toughest exams: ప్రపంచంలో అత్యంత కఠినమైన పరీక్షలివీ..!
ఉన్నత విద్య చదవాలన్నా.. ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్నా ముందుగా ప్రవేశ/పోటీ పరీక్షలు రాయాల్సిందే. అందులో అత్యుత్తమ మార్కులు సాధించినవారే తమ కలను సాకారం చేసుకోగలరు.
ఉన్నత విద్య చదవాలన్నా.. ఏదైనా ఉద్యోగం సంపాదించాలన్నా ముందుగా ప్రవేశ/పోటీ పరీక్షలు రాయాల్సిందే. అందులో అత్యుత్తమ మార్కులు సాధించినవారే తమ కలను సాకారం చేసుకోగలరు. ప్రపంచవ్యాప్తంగా వివిధ కోర్సులు, ఉద్యోగాలకు ఎన్నో ప్రవేశ పరీక్షలు ఉన్నాయి. అయితే వాటిలో అత్యంత కఠినమైన టాప్ 10 పరీక్షలేవో తెలుసుకుందామా!
మాస్టర్ సొమెలియర్ డిప్లొమా పరీక్ష (యూకే)
మద్యం నాణ్యతను పరిశీలించడానికి ప్రత్యేకంగా నిపుణులు ఉంటారు. ఇలాంటి వారిని తయారు చేసేందుకు యూకేలో కోర్ట్ ఆఫ్ మాస్టర్ సొమెలియర్స్ అనే విద్యాసంస్థ 1977లో ఏర్పాటైంది. ఇందులో మాస్టర్ సొమెలియర్ డిప్లొమా చేయాలంటే పరీక్ష రాయాల్సి ఉంటుంది. యూకే కేంద్రంగా నడిచే ఈ విద్యాసంస్థ.. ప్రపంచవ్యాప్తంగా అభ్యర్థులను ఆహ్వానిస్తోంది. ఇందులో వైన్‌కు సంబంధించి మూడు (థియరీ, ప్రాక్టికల్స్, టెస్టింగ్) దశల్లో పరీక్ష ఉంటుంది.
థియరీ విభాగంలో వైన్‌కోసం సేకరించే ద్రాక్ష పండ్లు ప్రపంచంలో ఎక్కడెక్కడ లభిస్తాయి?వాటిలో ఎన్ని రకాలుంటాయి?మద్యంలో రకాలు, వాటి నిల్వలు, మద్యంపై ఉన్న అంతర్జాతీయ చట్టాలు, దాని తయారీ విధానాలు తదితర అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ప్రాక్టికల్ విభాగంలో అభ్యర్థులకు పని అప్పగిస్తారు. వినియోగదారులకు మద్యం ఏ విధంగా అందించాలి? వారి అభిరుచికి తగ్గట్టు ఎలాంటి మద్యాన్ని సిఫార్సు చేయాలి?ఆర్డర్ చేసిన మద్యాన్ని ఏ విధంగా తయారు చేయాలి.. తదితర అంశాలను పరిశీలిస్తారు. ఇక టెస్టింగ్ విభాగంలో నిర్వాహకులు ఆరు రకాల మద్యాన్ని అభ్యర్థి ముందు ఉంచుతారు. వాటిని ఎక్కడ, ఎప్పుడు తయారు చేశారు? ఏ ద్రాక్ష రకాన్ని వాడారు? తదితర పూర్తి వివరాలు చెప్పాల్సి ఉంటుంది.
గత 40 ఏళ్లుగా నిర్వహిస్తోన్న ఈ పరీక్షకు కొన్ని లక్షల మంది హాజరయ్యారు. కానీ, ఇప్పటి వరకూ కేవలం 229 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు.
యూపీఎస్సీ (భారత్)
భారతదేశంలో కేంద్ర ప్రభుత్వంలోని వివిధ ఉద్యోగాలను భర్తీ చేయడం కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) ఉద్యోగ ఖాళీలను బట్టి ఏటా పోటీ పరీక్షలు నిర్వహిస్తుంటుంది. ఈ పరీక్ష మూడు దశలుగా ఉంటుంది. మొదటి దశలో లక్ష్యాత్మక ప్రశ్నలుంటాయి. ఇందులో అర్హత సాధిస్తే రాతపరీక్ష ఉంటుంది. అందులోనూ ఉత్తీర్ణులైతే వ్యక్తిగత ఇంటర్వ్యూ ఉంటుంది. ఈ మూడు దశలు దాటినవారికే ఉద్యోగం దక్కుతుంది. ఏటా లక్షల మంది ఈ పోటీ పరీక్షలు రాస్తున్నారు. కానీ 0.1 - 0.4 శాతం మంది మాత్రమే టాప్ ర్యాంక్‌లో ఉత్తీర్ణులై ఉద్యోగం పొందుతున్నారు.
గోకావ్ (చైనా)
ఏటా చైనా వ్యాప్తంగా ఒకేసారి నిర్వహించే నేషనల్ కాలేజ్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్‌ను గావ్‌కోవ్ అని పిలుస్తుంటారు. అక్కడ డిగ్రీ చదవాలంటే హైస్కూల్ విద్య పూర్తి చేసుకున్న ప్రతి విద్యార్థి ఈ పరీక్ష రాయాల్సిందే. చైనీస్ భాష, గణితశాస్త్రం కచ్చితంగా పరీక్షలో భాగంగా ఉంటాయి. 9 గంటలు ఉండే పరీక్షను రెండు నుంచి మూడు రోజులపాటు నిర్వహిస్తారు. ప్రాంతాలు, వసతులను బట్టి మరో రోజు పొడిగించుకునే అవకాశముంది. ఇందులో ఉత్తీర్ణులైన విద్యార్థులు వారికి నచ్చిన డిగ్రీ కోర్సులో చేరవచ్చు. 1977లో తొలిసారి ఈ పరీక్షలు నిర్వహించారు. మొదట్లో వీటిలో ఉత్తీర్ణత శాతం చాలా తక్కువగా ఉండేది. 1998 వరకు 40శాతం లోపే ఉండేది. ఆ తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తోంది. అయితే చైనాలోని టాప్ యూనివర్సిటీల్లో సీటు సంపాదించేవారి సంఖ్య కేవలం 0.2శాతమే.
జేఈఈ - అడ్వాన్స్‌డ్ (భారత్)
మనదేశంలో అత్యుత్తమ ఇంజినీరింగ్ విద్యాసంస్థగా చెప్పుకునే ఐఐటీ(ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ప్రవేశం కోసం ఇంటర్ విద్యార్థులు జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్)- అడ్వాన్స్‌డ్ పరీక్ష రాయాల్సి ఉంటుంది. దేశంలో 23 చోట్ల ఐఐటీ కాలేజీలు ఉన్నాయి. వీటిలో చదివిన విద్యార్థులకు ప్రముఖ కంపెనీల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలు దక్కుతుంటాయి. అందుకే ఇంజినీరింగ్ చదవాలనుకునే ప్రతి విద్యార్థి ఐఐటీలో సీటు కోసం జేఈఈ అడ్వాన్స్ పరీక్షకు సన్నద్ధమవుతాడు. అయితే, ఏటా లక్షల మంది ఈ పరీక్ష రాస్తే.. కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఐఐటీ ఇంజినీరింగ్ సీటు సంపాదిస్తారు.
ఆల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ ఎగ్జామ్ (ఇంగ్లాండ్)
ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ ఈ ఆల్ సోల్స్ ప్రైజ్ ఫెలోషిప్ పరీక్షను నిర్వహిస్తుంటుంది. 1878 నుంచి నిర్వహిస్తున్న ఈ పరీక్ష ప్రపంచంలోనే అత్యంత కఠినమైన పరీక్షల్లో ఒకటిగా నిలుస్తోంది. డిగ్రీ ఉత్తీర్ణులైన, ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఎంతో కఠినంగా ఉండే ఈ పరీక్షకు భయపడి చాలా తక్కువ మందే దరఖాస్తు చేసుకుంటుంటారు. దీంతో ఏటా ఈ పరీక్షకు హాజరయ్యేవారి సంఖ్య వందలోపే ఉంటుంది. ఇందులో నాలుగు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు మూడు గంటల చొప్పున సమయం ఇస్తారు. అయితే ఏటా ఈ పరీక్షలు రాసిన వారిలో కేవలం ఇద్దరు మాత్రమే ఫెలోషిప్‌కి ఎంపికవుతున్నారు. 2010కి ముందు వరకు ఈ పరీక్షలో మరో పేపర్ ఉండేది. అందులో ఇచ్చిన ఒక పదం మీద సుదీర్ఘమైన వ్యాసం రాయాల్సి వచ్చేది.
సీఏ (భారత్)
ఉన్నతమైన వృత్తుల్లో చార్టెర్డ్ అకౌంటెంట్(సీఏ) ఒకటి. భారత్‌లో సీఏ కావాలంటే మూడు దశల పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మొదట ప్రవేశ పరీక్ష(సీపీటీ) ఉంటుంది. ఇందులో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఒకవేళ కామర్స్‌లో డిగ్రీ లేదా పీజీ ఉంటే నేరుగా ఐపీసీ పరీక్ష రాయొచ్చు. ఆ తర్వాత కొన్నాళ్లు ఆర్టికల్‌షిప్ చేసి సీఏ ఫైనల్ పరీక్ష రాయాలి. దాంట్లోనూ ఉత్తీర్ణులైతే అధికారికంగా చార్టెర్డ్ అకౌంటెంట్ అయినట్లు. అయితే, ఈ పరీక్షలు చాలా కఠినంగా ఉంటాయి. అందుకే చాలామంది ప్రయత్నం చేసి చేసి, ఓపిక నశించి తప్పుకుంటారు. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత కేవలం 10శాతం మాత్రమే ఉంటుంది.
చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ (అమెరికా)
చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ అనేది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రొఫెషనల్ సర్టిఫికెట్ ప్రోగ్రాం. అమెరికాకు చెందిన సీఎఫ్‌ఏ(చార్టెర్డ్ ఫైనాన్షియల్ అనలిస్ట్) ఇన్‌స్టిట్యూట్ ఈ కోర్సును అందిస్తోంది. అంతర్జాతీయంగా అకౌంట్స్, ఫైనాన్స్, ఎకనామిక్స్, బిజినెస్ కోర్సులు పూర్తి చేసినవారు ఈ పీజీ సర్టిఫికెట్ కోర్సు చేయొచ్చు. దీన్ని పూర్తి చేసినవారికి ఇన్వెస్ట్‌మెంట్ మేనేజ్‌మెంట్, రిస్క్ లేదా అసెట్ మేనేజ్‌మెంట్ తదితర రంగాల్లో ఎగ్జిక్యూటివ్ పోస్టులు లభిస్తాయి. అయితే ఈ కోర్సులో ప్రవేశం కోసం నిర్వహించే పరీక్ష చాలా కఠినంగా ఉంటుంది. పరీక్ష రాసిన వారిలో కేవలం 20శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులవుతారు.
మెన్సా (ప్రపంచవ్యాప్తంగా)
మెన్సా అనేది ఒక కమ్యూనిటీ. ప్రపంచవ్యాప్తంగా ఐక్యూ (ఇంటలిజెన్స్ కోషంట్ - ప్రజ్ఞాసూచి) ఎక్కువ ఉన్నవారు ఇందులో సభ్యులుగా ఉంటారు. తద్వారా ప్రపంచంలో అనేక విషయాలపై తమ అభిప్రాయాలను వ్యక్తపరచొచ్చు. వీరు నిర్వహించే పరీక్షలో 98శాతంతో ఉత్తీర్ణత సాధిస్తే మెన్సా కమ్యూనిటీలో సభ్యత్వం లభిస్తుంది. 1946లో ఇంగ్లాండ్‌లో రోనాల్డ్ బెర్రిల్ అనే న్యాయవాది దీన్ని స్థాపించారు. ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాల్లో మెన్సా శాఖలున్నాయి. భారత్‌లోనూ వివిధ నగరాల్లో శాఖలు ఉన్నాయి. ఈ కమ్యూనిటీలో మొత్తంగా 1.45లక్షల మంది సభ్యులున్నారు.
ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్ (భారత్)
యూపీఎస్సీ ప్రత్యేకంగా నిర్వహించే పరీక్ష.. ఇండియన్ ఇంజినీరింగ్ సర్వీసెస్(ఐఈఎస్). కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతులపై పెద్ద మొత్తంలో ఖర్చు చేస్తుంటుంది. ఈ విభాగంలో కీలక పాత్ర పోషించే ఇంజినీర్లను నియమించుకోవడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు. ఇంజినీరింగ్ పూర్తి చేసినవారు ఈ పరీక్షకు అర్హులు. ప్రిలిమినరీ, మెయిన్, పర్సనాలిటీ టెస్ట్ అని మూడు దశల్లో ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు భారీ సంఖ్యలో ఉన్నా.. పోస్టులు మాత్రం చాలా తక్కువగా ఉంటాయి. పరీక్ష కూడా చాలా కఠినంగా ఉండటంతో ఎంపికయ్యే వారి సంఖ్య కూడా తక్కువే.
సిస్కో సర్టిఫైడ్ ఇంటర్నెట్ వర్కింగ్ ఎక్స్‌పర్ట్(అమెరికా)
సిస్కో కంపెనీ.. తమ సంస్థలో నెట్‌వర్క్ ఇంజినీర్లను నియమించుకోవడం కోసం ఈ పరీక్ష నిర్వహిస్తుంటుంది. ఇది రెండు దశల్లో.. ఆరు భాగాలుగా ఉంటుంది. ప్రాక్టికల్స్ పరీక్ష 8 గంటలపాటు కొనసాగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిర్వహించే ఈ పరీక్షలో కేవలం 1శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధిస్తారని కంపెనీ చెబుతోంది.
ఇవే కాకుండా అమెరికా, కెనడా, కరేబియన్ ఐలాండ్స్, ఆస్ట్రేలియా దేశాల్లో వైద్యకళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎంక్యాట్(మెడికల్ కాలేజ్ అడ్మిషన్ టెస్ట్), యూకేలోని లా యూనివర్సిటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌న్యాట్(లా నేషనల్ అప్టిట్యూడ్ టెస్ట్), యూఎస్, ఆస్ట్రేలియా, కెనడా తదితర దేశాల్లో న్యాయవిద్యలో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్‌సాట్(లా స్కూల్ అడ్మిషన్ టెస్ట్), విదేశాల్లో ముఖ్యంగా అమెరికా, కెనడాల్లోని యూనివర్సిటీల్లో అడ్మిషన్‌లో భాగంగా ముందుగా విద్యార్థులు రాసే జీఆర్‌ఈ(గ్రాడ్యుయేట్ రికార్డ్ ఎగ్జామినేషన్), భారత్‌లో ఇంజినీరింగ్‌లో పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించే గేట్(గ్రాడ్యుయేట్ అప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజినీరింగ్) పరీక్షలు సైతం కఠినంగా ఉంటాయి. వీటిల్లో అత్యధికంగా కఠినమైన పరీక్షలు భారత్‌లోనే ఉండటం గమనార్హం.
- ఇంటర్నెట్ డెస్క్
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
BCCI: టాప్ కేటగిరిలోకి రవీంద్ర జడేజా: వార్షిక వేతన కాంట్రాక్ట్‌లను ప్రకటించిన బీసీసీఐ
-
Politics News
TDP: తెదేపా ఆవిర్భావ సభకు పెద్ద ఎత్తున సన్నాహాలు
-
Politics News
Rahul Gandhi: రాహుల్‌పై అనర్హత వేటు.. పార్లమెంట్లో నిరసనలకు కాంగ్రెస్ పిలుపు
-
Sports News
Dinesh Karthik: టీమ్ఇండియాలో అతడే కీలక ప్లేయర్.. కోహ్లీ, రోహిత్‌కు నో ఛాన్స్
-
India News
Sarus Crane: కొంగతో అనుబంధం.. కాపాడిన వ్యక్తిపై కేసు..!
-
India News
Fact Check: ₹239 ఉచిత రీఛార్జ్ పేరుతో వాట్సాప్‌లో నకిలీ మెసేజ్!