
‘జై భీమ్’ సినిమాను తలపిస్తున్న పోలీసుల తీరు !
దొంగతనం నెపంతో యువకుడిని చితకబాదిన పోలీసులు
రామోజీతండా గ్రామస్థుల ఆందోళన
ఆత్మకూర్: సూర్యాపేట జిల్లా ఆత్మకూరు-ఎస్ పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిచ్చేలా మారింది. రామోజీ తండాకు చెందిన ఓ యువకుడిని దొంగతనం నెపంతో చావ బాదారని గిరిజనులు ఆందోళనకు దిగారు. వెంటనే పోలీసులపై చర్యలు తీసుకోవాలని నినదించారు. నడవలేని స్థితిలో ఉన్న యువకుడితో పోలీస్‌స్టేషన్‌ను తండా వాసులు ముట్టడించగా.. వైద్యులు పరీక్షిస్తే అసలు నిజం తెలుస్తుందంటూ పోలీసులు అక్కడి నుంచి సీన్‌ను ఆస్పత్రికి మార్చి శాంతింపజేశారు.
ఇటీవల సూర్య నటించిన జైభీమ్ సినిమా సంచలనం రేపింది. విచారణ పేరుతో పోలీసులు చిత్ర హింసలు పెడతారన్న దృశ్యాలు అందర్నీ కదిలించాయి. చేయని నేరానికి అమాయకులైన గిరజనులను కేసుల్లో ఇరికించి, పోలీసులు ఎలా చావగొడతారనే కథాంశంతో వచ్చిన ఈ సినిమా చూసి చలించని వాళ్లుండరు. లాకప్‌డెత్ చేసి దాన్నుంచి తప్పించుకునేందుకు పోలీసులు తప్పుడు సాక్ష్యాలు సృష్టించి దొరికిపోయిన తీరు కళ్లకు కడుతుంది. జై భీమ్ చిత్రం తరహాలోనే అడ్డగోడూరు పోలీస్‌స్టేషన్‌లో మరియమ్మ అనే మహిళలను లాకప్‌డెత్ చేశారని సామాజిక మాధ్యమాల్లోనూ పోస్టులు వైరల్ అయ్యాయి. ఈ కేసు విచారణ జరుపుతున్న హైకోర్టు సైతం నిన్ననే కీలకమైన వ్యాఖ్యలు చేసింది. మరియమ్మ మృతి కేసు సీబీఐకి అప్పగించదగినదని వ్యాఖ్యానించింది. ఇంత జరుగుతండగానే రాష్ట్రంలో మరో వివాదాస్పద ఘటన జరగడం తీవ్ర కలకలం రేపుతోంది.
ఆత్మకూరు మండల పరిధిలోని ఏకూరులో ఏడు రోజుల క్రితం దొంగతనం జరిగింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గ్రామంలోని సీసీకెమెరా ఫుటేజీ పరిశీలించారు.అందులో ఉన్న వారిని విచారించారు. రామోజీ తండాకు చెందిన ధరావత్ నవీన్ సీసీకెమెరాల్లో రికార్డయిన దృశ్యాల్లో కనిపించారు. నవీన్‌ను విచారించిన పోలీసులు అతడు చెప్పిన సమాచారం అధారంగా మరో నలుగుర్ని అదుపులోకి తీసుకొని చితకబాదారనే ఆరోపణలు ఉన్నాయి. నలుగురిలో ధరావత్ వీరశేఖర్ అనే యువకుడు పోలీసు దెబ్బలకు తట్టుకోలేక స్పృహ కోల్పోయాడు. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచిన పోలీసులు వీరశేఖర్‌ను తీసుకెళ్లాలని సమాచారమిచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. పోలీస్‌స్టేషన్ వద్ద స్పృహతప్పి పడి ఉన్న వీరశేఖర్‌ను చూసి ఆగ్రహించారు. తండా వాసులంతా స్టేషన్ ఎదుట ధర్నాకు దిగగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
జై భీమ్ సినిమాను తలపిస్తున్న ఈ ఘటనలో పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు తావిస్తోంది. సినిమాలో దొంగతనం నెపంతో గిరిజనులను తీసుకొచ్చిన పోలీసులు చిత్ర హింసలు పెడతారు. వాటిని తట్టుకోలేక ఒకరు ప్రాణాలు కోల్పోతారు. లాకప్‌డెత్ కావడంతో ఎలా తప్పించుకోవాలని పోలీసులు నిందితుడు పారిపోయాడని కథ అల్లుతారు. ఆత్మకూరు ఘటనలోనూ పోలీసులు తీసుకొచ్చి కొట్టి అసలేమీ తెలియదని చెబుతున్నారని బాధితులు వాపోతున్నారు.
నడవలేని స్థితిలో ఉన్న బాధితుడు వీరశేఖర్‌ను చేతులపై తీసుకొచ్చి పోలీస్‌స్టేషన్ ఎదుట రామోజీతండా వాసులు ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు సీన్‌ను ఆస్పత్రికి మార్చారు. వైద్యులు పరీక్షిస్తే అసలు కొట్టామో లేదో తేలుతుందంటూ ఆందోళనను శాంతింప జేశారు. బాధితుడిని స్టేషన్ నుంచి జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై ఉన్నతాధికారులు విచారణ జరుపుతున్నారు. మరియమ్మ లాకప్‌డెత్ కేసుపై హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో ఓ గిరిజన యువకుడిపట్ల పోలీసులు ప్రవర్తించిన తీరు రాష్ట్రంలో సంచలనంగా మారింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.