Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్‌ 10 వార్తలు

ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం...

Updated : 21 Sep 2023 17:02 IST

1. చంద్రబాబు తప్పు చేసే వ్యక్తి కాదు: కేంద్రమంత్రి గడ్కరీ

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు ఎలాంటి తప్పు చేసే వ్యక్తి కాదని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ అన్నారు. గురువారం పార్లమెంట్‌ వద్ద  తెదేపా ఎంపీ కేశినేని నానితో మాట్లాడిన గడ్కరీ.. చంద్రబాబు యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు. ‘‘చంద్రబాబు మచ్చలేని ప్రజా సేవకుడు. భగవంతుని ఆశీస్సులతో కడిగిన ముత్యంలా కేసు నుంచి బయటపడతారు’’ అని గడ్కరీ చెప్పినట్టు కేశినేని నాని ట్వీట్‌ చేశారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

2. గ్రేటర్‌ పరిధిలో ఎన్నికల్లోగా లక్ష ఇళ్ల పంపిణీ: కేటీఆర్‌

 ‘ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు’ అని గతంలో పెద్దలు అనేవారని, కానీ ప్రస్తుతం సీఎం కేసీఆర్‌ మాత్రం.. ‘ఇల్లు నేనే కట్టిస్తా...పెళ్లి నేనే చేయిస్తా’ అంటున్నారని మంత్రి కేటీఆర్‌ (KTR) అన్నారు. గ్రేటర్ హైదరాబాద్‌ పరిధిలో రూ.50వేల కోట్ల విలువ చేసే ఆస్తులను ప్రభుత్వం పేదలకు ఇస్తోందని తెలిపారు. నగర శివారులోని దుండిగల్‌లో నిర్మించిన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్‌ పంపిణీ చేశారు. ఇవాళ నగర వ్యాప్తంగా 9 ప్రాంతాల్లో మేయర్‌ ఆధ్వర్యంలో మంత్రులు రెండో విడతగా 13,300 ఇళ్లను పంపిణీ చేస్తున్నారని కేటీఆర్‌ పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

3. కెనడా పౌరులకు వీసా సర్వీసులను నిలిపివేసిన కేంద్రం..!

ఖలిస్థానీ అంశంలో భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. భారత్‌కు వచ్చే కెనడా పౌరులకు వీసాల జారీని కేంద్ర ప్రభుత్వం నిలిపివేసినట్లు తెలుస్తోంది. నిర్వహణ కారణాలతో కెనడాలో వీసా సర్వీసుల (Visa Services)ను తాత్కాలికంగా సస్పెండ్‌ చేసినట్లు కొన్ని ప్రైవేటు ఏజెన్సీలు వెల్లడిస్తున్నాయి. తదుపరి నోటీసులు ఇచ్చేంత వరకు ఈ ఆదేశాలు కొనసాగుతాయని పేర్కొన్నాయి.  మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

4.  ‘చర్చించే ధైర్యం మాకుంది..!’ చైనా సరిహద్దు వివాదంపై కేంద్ర మంత్రి

 చైనా (China) నుంచి ఎదురవుతున్న సరిహద్దు సవాళ్లపై పార్లమెంటులో చర్చకు నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరాకరిస్తోందంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తోన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కొనసాగుతోన్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో (Parliament Special Session) ఈ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. అంతరిక్ష రంగంలో భారత విజయాలపై రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ (Rajnath Singh) లోక్‌సభలో చర్చను ప్రారంభించగా.. ఈ క్రమంలోనే కాంగ్రెస్‌ ఎంపీ అధీర్‌ రంజన్‌ చౌదరి కల్పించుకుని చైనాతో సరిహద్దు ప్రతిష్టంభనను ప్రస్తావించారు. దీనిపై కేంద్రమంత్రి స్పందిస్తూ.. చైనాతో సరిహద్దు వివాదంపై చర్చించే ధైర్యం తమకు ఉందని వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

5. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు కుట్ర: నారా లోకేశ్

రాజమహేంద్రవరం జైల్లో తెదేపా అధినేత చంద్రబాబుకు ఏం జరిగినా సీఎం జగన్‌దే బాధ్యతని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. జైలులో అంతం చేసేందుకే చంద్రబాబును అరెస్టు చేశారనే అనుమానం ఉందన్నారు. ఈ మేరకు లోకేశ్‌ ట్వీట్‌ చేశారు.‘‘మా అనుమానాలు ఇప్పుడు బలపడుతున్నాయి. చంద్రబాబును జైల్లోనే చంపేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతకు జైల్లో హాని తలపెట్టేలా సర్కారు కుట్ర పన్నుతోంది.’’అని లోకేశ్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

6. భారత్‌తో విభేదాలు.. ఆ ‘ఐదు కళ్ల’నే నమ్ముకొన్న ట్రూడో..!

 ఖలిస్థానీ అంశంపై భారత్‌ ఆందోళనలను కెనడా (Canada) పట్టించుకోవడంలేదు సరికదా.. ఇప్పుడు అసంబద్ధంగా నిందలేస్తూ దిల్లీతో కయ్యానికి కాలు దువ్వుతోంది. ఖలిస్థానీ సానుభూతిపరుడు హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ (India) హస్తం ఉండొచ్చని సాక్షాత్తూ ఆ దేశ ప్రధానే ఆధార రహితంగా తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, ఈ వ్యవహారంలో భారత్‌ను నిందించాలని ప్రయత్నిస్తున్న కెనడా.. మద్దతు కూడగట్టుకునేందుకు మిత్ర దేశాల బృందమైన ‘ఫైవ్‌ ఐస్ ఇంటెలిజెన్స్‌ అలయన్స్‌ (Five Eyes intelligence  Alliance)’ వైపు ఆశగా చూస్తోంది. ఇంతకీ ఏంటా కూటమి..? భారత్‌-కెనడా ఉద్రిక్తతలపై ఆ దేశాలు ఏమంటున్నాయి..? మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

7. జిన్‌పింగ్‌ ఓ నియంత.. జర్మనీ మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

చైనా-జర్మనీ మధ్య మరోసారి విబేధాలు తలెత్తాయి. జర్మనీ (Germany) విదేశాంగ మంత్రి అన్నాలెనా బేర్‌బాక్‌ (Annalena Baerbock) చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ (Xi Jinping)ను నియంతగా అభివర్ణించడంతో వివాదం తలెత్తింది. గత వారం అమెరికాలో పర్యటించిన జర్మనీ విదేశాంగ మంత్రి.. మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జిన్‌పింగ్‌ను నియంతగా అభివర్ణించారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంపై స్పందిస్తూ.. ‘‘ఈ యుద్ధంలో పుతిన్‌ విజయం సాధిస్తే.. ఇతర నియంతలకు ఎలాంటి సంకేతాలను ఇస్తుంది? ముఖ్యంగా చైనా అధ్యక్షుడు షీజిన్‌పింగ్‌కు’’ అని అన్నాలెనా వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

8. విదేశాల్లోని అమెరికా అతిపెద్ద మిలటరీ స్థావరంలో డ్రగ్స్‌..!

దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు సమీపంలో ఉన్న అమెరికా సైనిక (US military)స్థావరం క్యాంప్‌ హంఫ్రీస్‌లో మాదకద్రవ్యాలు వినియోగిస్తున్నారు. ఈ స్థావరంలో దక్షిణ కొరియా (South Korea)పోలీసులు, అమెరికా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సంయుక్తంగా దాడులు నిర్వహించాయి. సైనిక మెయిల్‌, ఇతర సౌకర్యాలను వినియోగించుకుని సింథటిక్‌ గంజాయి (synthetic marijuana) వినియోగం, రవాణాకు పాల్పడుతున్నట్లు కొందరు సైనికులపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడి నిర్వహించినట్లు దక్షిణ కొరియాలోని సీనియర్ డిటెక్టివ్ చా మిన్ సియోక్‌ మీడియాకు తెలిపారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

9. ఎన్నికల ప్రచారంలో పిజ్జాలు పంచిన ట్రంప్‌..

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Donald Trump) వ్యవహార శైలి చాలా భిన్నంగా ఉంటుంది. ఆయన ఏం చేసినా.. ఏం మాట్లాడినా డిఫరెంట్‌గా ఉంటుంది. తాజాగా ఐవాలో (Iowa) అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా తన మద్దతుదారులకు పిజ్జాలు పంచారు. అందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 2024 అమెరికా (America) అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి అప్పుడే అమెరికాలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. 2024 అమెరికా అధ్యక్ష పదవి కోసం డొనాల్డ్‌ ట్రంప్‌ విస్తృతంగా ప్రచారం చేస్తోన్న సంగతి తెలిసిందే.. అయితే ఆయన బుధవారం ఐవాలోని బెటెన్‌ డార్ప్‌లోని ఓ బార్‌లో తన మద్దతుదారులకు పిజ్జాలు (pizzas) పంచారు. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

10. అటువంటి వారు కెనడాను వీడండి.. వేర్పాటువాది బెదిరింపు

కెనడా- భారత్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ (Canada India relations).. నిషేధిత సంస్థలకు చెందిన నేతల బెదిరింపు ప్రకటనలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూయార్క్‌ కేంద్రంగా పనిచేస్తున్న సిక్కు వేర్పాటువాది గుర్‌పత్వంత్‌ సింగ్‌ పన్నూ (Gurpatwant Singh Pannun) సంచలన వ్యాఖ్యలు చేశాడు. కెనడాలో నివసిస్తున్న హిందువులు దేశం విడిచి వెళ్లిపోవాలని వార్నింగ్‌ ఇవ్వడం కలకలం రేపుతోంది. మరిన్ని వివరాల కోసం క్లిక్‌ చేయండి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని