vaccination: భారత్‌లో 15కోట్లు దాటింది

భారత్‌లో ఇప్పటివరకూ 15 కోట్ల మందికి వ్యాక్సిన్‌ ఇచ్చినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ గురువారం తెలిపింది

Updated : 29 Apr 2021 16:27 IST

న్యూదిల్లీ: ప్రస్తుతం కరోనా సెకండ్‌ వేవ్‌తో యావత్‌ భారతదేశం వణికిపోతోంది. మరోవైపు దేశంలో వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నెమ్మదిగా కొనసాగుతోంది. ప్రస్తుతం 45ఏళ్లు దాటిన వారు వ్యాక్సిన్‌ తీసుకునేందుకు అర్హులు కాగా, మే 1వ తేదీ నుంచి 18ఏళ్లు దాటిన వారు కూడా వ్యాక్సిన్‌ తీసుకోవచ్చు. ఈ నేపథ్యంలో భారత్‌లో ఇప్పటివరకూ 15కోట్ల వ్యాక్సిన్‌ డోస్‌లను ఇచ్చినట్లు  గురువారం కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఏప్రిల్‌ 28వ తేదీ నాటికి మొత్తం 15,00,20,648 వ్యాక్సిన్‌ డోస్‌లు ఇచ్చారు. ఇందులో 93,67,520మంది హెల్త్‌ వర్కర్లకు మొదటి డోస్‌, 61,47,918మందికి సెకండ్‌ డోస్‌ కూడా ఇచ్చారు. ఇక 1,23,19,903 మంది ఫ్రంట్‌ లైన్‌ వర్కర్లకు ఫస్ట్‌ డోస్‌ ఇవ్వగా, 66,12,789మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు.

60ఏళ్లు దాటిన సుమారు 5కోట్లమంది మొదటి డోస్‌, 98 లక్షల మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. అదే విధంగా 45-60 వయసు కలిగిన 5 కోట్లమందికి పైగా ఫస్ట్‌ డోస్‌ తీసుకోగా, 31 లక్షల మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. మహారాష్ట్ర, రాజస్థాన్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, గుజరాత్‌, పశ్చిమబెంగాల్‌, కర్ణాటక, మధ్యప్రదేశ్‌, కేరళ, బిహార్‌, ఆంధ్రప్రదేశ్‌లలో అత్యధికంగా వ్యాక్సిన్‌ తీసుకున్నారు. వ్యాక్సినేషన్‌ డ్రైవ్‌లో భాగంగా ఏప్రిల్‌ 28న ఒక్కరోజే 21లక్షలమందికి వ్యాక్సిన్‌ ఇచ్చారు. మరోవైపు దేశంలో రోజు రోజుకీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. మొత్తం కేసుల్లో 72.20శాతం కేసులు పది రాష్ట్రాల్లోనే నమోదవడం గమనార్హం. మహారాష్ట్ర, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీలలో అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా, ఆ తర్వాత కర్ణాటక, కేరళ,ఛత్తీస్‌గఢ్‌, పశ్చిమ బెంగాల్‌, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌లు ఉన్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు