Hyderabad Metro: భవిష్యత్తులో హైదరాబాద్‌ మెట్రో మరింతగా విస్తరించాలి: సీఎం కేసీఆర్‌

కరోనా వల్ల ప్రయాణాలు తగ్గి ఆర్థికంగా నష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ మెట్రోను ఆదుకునేందుకు అన్ని అంశాలు అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఉన్నతాధికారులు కలిశారు..

Published : 14 Sep 2021 22:32 IST

హైదరాబాద్: కరోనా వల్ల ప్రయాణాలు తగ్గి ఆర్థికంగా నష్టాల్లో ఉన్న హైదరాబాద్‌ మెట్రోను ఆదుకునేందుకు అన్ని అంశాలు అన్వేషిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను ఎల్‌అండ్‌టీ మెట్రో రైలు ఉన్నతాధికారులు కలిశారు. మెట్రో రైలు ఆర్థిక నష్టాలు, బ్యాంకు అప్పులు, రోజురోజుకు పేరుకుపోతున్న వడ్డీల వివరాలను సీఎంకు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వేగంగా అభివృద్ధి చెందుతోన్న హైదరాబాద్‌కు మెట్రో సేవలు ఎంతో అవసరమని.. భవిష్యత్తులో మెట్రో మరింతగా విస్తరించాల్సి ఉందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ అభిప్రాయపడ్డారు.

కరోనా ప్రభావంతో మెట్రో అప్పుల్లో కూరుకుపోవడం, వడ్డీలకు వడ్డీలు కట్టాల్సి రావడం శోచనీయం అని పేర్కొన్నారు. అన్ని రంగాలను ఆదుకున్నట్లే హైదరాబాద్‌ మెట్రోను కూడా గాడిలో పెట్టేందుకు తమ వంతు కృషి చేస్తామని సీఎం హామీ ఇచ్చారు. ఏ విధానం అవలంబించడం ద్వారా పూర్వ వైభవం తీసుకురాగలమో అవగాహన కోసం అత్యున్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఈ కమిటీలో మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్‌ రెడ్డి, సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులు సభ్యులుగా ఉంటారని తెలిపారు. అన్ని అంశాలపై అధ్యయనం చేసి అతి త్వరలో నివేదిక అందించాలని కమిటీని సీఎం ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని