CM Kcr: 5వేల అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టుల భర్తీకి కేబినెట్‌ ఆమోదం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో దాదాపు 5గంటలకు పైగా సాగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల ఆసరా పింఛన్లకు

Updated : 11 Aug 2022 21:35 IST

హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో దాదాపు 5గంటలకు పైగా సాగిన కేబినెట్‌ సమావేశం ముగిసింది.  రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 36 లక్షల ఆసరా పింఛన్లకు అదనంగా  కొత్తగా మరో 10 లక్షల పింఛన్లు ఇవ్వాలని మంత్రి వర్గం తీర్మానించింది.  ఆగస్టు 15 నుంచి పింఛన్లు పంపిణీ చేయనున్నారు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల సందర్భంగా సత్ప్రవర్తన కలిగిన 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్‌ నిర్ణయించింది. ఈనెల 21న నిర్వహంచ తలపెట్టిన శాసనసభ, స్థానిక సంస్థల సమావేశాలను రద్దు చేయాలని నిర్ణయించారు. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఉన్నందున ప్రజాప్రతినిధుల నుంచి వినతులు రావడంతో ప్రత్యేక సమావేశాల రద్దుకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో 5,111 అంగన్‌వాడీ టీచర్లు, ఆయా పోస్టులు భర్తీకి కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై మంత్రివర్గ భేటీలో సమగ్ర చర్చ జరిగింది. ఈ ఏడాది రాష్ట్ర ఆదాయంలో15.3 శాతం  వృద్ధి నమోదైందని అధికారులు వివరించారు. కేంద్రం నిధులు తగ్గినా వృద్ధిరేటు నమోదు గమనార్హమని ఈ సందర్భంగా సీఎం అన్నారు. రాష్ట్ర నోడల్‌ ఖాతాలు అనే కొత్త పద్ధతితో రాష్ట్రాలకిచ్చే నిధుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని అధికారులు తెలిపారు. ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితుల్లో కోతలు విధించారని, కోతలు లేకుంటే ఆదాయం పెరిగేదని.. వృద్ధిరేటు 22శాతం నమోదయ్యేదని పేర్కొన్నారు. సీఎస్‌ఎస్‌లో 8 ఏళ్లలో రూ.47,312 కోట్లు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ అధికారులు వెల్లడించారు. నాలుగేళ్లలో రైతు బంధుకు రూ.58,024 కోట్లు ఇచ్చామని తెలిపారు.   

కేబినెట్‌ నిర్ణయాలివే...

* కోఠిలో ఈఎన్‌టీ ఆసుపత్రికి 10 స్పెషలిస్టు వైద్య పోస్టులు మంజూరు. ఆసుపత్రిలో సౌకర్యాలతో ఈఎన్‌టీ టవర్‌ నిర్మించాలని నిర్ణయం.

* గ్రామ కంఠంలో ఇళ్ల నిర్మాణం, ప్రజా సమస్యలపై కమిటీ వేయాలని నిర్ణయం. సమస్యల పరిష్కారంపై 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలి.

* వికారాబాద్‌లో ఆటోనగర్‌ నిర్మాణానికి 15 ఎకరాలు కేటాయింపు.

* తాండూరు మార్కెట్‌ కమిటీకి యాలాలలో 30 ఎకరాలు కేటాయింపు.

* షాబాద్‌లో బండల పాలిషింగ్‌ యూనిట్ల ఏర్పాటుకు టీఎస్‌ఐఐసీ ఆధ్వర్యంలో 45 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం.

* ఈనెల 16న రాష్ట్ర వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన జరపాలి. 

* సరోజినీదేవి కంటి ఆసుపత్రిలో భవన సముదాయం నిర్మాణానికి ప్రతిపాదనల తయారు చేయాలని మంత్రి వర్గం ఆదేశించింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని