కరోనా కాలంలో ‘థర్మోమీటర్‌తో ఫొటో’ ట్రెండ్‌..!

సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటుంది. మొన్నటి వరకు కరోనాకు సంబంధించిన వార్తలే ఉండేవి. ఇప్పుడిప్పుడే కరోనా దాటి.. నెటిజన్లు ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాలో ఒక కొత్త ట్రెండ్‌ మొదలైంది. అనేక

Published : 04 Nov 2020 09:33 IST


(ఫొటో: జాన్‌మూరె ఇన్‌స్టా)

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌ మీడియాలో నిత్యం ఏదో ఒక అంశం ట్రెండింగ్‌లో ఉంటుంది. మొన్నటి వరకు కరోనాకు సంబంధించిన వార్తలే ఉండేవి. ఇప్పుడిప్పుడే కరోనా దాటి.. నెటిజన్లు ముందుకు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల అమెరికాలో ఒక కొత్త ట్రెండ్‌ మొదలైంది. అనేక మంది పర్యటకులు నెవాడాలో ఏర్పాటు చేసిన ఓ థర్మోమీటర్‌ వద్ద నిల్చొని ఫొటో దిగి సోషల్‌మీడియాలో పోస్టు చేస్తున్నారు. ఎందుకంటారా..? అయితే ఇది చదవండి..

కరోనా వైరస్‌ ప్రపంచాన్ని విచిత్ర పరిస్థితుల్లోకి నెట్టేసింది. కొన్ని నెలలపాటు ఇంట్లో నుంచి కాలు బయటపట్టలేని పరిస్థితి కల్పించింది. ప్రస్తుతం కరోనా భయమున్నా.. సాధారణ జీవితాన్ని కొనసాగించేందుకు ప్రజలు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ఎక్కడికైనా వెళ్తే బాగుండు అనుకుంటున్నారు. అయితే, ఇటీవల యూఎస్‌లోని నెవాడాలో అత్యంత వేడి ప్రాంతమైన డెత్‌ వ్యాలీ నేషనల్‌ పార్కులో ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యధిక ఉష్ణోగ్రత(55 డిగ్రీలు)నమోదైందట. అక్కడి ఫుర్నేస్‌ క్రీక్‌ విసిటర్‌ సెంటర్‌ వద్ద ఏర్పాటు చేసిన అతిపెద్ద థర్మోమీటర్‌లో ఈ ఉష్ణోగ్రతను చూపిస్తున్నారు. నిజానికి ఈ ప్రాంతం అత్యంత వేడి ప్రాంతం. అంత వేడిని తట్టుకోగల వారే ఇక్కడికి వస్తుంటారు. అలా ఏటా కనీసం ఐదు లక్షల మంది వరకు ఈ డెత్‌వ్యాలీని సందర్శిస్తారట. కానీ, కరోనా కారణంగా పర్యటకుల రాక సన్నగిల్లింది. అయితే, ఇటీవల ఎవరు ప్రారంభించారో తెలియదు కానీ, ఈ థర్మోమీటర్‌ వద్ద ఫొటో దిగి సోషల్‌మీడియాలో పోస్టు చేయడం ట్రెండ్‌గా మారింది. అమెరికా వ్యాప్తంగా వేలమంది పర్యటకులు కార్లలో ఇక్కడికి వచ్చి ఈ థర్మోమీటర్‌తో ఫొటోలు దిగుతున్నారు. దీంతో మళ్లీ అక్కడికి పర్యటకుల రాక తిరిగి ప్రారంభమైనట్లైంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని