Casino: ఈడీ విచారణకు ఎమ్మెల్సీ ఎల్‌ రమణ.. అస్వస్థతతో ఆస్పత్రికి తరలింపు

క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. క్యాసినో విషయంలో ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం ఎల్‌ రమణ హాజరయ్యారు.

Updated : 18 Nov 2022 14:21 IST

హైదరాబాద్‌: క్యాసినో వ్యవహారంలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) విచారణ కొనసాగుతోంది. క్యాసినో విషయంలో ఇప్పటికే ఫెమా నిబంధనల ఉల్లంఘన కింద ఈడీ అధికారులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. దర్యాప్తులో భాగంగా విచారణకు హాజరు కావాలని తెరాస ఎమ్మెల్సీ ఎల్‌ రమణకు గతంలోనే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. క్యాసినో ఆడేందుకు ఎల్ రమణ విదేశాలకు వెళ్లినట్లు అభియోగాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈడీ నోటీసులు జారీ చేయడంతో ఇవాళ బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయానికి విచారణ నిమిత్తం రమణ హాజరయ్యారు. దర్యాప్తులో భాగంగా ఇప్పటికే అనంతపురానికి చెందిన వైకాపా నేత, మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి, తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ సోదరులు మహేష్‌యాదవ్‌, ధర్మేందర్‌ యాదవ్‌లను హైదరాబాద్‌ ఈడీ అధికారులు తమ కార్యాలయానికి పిలిచి ప్రశ్నించారు.

కళ్లు తిరిగి నీరసంగా..

ఈడీ కార్యాలయానికి వచ్చిన ఎల్ రమణ.. ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల రమణ గుండె సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకున్నారు. విచారణ నిమిత్తం వచ్చిన ఆయన.. అక్కడి భవనంలో మూడో అంతస్తుకు వెళ్లేందుకు లిఫ్ట్‌ వినియోగించకుండా మెట్లు ఎక్కి వెళ్లారు. ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన వెంటనే అధికారులను రమణ మంచినీరు అడిగినట్లు సమాచారం. కళ్లు తిరిగి నీరసంగా అనిపించడంతో విషయాన్ని ఈడీ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. చాలా సేపటివరకు రమణ పరిస్థితి అలాగే ఉండడంతో అధికారులు స్పందించి హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించిన అనంతరం సోమాజిగూడలోని యశోద ఆస్పత్రికి తరలించారు. దాదాపు రెండు గంటల పాటు ఈడీ కార్యాలయంలోనే ఉన్నప్పటికీ నీరసంగా కనిపించడంతో క్యాసినోపై రమణను అధికారులు పెద్దగా ప్రశ్నించలేకపోయారని సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని