Telangana news: నాణ్యతలేని భోజనం.. 32 మంది విద్యార్థినులకు అస్వస్థత

నాణ్యతలేని భోజనం తిని 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండలో చోటు చేసుకుంది.

Updated : 26 Dec 2022 17:17 IST

నేరడిగొండ: నాణ్యతలేని భోజనం తిని ఆదిలాబాద్‌ జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ గురుకుల పాఠశాలకు చెందిన 32 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో వారిని ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు.. వివరాల్లోకి వెళితే.. నాణ్యత లేని భోజనం పెడుతున్నారని ఆరోపిస్తూ ఆదివారం ఉదయం విద్యార్థినులు ఆందోళనకు దిగారు. రహదారిపైకి వచ్చి ఆందోళన చేస్తారనే సమాచారంతో అక్కడి సిబ్బంది గేటు వేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థినులు పాఠశాల భవనంపై ఎక్కి ఆందోళనకు దిగారు. స్పందించిన సిబ్బంది వెంటనే గేట్లు తెరిచారు. దీంతో విద్యార్థినులు పాఠశాల గేటు వద్దకు వచ్చి ఆందోళన కొనసాగించారు. విషయం తెలుసుకున్న పాఠశాల ప్రత్యేక అధికారిణి జయశ్రీ విద్యార్థినులతో మాట్లాడారు. నాణ్యమైన భోజనం అందేలా చూస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థులు తమ ఆందోళన విరమించారు. మధ్యాహ్నం భోజనం చేసిన తరువాత 11 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వారిని నేరడిగొండ పీహెచ్‌సీ తరలించి చికిత్స చేశారు. అందులో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో చికిత్స నిమిత్తం ఆదిలాబాద్ రిమ్స్‌కు తరలించారు. చికిత్స అనంతరం అస్వస్థతకు గురయిన విద్యార్థినుల స్థితి మెరుగుపడటంతో పాఠశాలకు తరలించారు.

అనంతరం విద్యార్థినులు రాత్రి భోజనం చేశారు. మరోసారి 25 మంది అస్వస్థతకు గురయ్యారు. వారిని నేరడిగొండ పీహెచ్‌సీకి తరలించారు. ఆదిలాబాద్‌ రిమ్స్‌కు తరలించాల్సిందిగా వైద్యులు సూచించడంతో ఇచ్చోడ నుంచి మరో అంబులెన్స్‌ను రప్పించి అందరినీ రిమ్స్‌కు తరలించారు. ఇవాళ మరో ఏడుగురు అస్వస్థతకు గురి కాగా.. వారిని సైతం రిమ్స్‌కు పంపించారు. విద్యార్థినుల అస్వస్థత గురించి సమాచారం అందుకున్న డీఈవో ప్రణీత పాఠశాలను సందర్శించారు. వంటగది, సామగ్రి, భోజనం వండుతున్న తీరు గురించి ఆరా తీశారు. భోజనం తయారు చేసే కార్మికులందరినీ తొలగిస్తున్నట్లు ప్రకటించారు.ఎస్వోను కూడా తొలగించాలని విద్యార్థినులు పట్టుబట్టడంతో ఆమెపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు