్యాస్‌ సిలిండర్‌ ధరలు

సామాన్యుడిపై గ్యాస్‌ సిలిండర్‌ ధర పెరుగుదల రూపంలో మరో భారం పడింది. గృహావసరాలకు వినియోగించే 14.2 కిలోల సిలిండర్‌ ధర మరోసారి పెరిగింది. గ్యాస్‌ బండ ధరను రూ.3.50 పెంచారు. అలాగే వాణిజ్య సిలిండర్‌ ధరను రూ.8 పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. ఇప్పటికే నిత్యావసరాలు, పెట్రో ఉత్పత్తుల భారాన్ని మోస్తున్న సామన్యులపై తాజా పెరుగుదలతో మరింత భారం పడనుంది.

8. భారీగా పతనమైన మార్కెట్‌ సూచీలు

దేశీయ మార్కెట్‌ సూచీలు గురువారం భారీగా పతనం అయ్యాయి. ఉదయం 9.25 సమయంలో నిఫ్టీ 308 పాయింట్లు పతనమై 15,932 వద్ద, సెన్సెక్స్‌ 1,030 పాయింట్లు  కుంగి 53,177 వద్ద ట్రేడవుతున్నాయి. ఇక రంగాల వారీగా అన్ని సూచీలు నష్టాల్లోనే ఉన్నాయి. అత్యధికంగా పవర్‌, యుటిలిటీస్‌ సూచీలు 3శాతానికి పైగా విలువ కోల్పోయాయి.మరోపక్క అమెరికా మార్కెట్లు కూడా భారీగా నష్టపోవడం దేశీయ సూచీలపై ప్రతికూల ప్రభావం చూపింది.

9. గుంటూరు జిల్లాలో బాలికపై అత్యాచారం

గుంటూరు జిల్లాలో అఘాయిత్యాలకు అడ్డుకట్ట పడటం లేదు. తాజాగా తొమ్మిదో తరగతి విద్యార్థిని అత్యాచారానికి గురైంది. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మరోవైపు జనసేన నాయకులు జీజీహెచ్‌కు చేరుకొని ఆందోళన నిర్వహించారు. 

10.  అమెరికాలో మళ్లీ మంకీపాక్స్‌ కలకలం.. ఏంటీ వైరస్‌..?

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి అరుదైన వైరస్‌ ‘మంకీపాక్స్‌’ కలకలం సృష్టిస్తోంది. మసాచుసెట్స్‌కు చెందిన ఓ వ్యక్తికి ఈ వ్యాధి సోకినట్లు ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. సదరు వ్యక్తి ఇటీవలే కెనడాకు వెళ్లి వచ్చినట్లు తెలిపారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుప్రతిలో చికిత్స తీసుకుంటున్నాడని, ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొన్నారు. మరోవైపు ఈ వైరస్‌ వ్యాప్తి చెందకుండా అధికారులు చర్యలు చేపట్టారు.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని

సుఖీభవ

మరిన్ని