Hyderabad: భారత్‌ జోడోయాత్ర.. నగర శివారులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర ఉత్సాహంగా సాగుతుండగా.. మరో వైపు నగర శివారులో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి.

Updated : 02 Nov 2022 20:07 IST

పటాన్‌చెరు (హైదరాబాద్‌) : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ చేపట్టిన భారత్‌ జోడోయాత్ర ఉత్సాహంగా సాగుతోంది. యాత్రలో భాగంగా ఈరోజు సాయంత్రం లింగంపల్లి చౌరస్తా నుంచి ముత్తంగి వరకు భారీ కాన్వాయ్‌ ఓవైపు ప్రయాణిస్తుండగా.. మరో వైపు సాధారణ వాహనాలను దారి మళ్లించి వన్‌వేలో రెండు వైపులా వెళ్లే విధంగా ట్రాఫిక్‌ పోలీసులు ఏర్పాటు  చేశారు. ఇక్రిశాట్‌ దాటిన తర్వాత సాయంత్ర వేళ బాలుడితో రాహుల్‌గాంధీ క్రికెట్‌ ఆడారు. ఆ సందర్భంలో కొంత సమయం ట్రాఫిక్‌ ఆగింది. అనంతరం పటాన్‌చెరు ఆనంద్‌భవన్‌ హోటల్లో 20 నిమిషాల పాటు రాహుల్‌ సేద తీరారు. అప్పుడు కూడా కార్యకర్తల రద్దీతో రెండు వైపులా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అనంతరం రాహుల్‌గాంధీ యాత్ర మొదలు పెట్టినప్పటికీ రహదారికి రెండు వైపులా రద్దీ కొనసాగింది. అనంతరం ముత్తంగిలో రాహుల్‌ కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించడంతో ముత్తంగి నుంచి పటాన్‌చెరు వైపు దాదాపు 5 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. ట్రాఫిక్‌ను నియంత్రించలేక పోలీసులు కూడా చేతులెత్తేశారు.

ప్రయాణికులతో కిక్కిరిసిన మెట్రో రైళ్లు..

భారత్‌ జోడో యాత్ర నేపథ్యంలో బాలానగర్‌ నుంచి మియాపూర్‌ వరకు పోలీసులు ట్రాఫిక్‌ ఆంక్షలు విధించడంతో ప్రయాణికులు మెట్రోను ఆశ్రయించారు. కార్యాలయాలకు వెళ్లిన ఉద్యోగులు, సాధారణ ప్రయాణికుల్లో  ఎక్కువశాతం మంది మెట్రోలో ప్రయాణించడంతో కూకట్‌పల్లి, మియాపూర్‌ స్టేషన్‌లలో రద్దీ ఏర్పడింది. టికెట్‌ కౌంటర్ల వద్ద ప్రయాణికులు గుమిగూడారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని