Ts news: మరోసారి లాక్‌డౌన్‌ పొడిగింపు

కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ పై  సీఎం కేసీఆర్‌ ఆధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రి వర్గం చర్చించింది. లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

Updated : 08 Jun 2021 23:06 IST

హైదరాబాద్‌:  తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆధ్యక్షతన సమావేశమైన మంత్రి వర్గం కరోనా పరిస్థితులు, లాక్‌డౌన్‌ పై చర్చించింది. లాక్‌డౌన్‌ను మరో పదిరోజుల పాటు పొడిగించాలని మంత్రివర్గం నిర్ణయించింది. లాక్‌డౌన్‌ నిబంధనలు సడిలిస్తూ నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటల నుంచి ఒంటి గంట వరకు ఉన్న లాక్‌డౌన్‌ సడలింపును సాయంత్రం 5గంటల వరకు పొడిగించాలని మంత్రి వర్గం నిర్ణయించింది. ప్రజలు ఇళ్లకు చేరుకునేందుకు మరో గంట సమయం ఇచ్చారు. సాయంత్రం 6 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6గంటల వరకు పూర్తి లాక్‌డౌన్‌ అమల్లో ఉంటుంది.

లాక్‌డౌన్‌ మూడో విడతపై గత నెల 30న మంత్రి మండలి సమావేశమై ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు వెసులుబాటు కల్పించింది. ఆ తర్వాత ఇళ్లకు చేరుకునేందుకు గంటసేపు అనుమతించింది. గత నెల 31 నుంచి ఇది అమలవుతోంది. మూడో విడత లాక్‌డౌన్‌ గడువు ఈ నెల 9తో ముగుస్తుండటంతో తదుపరి కార్యాచరణ కోసం మంత్రి మండలి ఇవాళ సమావేశమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నిబంధనలతో దుకాణాలు, వ్యాపార సముదాయాలు మధ్యాహ్నం ఒంటి గంట వరకు నడుస్తున్నాయి. దాన్ని సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఆంక్షలను మరింత సడలించాలని ప్రభుత్వం భావించింది.

ఆ ప్రాంతాల్లో మధ్యాహ్నం ఒంటి గంట వరకే..

రాష్ట్ర వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సమయాన్ని రాష్ట్ర ప్రభుత్వం సడలించినప్పటికీ కొవిడ్‌ ఉద్ధృతి కొనసాగుతోన్న కొన్ని ప్రాంతాల్లో తాజా సడలింపులు వర్తించవని ప్రభుత్వం వెల్లడించింది. రాష్ట్రంలోని సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ నియోజకవర్గాల పరిధిలో ఇప్పుడు కొనసాగుతున్న ఆంక్షలను యథావిధిగా కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.

అర్హులకు రేషన్‌ కార్డులు..

దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్‌కార్డులు మంజూరు చేయాలని మంత్రివర్గం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా 4,46,169 మంది అర్హులకు రేషన్‌ కార్డులను అధికారులు జారీ చేయనున్నారు. ఈ మేరకు 15 రోజుల్లో రేషన్‌ కార్డులు మంజూరు చేయాలని సంబంధిత అధికారులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలి..

వానాకాలం సాగుకు సంబంధించి వ్యవసాయశాఖ సంసిద్ధతపై మంత్రివర్గం సమీక్షించింది. రాష్ట్రంలో కాళేశ్వరం సహా ఇతర సాగునీటి ప్రాజెక్టుల పరిధిలో వ్యవసాయ సాగు భారీగా పెరగడంపై కేబినెట్‌ హర్షం వ్యక్తం చేసింది. గత ఏడాది కోటికిపైగా ఎకరాల్లో మూడుకోట్ల టన్నుల వరి దిగుబడి రావడంపై సంతోషం వ్యక్తం చేసింది. సాకుగు కృషి చేసిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, అధికారులు, సిబ్బందిని కేబినెట్‌ అభినందించింది. వానాకాలం సాగు కోసం రైతులను పూర్తిస్థాయిలో సంసిద్ధం చేయాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది.

మంత్రివర్గం ఆమోదించిన మరిన్ని అంశాలు.. 

* రాష్ట్రంలోని రేషన్ డీలర్ల కమీషన్ సహా ఇతర సమస్యలు, ప్రజా పంపిణీ వ్యవస్థలోని సమస్యల పరిష్కార మార్గాల సూచనకై క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు.

* హైదరాబాద్ జిల్లా మినహా పాత ఉమ్మడి తొమ్మిది జిల్లాల్లో ‘తెలంగాణ స్పెషల్ ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం.

* ప్రభుత్వ ఆస్పత్రుల స్థితిగతులు, మెరుగైన సౌకర్యాలు, సిబ్బంది, ఇతర మౌలిక సౌకర్యాలు సమీక్షించేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటుకు 

కరోనా మూడో వేవ్ రానున్నదనే వార్తల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ముందస్తు చర్యలు చేపట్టాలని, అవసరమైన మౌలిక వసతులు, సిబ్బంది,  ఔషదాలను సమకూర్చుకోవాలని కేబినెట్ ఆదేశాలు జారీ చేసింది. 

తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించాలని కేబినెట్ నిర్ణయం. 

సత్తుపల్లి, మధిర పట్టణాల్లో కొత్తగా 100 పడకల ఆసుపత్రుల నిర్మాణం. ఆయా చోట్ల ప్రస్తుతం ఉన్న ఆసుపత్రులను మాతా శిశు సంరక్షణ కేంద్రాలుగా వినియోగించుకోవాలని నిర్ణయం.

సూర్యాపేటలో ప్రస్థుతం ఉన్న 50 పడకల మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని 200 పడకలకు పెంచాలని కేబినెట్ నిర్ణయం. 

రాష్ట్రంలోని అన్ని స్థాయిల్లోని ఆసుపత్రుల్లో రోగుల సహాయార్ధం వచ్చేవారికోసం వసతి కేంద్రాలను ఏర్పాటుకు తక్షణమే చర్యలు చేపట్టాలని వైద్యశాఖకు ఆదేశాలు.

ఉచిత రోగనిర్ధారణ పరీక్ష (డయాగ్నొస్టిక్‌) కేంద్రాలను  19 జిల్లా ఆసుపత్రులతో పాటుగా మిగతా అన్ని జిల్లా కేంద్రాల్లోనూ ఏర్పాటు చేయాలి. అన్ని జిల్లాల్లోని డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో ఈసీజీ, డిజిటల్ ఎక్స్ రే, అల్ట్రాసౌండ్, టుడీ ఈకోతో పాటు కాన్సర్ స్క్రీనింగ్ కోసం ‘మామో గ్రామ్’ యంత్రాలను అందుబాటులోకి తెస్తారు.

ఎలర్జీ సంబంధిత వ్యాధి నిర్ధరణ పరీక్షలు, చికిత్స కోసం హైదరాబాద్, వరంగల్, సిద్దిపేటలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేయాలి.

పెరుగుతున్న రోగుల రద్దీ దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్రంలోని డయాలసిస్ కేంద్రాలలో మరిన్ని యంత్రాలను అమర్చడంతోపాటు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయం.

* క్యాన్సర్‌తో బాధపడుతున్న వారికి జిల్లా కేంద్రాల్లోనే కీమో థెరపీ, రేడియో థెరపీ చేసేందుకు అవసరమైన మౌలిక వసతులతో జిల్లాల్లో కేన్సర్ చికిత్స కేంద్రాలను ఏర్పాటు చేస్తారు.

అన్ని ఆసుపత్రుల్లో అవసరాలకు సరిపోయే విధంగా బ్లడ్ బ్యాంకులు ఆధునీకరించాలి. అవసరమైన మేరకు కొత్త బ్లడ్ బ్యాంకులను ఏర్పాటు చేయాలి,

ఆర్థోపెడిక్, న్యూరాలజీ తదితర ప్రత్యేక విభాగాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన మౌలిక వసతులను కల్పించాలని, నూతన సిబ్బంది నియామకాలకు అనుమతి.

వరంగల్లో ఖాళీ చేస్తున్న జైలు ప్రదేశంలో ఎయిమ్స్ తరహాలో ఆసుపత్రి ఏర్పాటుకు అనుమతి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని