Telangana News: కేంద్రం ఎందుకు ఇలా చేస్తోందో అర్థం కావట్లేదు: సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో

Updated : 19 Aug 2022 22:56 IST

హైదరాబాద్‌: కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను ఇవాళ డ్రా చేయలేకపోయామన్నారు. కేంద్రం ఇలా ఎందుకు వ్యవహరిస్తుందో అర్థం కావడం లేదన్నారు. జనరేటర్‌, డిస్కంలకు పవర్‌ పర్చేజ్‌ అగ్రిమెంట్‌ ఉంటుందని, ఇది వారి ఒప్పందంతో అమ్ముకోవచ్చని సీఎండీ పేర్కొన్నారు.

రూ.1,360కోట్లు విద్యుత్‌శాఖ చెల్లించినప్పటికీ ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. చెల్లింపులు చేసినా ఎందుకు ఇలా చేశారో అర్థం కావడం లేదన్నారు. పవర్‌ ఎక్స్‌ఛేంజ్‌పై ఇవాళ .. సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారని సీఎండీ తెలిపారు. ప్రజలకు, వినియోగదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేయాలని సీఎం కేసీఆర్‌ సూచించారని వెల్లడించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా విద్యుత్‌ సరఫరా చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో వర్షాలు బాగా పడటంతో జల విద్యుత్‌ను పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేస్తున్నామన్నారు. థర్మల్‌, హైడల్‌, సోలార్‌ పవర్‌ను అవకాశం ఉన్నంత వరకు ఉత్పత్తి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఇవాళ 12,214 మెగావాట్ల విద్యుత్‌ డిమాండ్‌ వచ్చినా ఎక్కడా కూడా సరఫరాకు అంతరాయం లేకుండా చేశామన్నారు. రైతన్నలు, ప్రజలు, వినియోగదారులు ఎక్కడైనా విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఏర్పడితే సహకరించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు. హైకోర్టు స్టే ఉన్నప్పటికీ ఇలా చేయడం బాధాకరమన్నారు. ఉదయం, సాయంత్రం ఎక్కువగా రైతులు పంపుసెట్లు ఆన్‌ చేస్తారు కాబట్టీ ఆసమయంలో విద్యుత్‌ డిమాండ్‌ ఎక్కువగా ఉంటుందన్నారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కారం అవుతుందని, అప్పటి వరకు రైతులు సహకరించాలని సీఎండీ విజ్ఞప్తి చేశారు. 

Read latest General News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts