Warangal: ప్రీతి ఆత్మహత్య ఘటన.. హెచ్‌వోడీ నాగార్జునరెడ్డిపై బదిలీ వేటు

ప్రీతి ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కాకతీయ మెడికల్‌ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ నాగార్జునరెడ్డిపై బదిలీ వేటు పడింది.

Updated : 02 Mar 2023 20:07 IST

ఎంజీఎం ఆసుపత్రి(వరంగల్‌): కాకతీయ మెడికల్‌ కళాశాల మొదటి సంవత్సరం అనస్థీషియా విద్యార్థిని ఆత్మహత్య ఘటన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ప్రీతిని వేధించిన సీనియర్‌ విద్యార్థి సైఫ్‌ను మందలించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న ఆరోపణలపై ఇటీవల ఎంజీఎంలో త్రిసభ్య కమిటీ విచారణ జరిపింది. కమిటీ నివేదిక  ఆధారంగా అనస్థీషియా విభాగం హెచ్‌వోడీ డాక్టర్‌ నాగార్జునరెడ్డిపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆయన్ను భూపాలపల్లి జిల్లాలో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్‌ కళాశాల అనస్థీషియా విభాగం హెచ్‌వోడీగా బదిలీ చేస్తూ వైద్యారోగ్య శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ రిజ్వీ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

ప్రీతి కుటుంబ సభ్యులు, వివిధ ప్రజాసంఘాలు హెచ్‌వోడీ నాగార్జున రెడ్డి తప్పిదంపైనే మొదటి నుంచి ప్రశ్నిస్తున్నారు. నాగార్జున్‌రెడ్డితో పాటు కేఎంసీ ప్రిన్సిపల్‌ డా.మోహన్‌దాస్‌, ఎంజీఎం సూపరింటెండెంట్‌ డా.చంద్రశేఖర్‌లను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఈక్రమంలో అనస్థీషియా హెచ్‌వోడీ నాగార్జునరెడ్డి ఒక్కరిపై మాత్రమే బదిలీ వేటు వేయడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని