Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు @ 9 AM

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..

Published : 02 Jul 2024 09:03 IST

1. అప్పుల కుప్పగా విద్యుత్‌ సంస్థ

జగన్‌ అప్పుల థియరీ ఇంధన శాఖను నిండా ముంచింది. గత వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో ఎన్నడూ లేనంతగా సంస్థ అప్పులను రూ. 1.20 లక్షల కోట్లకు పెంచింది. ఈ పరిస్థితి నెలకొనడానికి దారితీసిన కారణాలపై ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం సమీక్షించారు. గత ప్రభుత్వం స్వల్పకాలిక ఒప్పందాల ద్వారా ఐదేళ్ల వ్యవధిలో బహిరంగ మార్కెట్‌లో కొనుగోలు చేసిన విద్యుత్‌ ఎంత? ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది? సంస్థపై అప్పుల భారం పెరగడానికి కారణాలేంటి తదితర అంశాలపై సీఎం అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. భూమన అడిగారు.. సుబ్బారెడ్డి ఇచ్చేశారు..!

ఉదాత్త స్వభావంతో శ్రీవారి భక్తుల అవసరాల కోసం తితిదేకు దాతలు ఇచ్చిన భూములు వైకాపా ప్రభుత్వంలో కార్పొరేషన్‌కు అప్పనంగా ధారాదత్తం చేశారు. పరిహారం మాట ఎత్తకుండానే రూ.వందల కోట్ల విలువైన భూములను రహదారుల విస్తరణ పేరుతో దోచిపెట్టారు. వైకాపా హయాంలో స్థానిక ఎమ్మెల్యేగా ఉన్న భూమన కరుణాకర్‌రెడ్డి అడిగిందే తడవుగా తితిదే ఆస్తులను కార్పొరేషన్‌కు వై.వి.సుబ్బారెడ్డి కట్టబెట్టారు. కేవలం నాడు సార్వత్రిక ఎన్నికల్లో లబ్ధి కోసమే భక్తుల పేరు చెప్పి వాటిని తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. ఏటా ఉద్యోగాల భర్తీ!

రాష్ట్రంలో నిరంతర ఉద్యోగ నియామక ప్రక్రియ చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు.. నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన అవసరం లేకుండా ఏటా నోటిఫికేషన్‌లతో కూడిన ఉద్యోగ క్యాలెండర్‌ వెలువరించేందుకు సమాయత్తమవుతోంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి రెండు వారాల్లో ఉద్యోగ క్యాలెండర్‌ విడుదల చేయాలని నిర్ణయించింది. టీజీపీఎస్సీ భర్తీ చేసే గ్రూప్‌-1, 2, 3, 4 ఉద్యోగాలతో పాటు గురుకులాలు, పోలీసు, వైద్య నియామక బోర్డుల నోటిఫికేషన్లు, ఇతర విభాగాల పోస్టులన్నింటినీ ఇందులో పొందుపరచనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. పింఛను కోసం పుట్టుకొచ్చిన వైకల్యం.. వైకాపా సర్పంచి, ఆమె భర్త నిర్వాకం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ముంగిళిపట్టు పంచాయతీలో పింఛన్ల అక్రమ బాగోతం వెలుగు చూసింది. వైకాపా సర్పంచి జాగర్లమూడి భారతి దంపతులతోపాటు మరో 20 మంది వరకు అక్రమంగా పింఛన్లు పొందుతున్నట్లు తెదేపా నాయకులు వెల్లడించారు. తెదేపా సూపర్‌ సిక్స్‌ పథకాల అమలులో భాగంగా ఎన్టీఆర్‌ భరోసా పింఛన్ల పంపిణీని సోమవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది, స్థానిక తెదేపా నాయకుల సమక్షంలో చేపట్టారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కోర్టులోనే కుప్పకూలి..

ఆసియా జూనియర్‌ బ్యాడ్మింటన్‌ ఛాంపియన్‌షిప్స్‌లో ఆడుతూనే కోర్టులో కుప్పకూలిన 17 ఏళ్ల చైనా షట్లర్‌ జాంగ్‌ జిజీ మరణంపై భారత స్టార్‌ పీవీ సింధు తీవ్ర విచారం వ్యక్తం చేసింది. ఈ వార్తతో తన హృదయం ముక్కలైందని ఆమె తెలిపింది. ‘‘బ్యాడ్మింటన్‌ యువ ఆటగాడు ఆసియా జూనియర్‌ ఛాంపియన్‌షిప్‌ సందర్భంగా మరణించాడనే వార్తతో నా హృదయం ముక్కలైంది. ఈ కష్ట కాలంలో జాంగ్‌ కుటుంబానికి తీవ్రమైన సానుభూతి వ్యక్తం చేస్తున్నా. ఓ అద్భుతమైన ప్రతిభను ప్రపంచం కోల్పోయింది’’ అని ఎక్స్‌లో సింధు పోస్టు చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. ఆమ్రపాలి పగ్గాలు చేపట్టినా.. నిమ్మకు నీరెత్తినట్లే జీహెచ్‌ఎంసీ అధికారులు!

హైదరాబాద్‌లో పారిశుద్ధ్యం రోడ్ల మీదకు చేరి అన్ని ప్రాంతాల్లో దోమలు విజృంభిస్తున్నాయి. వేలాది మంది రోగాల భారిన పడి ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. మరోవైపు వర్షాకాలం మొదలవడంతో నగర రోడ్లు చెరువులుగా మారుతున్నాయి. చిన్నపాటి వర్షానికే వేలాది వాహనాలు ట్రాఫిక్‌లో చిక్కుకుంటున్నాయి. వర్షాకాలానికే ముందు నాలాల్లో పూడికతీత పూర్తి కావాల్సి ఉండగా ఇప్పటి కొనసాగుతున్నాయి. నగరంలో చేపట్టిన ఆయా ప్రాజెక్టుల నిర్మాణం పనులు దాదాపు నిలిచిపోయాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకురావాలి

క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలను ఆరోగ్యశ్రీ వంటి ఉచిత ఆరోగ్య సేవల్లో చేర్చడం ద్వారా ప్రజలు ముందస్తు వైద్య పరీక్షలు చేయించుకోవడానికి అవకాశం ఉంటుందని ప్రముఖ రేడియేషన్‌ ఆంకాలజిస్ట్‌ డా.నోరి దత్తాత్రేయుడు అన్నారు. ఈ విషయం పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు తెలియజేసినట్లు సోమవారం డాక్టర్స్‌ డే సందర్భంగా చెప్పారు. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం సమీపంలోని జీఎస్‌ఎల్‌ వైద్య కళాశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. నల్గొండలోని భారాస కార్యాలయాన్ని కూల్చేయండి

నల్గొండలో రూ.100 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా భారాస జిల్లా కార్యాలయాన్ని నిర్మించారని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. దాన్ని కూల్చి వేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. నల్గొండలో రూ.3 కోట్ల అంచనా వ్యయంతో విద్యుత్తు ఉపకేంద్ర నిర్మాణ పనులకు సోమవారం మంత్రి శంకుస్థాపన చేశారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అనుమతి లేకుండా పేదలు ఇళ్లు నిర్మించుకుంటే నోటీసులు జారీ చేసి కూల్చి వేసే అధికారులు భారాస కార్యాలయం విషయంలో ఎందుకు నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫీజులు నొక్కి.. ఇరుకు గదుల్లో కుక్కి

జిల్లాలోని ప్రైవేటు జూనియర్‌ కళాశాలల్లో విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో తనిఖీ చేయాల్సిన ఇంటర్‌ విద్యాధికారులు పట్టించుకోకపోవటంతో యాజమాన్యాలు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాయి. ఫీజులకు తగిన విధంగా వసతులు కల్పించాల్సి ఉన్నా అవేవి పాటించకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. కళాశాలలో చేరిన తర్వాత అధిక ఫీజుల వసూళ్లపై ప్రశ్నించిన విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ఆస్టియోపొరోసిస్‌ ముప్పుపై హెచ్చరికలు చేసే ఏఐ

ఎముకలను గుల్లబార్చే ఆస్టియోపొరోసిస్‌ రుగ్మత ముప్పును ముందుగానే పసిగట్టేందుకు ఒక కృత్రిమ మేధ (ఏఐ) నమూనా సిద్ధమైంది. అమెరికాలోని టులేన్‌ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు ఈ ఘనత సాధించారు. ఆస్టియోపొరోసిస్‌కు కారణమయ్యే 10 ముఖ్యమైన అంశాలను పరిశోధకులు గుర్తించారు. వయసు, బరువు, పిడికిలి పట్టు, అధిక రక్తపోటుతోపాటు ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు