Published : 26 May 2022 12:55 IST

Top Ten News @ 1 PM: ఈనాడు.నెట్‌లోని టాప్ 10 వార్తలు

1. ఉప్పు, నిప్పుగా ఉన్నట్లు నాటకం.. వాళ్ల చీకటి బంధం ప్రజలకు తెలుసు: రేవంత్‌

ప్రధాని నరేంద్రమోదీ హైదరాబాద్‌ పర్యటన సందర్భంగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఆయనకు బహిరంగ లేఖ రాశారు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడంలో భాజపా, తెరాస విఫలమయ్యాయని రేవంత్‌ విమర్శించారు. ఆ రెండు పార్టీలు ఉప్పు, నిప్పుగా ఉన్నట్లు నాటకమాడుతున్నాయని.. కానీ వాళ్ల చీకటి బంధం ప్రజలకు తెలుసన్నారు. బహిరంగ లేఖలో 9 అంశాలను ప్రస్తావిస్తూ వాటికి ప్రధాని సమాధానం చెప్పాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆ తుపాకులు అక్కడ ఎందుకు..?

2. మంత్రుల ‘సామాజిక న్యాయభేరి’ బస్సు యాత్ర ప్రారంభం

ఏపీలో సీఎం జగన్ సామాజిక విప్లవం సృష్టించారని.. ఇది దేశమంతా అవలంబించాలని మంత్రులు ఆకాంక్షించారు. మంత్రివర్గంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ మంత్రులు సామాజిక న్యాయభేరి పేరిట శ్రీకాకుళం నుంచి నాలుగు రోజుల బస్సుయాత్రను ప్రారంభించారు. ఇందులో పాల్గొన్న 17 మంది మంత్రులు తమ తమ సామాజిక వర్గాలకు వైకాపా ప్రభుత్వంలో దక్కిన ప్రాధాన్యాలను వివరిస్తామని చెప్పారు. 

3. పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తులకు నేడే ఆఖరు

తెలంగాణలో పోలీస్‌ ఉద్యోగాల దరఖాస్తు ప్రక్రియ నేటితో ముగియనుంది. ఈ రోజు రాత్రి 10 గంటల వరకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. 17,291 ఉద్యోగాలకు పోలీస్‌ నియామక మండలి నోటిఫికేషన్లు జారీ చేయగా.. ఇప్పటి వరకు దాదాపు 13 లక్షల వరకు దరఖాస్తులు వచ్చినట్లు సమాచారం. దరఖాస్తు చేయడానికి ఇవాళే చివరి రోజు కావడంతో ఆ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. 

ఎవరీ యాసిన్‌ మాలిక్..?

4. ‘మహానాడు’కు భారీ ర్యాలీగా తరలి వెళ్లిన చంద్రబాబు

ఒంగోలులో రేపటి నుంచి ప్రారంభం కానున్న తెదేపా మహానాడుకు ఆ పార్టీ శ్రేణులు తరలి వెళ్తున్నాయి. అన్ని జిల్లాల నుంచి ముఖ్యనేతలు, కార్యకర్తలు ఒంగోలు చేరుకుంటున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, ఇతర నేతలు భారీ ర్యాలీగా మహానాడుకు బయల్దేరారు. మంగళగిరి నుంచి కార్లు, ద్విచక్ర వాహనాలతో తరలి వెళ్లారు. వందల సంఖ్యలో వాహనాలు చంద్రబాబు కాన్వాయ్‌ను అనుసరించాయి. 

5. గాల్లో తేలినట్టుంది.. ఈరోజు ఎంతో ప్రత్యేకం: డుప్లెసిస్

క్వాలిఫయర్‌-2కు వెళ్లినందుకు బెంగళూరు కెప్టెన్‌ డు ప్లెసిస్‌ హర్షం వ్యక్తం చేశాడు. ‘మా ఆటగాళ్లు అద్భుతంగా ఆడారు. ఈ విజయంతో గాల్లో తేలినట్టుంది. రజత్‌ పటీదార్‌ లాంటి యువ ఆటగాడు ఇలా రాణించడం జట్టుకు శుభపరిణామం. ఈ టోర్నీల్లో నేను చూసిన అతి గొప్ప శతకాల్లో ఇదొకటి. రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద విజయం సాధించినా ఈ విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకోవడం చాలా ముఖ్యం’ అని డుప్లెసిస్‌ వివరించాడు. 

లఖ్‌నవూపై విజయం.. కోహ్లీ రియాక్షన్‌ చూడండి

6. గోల్డ్ సిప్‌ను ప్రారంభించిన ఫోన్‌పే.. రూ.100తోనూ బంగారం కొనొచ్చు

ఫోన్ పే వినియోగ‌దారుల‌కు శుభ‌వార్త‌. ప్ర‌ముఖ డిజిట‌ల్ పేమెంట్స్ యాప్ ఫోన్-పే ద్వారా ప్ర‌తీ నెల ఒక నిర్ధిష్ట మొత్తంతో 24 క్యారెట్ల స్వ‌చ్ఛ‌మైన బంగారాన్ని కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఇందుకోసం గోల్డ్ సిస్ట‌మాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్ (సిప్‌)ని ప్రారంభించిన‌ట్లు ఫోన్‌పే బుధ‌వారం ప్ర‌క‌టించింది. సిప్ పెట్టుబ‌డుల ద్వారా సేక‌రించిన బంగారం భాగ‌స్వామ్య సంస్థ‌లైన ఎంఎంటీసీ- పీఏఎంపీ, సేఫ్ గోల్డ్ నిర్వ‌హిస్తున్న బ్యాంక్‌-గ్రేడ్ లాక‌ర్ల‌లో భ‌ద్ర‌ప‌రుస్తారు. 

7. ఒకటి బోగస్, ఇంకోటి మోర్‌ బోగస్‌, మరొకటి మోస్ట్ బోగస్‌..!

వీసా కుంభకోణం కేసులో కాంగ్రెస్ ఎంపీ కార్తి చిదంబరం సీబీఐ విచారణను ఎదుర్కొంటున్నారు. దానిలో భాగంగా గురువారం ఆయన సీబీఐ అధికారుల ముందు హాజరయ్యారు. ఈ క్రమంలో కార్యాలయం ఎదుట ఆయన మీడియాతో మాట్లాడుతూ దర్యాప్తు సంస్థల వైఖరిని తప్పుపట్టారు. దర్యాప్తు సంస్థలు తనపై మోపే ప్రతి కేసూ బోగసేనన్నారు. ‘ఒకటి బోగస్, ఇంకోటి మోర్ బోగస్‌, మరొకటి మోస్ట్ బోగస్’ అంటూ తనపై పెట్టిన కేసుల గురించి వ్యాఖ్యానించారు.

8. జైల్లో క్లర్క్‌గా పనిచేయనున్న సిద్ధూ.. జీతం ఎంతో తెలుసా..?

మూడు దశాబ్దాల నాటి కేసులో ఏడాది శిక్ష పడటంతో కాంగ్రెస్‌ నేత నవజోత్‌ సింగ్‌ సిద్ధూ (Navjot Singh Sidhu) ప్రస్తుతం పటియాలా సెంట్రల్‌ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఈ శిక్షా కాలంలో ఆయన జైల్లో క్లర్క్‌గా పనిచేయనున్నారు. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. సాధారణంగా కఠిన కారాగార శిక్ష పడిన ఖైదీలకు జైల్లో పనులు అప్పగిస్తారు. ఇందులో భాగంగానే సిద్ధూకు క్లరికల్‌ వర్క్‌ను అప్పగించాలని నిర్ణయించినట్లు జైలు అధికారులు వెల్లడించారు.

9. మహారాష్ట్ర మంత్రి అనిల్‌ పరబ్‌ ఇంట్లో ఈడీ సోదాలు

మహారాష్ట్రలో మరో మంత్రిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులు జరిపింది. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్‌ పరబ్‌ నివాసంలో ఈ ఉదయం ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఓ మనీలాండరింగ్‌ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా ఈ తనిఖీలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు. అనిల్‌ నివాసంతో పాటు ఆయనకు సంబంధించిన కార్యాలయాల్లోనూ ఏకకాలంలో ఈ సోదాలు జరిగాయి.

10. నిన్నటి కంటే 24 శాతం అధికంగా కరోనా కేసులు..!

దేశంలో కరోనా వ్యాప్తి అదుపులో ఉంది. స్వల్ప హెచ్చుతగ్గులతో కొత్త కేసులు నమోదవుతున్నాయి. బుధవారం 4.52 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 2,628 మందికి వైరస్‌ పాజిటివ్‌గా తేలింది. ముందురోజు కంటే 24 శాతం మేర అధికంగా కేసులొచ్చాయి. నిన్న 2,167 మంది కోలుకున్నారు. కొత్త కేసుల పెరుగుదలతో క్రియాశీల కేసులు 15,414కు ఎగబాకాయి.

Read latest General News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని