Telangana News: పలు కీలక నిర్ణయాలకు తెలంగాణ కేబినెట్‌ ఆమోదం

ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 5గంటలకు పైగా రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ పలు కీలక అంశాలపై చర్చించింది.

Updated : 10 Dec 2022 22:13 IST

హైదరాబాద్‌: ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన 5గంటలకు పైగా రాష్ట్ర మంత్రి వర్గం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కేబినెట్‌ పలు కీలక అంశాలపై చర్చించింది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, దళితబంధు, రైతు బంధు, పోడు భూముల వ్యవహారంపై కేబినెట్‌ సుదీర్ఘంగా చర్చించింది. వీటితో పాటు పలుశాఖల్లో పోస్టుల భర్తీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. బీసీ సంక్షేమశాఖలోని పలు గురుకులాల్లో కొత్త ఉద్యోగాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.  పెరుగుతున్న జనాభా, మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా పోలీసు శాఖలో కొత్తగా సైబర్‌ సేఫ్టీ బ్యూరో పరిధిలో 3,966 పోస్టుల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

బీసీ గురుకులాల్లో 2,591 కొత్త పోస్టులకు ఆమోదం..

బీసీ గురుకులాల్లో 2,591 కొత్త పోస్టులకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. బీసీ సంక్షేమశాఖలో మహాత్మాజ్యోతిబాపూలే గురుకుల విద్యాసంస్థల్లోని పలు విభాగాల్లో నియామకాలు చేపట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత విద్యా సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన 15 డిగ్రీ కళాశాలలు, 4 జూనియర్‌ కళాశాలలు, 33 పాఠశాలల్లో బోధన, బోధనేతర సిబ్బంది కోసం కొత్త నియామకాలు చేపట్టనున్నారు. 

ఆర్‌అండ్‌బీ శాఖలో 472 అదనపు పోస్టులు 

రహదారులు, భవనాలశాఖ పునర్‌ వ్యవస్థీకరణకు ఆమోదం తెలిపిన కేబినెట్‌ .. శాఖలోని పలు విభాగాల్లో 472 అదనపు పోస్టులు మంజూరు చేసింది. ఇందులో కొత్తగా 3సీఈ, 12 ఎస్ఈ, 13ఈఈ, 102 డీఈఈ, 163 ఏఈఈ, 28 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులతో పాటు పలు సాంకేతిక, సాంకేతికేతర పోస్టులు ఉన్నాయి. వీటికి సంబంధించిన నియామక ప్రక్రియ చేపట్టాలని ఆర్‌అండ్‌బీశాఖను  కేబినెట్ ఆదేశించింది. పదోన్నతుల ప్రక్రియను కూడా సత్వరమే పూర్తి చేయాలని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పెరుగుతున్న అభివృద్ధి, పని విస్తృతికి అనుగుణంగా ఆర్అండ్‌బీ శాఖలోని విభాగాలను పటిష్టం చేయాలని, ప్రజా రవాణా వ్యవస్థను మెరుగుపరచాలని మంత్రివర్గం నిర్ణయించింది. శాఖలో అధికార వికేంద్రీకరణకు ఆమోదం తెలిపింది. అవసరమైన అదనపు ఉద్యోగ నియామకాలు చేపట్టాలని, నూతన కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ ఆదేశించింది. అందుకు అదనపు నిధులు కూడా మంజూరు చేసింది.పెరిగిన కొత్త ఉద్యోగాలతో పాటు, ఆర్ అండ్ బీ శాఖలో పరిపాలనా బాధ్యతల వికేంద్రీకరణకు అనుగుణంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యాలయాల నిర్మాణం, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని కేబినెట్ నిర్ణయించింది. శాఖలో 3 చీఫ్ ఇంజనీర్, 10 సర్కిల్, 13 డివిజన్, 79 సబ్ డివిజన్ కార్యాలయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. శాఖను మరింత పటిష్టం చేయడం, పనులు చేపట్టేందుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అదనపు నిధులను కూడా కేటాయించింది. కాలానుగుణంగా చేపట్టే రోడ్ల మరమ్మతుల కోసం రూ.1865 కోట్లు మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని