TS: పరిశ్రమల్లో స్థానికులకే ఉద్యోగాలు

రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి తెలంగాణ కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల...............

Published : 06 Aug 2020 00:37 IST

నూతన సచివాలయ నమూనాకు కేబినెట్‌ ఆమోదం

హైదరాబాద్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర మంత్రి వర్గం కీలక నిర్ణయాలు తీసుకుంది. రాష్ట్రంలో నెలకొల్పే పరిశ్రమల్లో స్థానికులకు ఎక్కువ ఉద్యోగావకాశాలు కల్పించే నూతన విధానానికి ఆమోదముద్ర వేసింది. సచివాలయ నూతన భవన సముదాయం నిర్మాణానికి ఆమోదం తెలిపింది. తూర్పు అభిముఖంగా ఏడు అంతస్తుల్లో కొత్త సచివాలయం నిర్మాణానికి సంబంధించిన డిజైన్లకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చెన్నైకి చెందిన ఆర్కిటెక్ట్‌లు ఆస్కార్‌, పొన్ని ఈ నమూనాలను రూపొందించిన విషయం తెలిసిందే. తొలుత ఆరు అంతస్తుల్లో నిర్మించాలని నిర్ణయించినప్పటికీ, సీఎం కేసీఆర్‌ ఆదేశాల మేరకు భవన నిర్మాణాన్ని ఏడు అంతస్తులకు పెంచారు. ఏడో అంతస్తులో సీఎం కార్యాలయం నిర్మించనున్నారు.

స్థానికులకే పెద్దపీట

రాష్ట్రం ఏర్పడిన తర్వాత టీఎస్‌ ఐపాస్‌ చట్టం ద్వారా కొత్త పారిశ్రామిక అనుమతుల విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీనివల్ల పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయి. ఇలా వస్తున్న పరిశ్రమల్లో రాష్ట్ర యువతకు ఎక్కువ ఉద్యోగాలు దొరికేలా విధానం రూపొందించాలని పరిశ్రమల శాఖను ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ ఆధ్వర్యంలో కసరత్తు చేసి ముసాయిదాను పరిశ్రమల శాఖ రూపొందించింది.దీనిపై ముఖ్యమంత్రి అధ్యక్షతన బుధవారం జరిగిన కేబినెట్‌ చర్చించింది. స్థానికులకు ఎక్కువ ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలకు అదనపు ప్రోత్సాహకాలు అందించాలని కేబినెట్‌ నిర్ణయించింది. పరిశ్రమల్లో ఉన్న మానవ వనరుల కేటాయింపును రెండు విభాగాలుగా విభజిస్తూ ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మొదటి విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 70 శాతం అవకాశాలు ఇవ్వనున్నారు. నైపుణ్యం కలిగిన మానవవనరుల్లో స్థానికులకు 50 శాతం ఉద్యోగాలు కేటాయించనున్నారు. రెండో విభాగంలో పాక్షిక నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 80 శాతం, నైపుణ్యం కలిగిన మానవ వనరుల్లో స్థానికులకు 60 శాతం ఉద్యోగాలు కేటాయించాలని కేబినెట్‌ నిర్ణయించింది. అలాగే హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమలు ఒకే చోట కాకుండా నగరం నలువైపులా విస్తరించాలని కేబినెట్‌ అభిప్రాయపడింది. హైదరాబాద్‌ పశ్చిమ ప్రాంతంలో తప్ప మిగతా చోట్ల కంపెనీలు పెట్టే వారికీ అదనపు ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది.

మరిన్ని నిర్ణయాలు
* హైదరాబాద్‌ గ్రిడ్‌ పాలసీకి ఆమోదం
రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల వాడకం ప్రోత్సహించడం.
* తెలంగాణ స్టేట్‌ ఎలక్ట్రానిక్‌ వెహికల్‌ అండ్‌ ఎనర్జీ స్టోరేజ్ సొల్యూషన్‌ పాలసీకి ఆమోదం.
ప్రత్యేక రాయితీలతో రాష్ట్రంలో ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీని ప్రోత్సహించాలని నిర్ణయం.

* కరోనా నివారణ చర్యల కోసం ఇటీవల విడుదల చేసిన రూ.100 కోట్లకు అదనంగా మరో రూ.100 కోట్లు విడుదల.

* రోజుకు 40 వేల వరకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయం.

* అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో మందులు, పీపీఈ కిట్లు,టెస్ట్‌ కిట్లు లక్షల్లో తేవాలి.

పరీక్షల్లో పాజిటివ్‌ తేలగానే హోం ఐసోలేషన్‌ కిట్లు ఇవ్వాలి.

10 లక్షల హోం ఐసోలేషన్ కిట్లు సిద్ధంగా ఉంచాలి.

* ప్రభుత్వాసుపత్రుల్లో సిబ్బంది కొరత ఉంటే తాత్కాలిక పద్ధతుల్లో నియమించేందుకు కలెక్టర్లకు అధికారం.

* రాష్ట్ర వ్యాప్తంగా 10 వేల ఆక్సిజన్‌ బెడ్లను సిద్ధంగా ఉంచాలని నిర్ణయం.

* భవన నిర్మాణ అనుమతులను సరళ తరం చేస్తూ రూపొందించిన టీఎస్‌ బీపాస్‌ పాలసీకి ఆమోదం.

* దుమ్ముగూడెం బ్యారేజీకి సీతమ్మ సాగర్‌గా నామకరణం.

* బస్వాపూర్‌ రిజర్వాయర్‌కు నృసింహ స్వామి రిజర్వాయర్‌గా నామకరణం.

* తుపాకుల గూడెం బ్యారేజీకి సమ్మక్క బ్యారేజీగా నామకరణం.

* అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన పనికిరాని వాహనాలను అమ్మేందుకు ఆమోదం.

* కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు పాఠశాల విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతుల నిర్వహణకు నిర్ణయం.

* అన్ని ప్రవేశ పరీక్షలకు షెడ్యూల్‌ రూపొందించాలని అధికారులకు ఆదేశం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని