బ్రేకింగ్‌.. ఏపీ అంబులెన్సులకు అనుమతి  

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ...

Published : 15 May 2021 01:09 IST

సూర్యాపేట: రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్స్‌ల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేయడంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌ల విషయంలో సూర్యాపేట జిల్లాలోని రామాపురం చెక్‌పోస్ట్‌ అమలు చేసిన ఆంక్షలను సడలించారు. దీంతో కొద్దిసేపటి నుంచి ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్‌లను పోలీసులు అనుమతిస్తుండటంతో రోగుల బంధువులు ఊపిరిపీల్చుకుంటున్నారు. ఎలాంటి పాసులు లేకున్నా కొవిడ్‌ బాధితుల అంబులెన్సులను పోలీసులు అనుమతిస్తున్నారు. అలాగే, జోగులాంబ జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద కూడా ఏపీ అంబులెన్సులకు పోలీసులు అనుమతిస్తున్నారు. ఈ-పాస్‌ లేకున్నా హైదరాబాద్‌ వైపు వెళ్లేందుకు కొవిడ్‌ రోగులతో వెళ్లే అంబులెన్స్‌లను అనుమతిస్తున్నారు.

హైదరాబాద్‌కు వస్తున్న అంబులెన్స్‌లను సరిహద్దుల్లో నిలిపివేస్తున్నారంటూ విశ్రాంత ఐఆర్‌ఎస్‌ అధికారి వెంకట క్రిష్ణారావు దాఖలు చేసిన హౌస్‌మోషన్‌ పిటిషన్‌పై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమా కోహ్లి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తెలంగాణ సర్కార్‌ తీరుపట్ల ఉన్నత న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేసింది. తెలంగాణకు వచ్చే అంబులెన్స్‌లను ఆపే హక్కు మీకెవరిచ్చారంటూ రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలపై స్టే విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే దాకా తమ ఆదేశాలు అమలులో ఉంటాయని స్పష్టంచేసింది. అంబులెన్సులను నియంత్రించేలా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులూ ఇవ్వొద్దని, మరో రూపంలో కూడా ప్రయత్నించరాదని ఆదేశించింది. ఆస్పత్రుల్లో చేరేందుకు కంట్రోల్‌రూమ్‌ అనుమతి అక్కర్లేదని స్పష్టం చేసింది. ప్రజలు కోరుకుంటే కంట్రోల్‌ రూమ్‌కు ఫోన్‌ చేయవచ్చని, ఫోన్ చేసిన వారికి కంట్రోల్‌రూమ్‌ సహకరించాలని ఆదేశించింది. రెండు వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని కోరుతూ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కేంద్రానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను జూన్‌ 17వ తేదీకి వాయిదా వేసింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని